Anand Mahindra: ట్విటర్‌లో ‘వాక్‌ స్వాతంత్ర్యం’.. మస్క్‌ రైట్‌ అన్న ఆనంద్‌ మహీంద్రా

అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌.. మైక్రోబ్లాకింగ్‌ సైట్‌ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ‘వాక్‌ స్వాతంత్ర్యం’పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ట్విటర్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రాధాన్యమిస్తానని మొదట్నుంచీ మస్క్‌

Published : 27 Apr 2022 17:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌.. మైక్రోబ్లాకింగ్‌ సైట్‌ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ‘వాక్‌ స్వాతంత్ర్యం’పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ట్విటర్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రాధాన్యమిస్తానని మొదట్నుంచీ మస్క్‌ చెబుతున్నారు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా భారత ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా దీనిపై స్పందిస్తూ.. మస్క్‌ అభిప్రాయంతో ఏకీభవించారు.

ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు మస్క్‌ ఒప్పందం చేసుకున్న తర్వాత ఆనంద్‌ మహీంద్రా తన సోషల్‌ మీడియా ఖాతాలో ఓ పోల్‌ పెట్టారు. ‘‘ట్విటర్‌లో అభిప్రాయాలు వ్యక్తీకరించేందుకు తక్కువ నిబంధనలు ఉంటాయని ఎలాన్‌ మస్క్‌ హామీ ఇచ్చారు. దీన్ని మీరు సమర్థిస్తున్నారా? లేదా?’’ అని తన ఫాలోవర్లను అడిగారు. 80శాతం మంది దీన్ని సమర్థిస్తున్నట్లు చెప్పారు.

తాజాగా ఈ ‘భావ ప్రకటనా స్వేచ్ఛ’పై మరోసారి స్పందించిన మహీంద్రా.. ‘‘వాక్‌ స్వాతంత్ర్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అర్థమవుతోంది. ట్విటర్‌లో అభిప్రాయాలు పంచుకునేందుకు, తమ భావాలను వ్యక్తీకరించేందుకు మరింత మందికి అవకాశం ఇచ్చేలా మార్పులు జరగడాన్ని నేను కూడా అంగీకరిస్తున్నా. ఎందుకంటే, విద్వేషాలను పెంచేవారిని సెన్సార్‌షిప్‌ అణచివేయలేదు. అయితే, ట్విటర్‌ లాంటి ఓ వేదిక.. అలాంటి వారిని బయటపెట్టి దర్యాప్తు సంస్థలు వారిపై చర్యలు తీసుకునేలా చేయగలదు. ఏదేమైనా, నకిలీ వార్తలు, నకిలీ పోస్ట్‌లును అరికట్టి.. రియల్‌ టైంలో వాస్తవ సమాచారాన్ని అందించే మరిన్ని సంస్థలు, వేదికలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని రాసుకొచ్చారు.

ట్విటర్‌ కొనుగోలు చేయాలన్న ఆలోచన వచ్చినప్పటినుంచి వాక్‌ స్వాతంత్య్రం గురించి మాట్లాడుతోన్న మస్క్‌.. తాజాగా ఆ పదంపై స్పష్టత ఇచ్చారు. ‘ఫ్రీ స్పీచ్’ అనేది చట్టానికి లోబడి ఉండాలనేదే తన అభిప్రాయమని, చట్టానికి మించిన సెన్సార్‌ షిప్‌ను తాను వ్యతిరేకిస్తానని తాజాగా మస్క్‌ వివరణ ఇచ్చారు. ఇక, ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసేందుకు మస్క్‌ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అంతర్జాతీయ సాంకేతిక రంగంలోనే మూడో అతిపెద్ద కొనుగోలు లావాదేవీగా ఇది నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని