Apple: భారత యూజర్లకు యాపిల్ షాక్‌.. కార్డు చెల్లింపులను నిలిపివేసిన సంస్థ!

భారత యూజర్లకు యాపిల్‌ (apple) సంస్థ షాకిచ్చింది. సబ్‌స్క్రిప్షన్‌, యాప్‌ల కొనుగోళ్లకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డు చెల్లింపులను నిలిపివేసింది. కొత్త నిబంధనల ప్రకారం యాప్‌ స్టోర్‌లో కొత్త యాప్‌ల కొనుగోళ్లతో పాటు ఐక్లౌడ్‌ ప్లస్‌, యాపిల్‌ మ్యూజిక్‌ వంటి మీడియా కంటెంట్‌ను కొనుగోళ్లకు కార్డుల ద్వారా చేసే చెల్లింపులను అనుమతించడం లేదు.

Published : 05 May 2022 19:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత యూజర్లకు యాపిల్‌ (apple) సంస్థ షాకిచ్చింది. సబ్‌స్క్రిప్షన్‌, యాప్‌ల కొనుగోళ్లకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డు చెల్లింపులను నిలిపివేసింది. కొత్త నిబంధనల ప్రకారం యాప్‌ స్టోర్‌లో కొత్త యాప్‌ల కొనుగోళ్లతో పాటు ఐక్లౌడ్‌ ప్లస్‌, యాపిల్‌ మ్యూజిక్‌ వంటి మీడియా కంటెంట్‌ను కొనుగోళ్లకు కార్డుల ద్వారా చేసే చెల్లింపులను అనుమతించడం లేదు. ప్రస్తుతానికి ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ, యాపిల్‌ ఐడీ బ్యాలెన్స్‌ వంటి పద్ధతులకు మాత్రమే యాపిల్‌ అనుమతిస్తోంది. గతేడాది అక్టోబరులో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకువచ్చిన కొత్త ఆటో డెబిట్‌ విధానమే ఇందుకు కారణం.

‘‘భారత యూజర్ల పునరావృత లావాదేవీలపై కొత్త రూల్స్‌ ప్రభావం చూపనున్నాయి. చెల్లింపుల సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కొన్ని లావాదేవీలను బ్యాంకులు, కార్డు జారీ చేసిన సంస్థలు తిరస్కరించవచ్చు’’ అని యాపిల్‌ సంస్థ తన సపోర్ట్‌ పేజీలో పేర్కొంది. నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ, యాపిల్‌ ఐడీ బ్యాలెన్స్‌ పేమెంట్స్‌ను మాత్రమే అనుమతిస్తున్నట్లు యాపిల్‌ తెలిపింది.

మరోవైపు యాపిల్‌ తీసుకొచ్చిన ఈ మార్పుపై యూజర్లు సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు చేస్తున్నారు. క్రెడిట్‌/ డెబిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు చేసేందుకు ప్రయత్నిస్తే ‘దిస్‌ కార్డ్‌ టైప్‌ ఈజ్‌ నో లాంగర్‌ సపోర్టెడ్‌’ అని చూపుతోందంటూ పేర్కొంటున్నారు. ఒక్క యాపిలే కాదు ఆర్‌బీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధన వల్ల అటు గూగుల్ యూజర్లు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. గూగుల్‌ ప్లే, యూట్యూబ్‌లో కార్డు కొనుగోళ్ల సమయంలో ఇబ్బంది పడుతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో సైతం ఇదే తరహా ఇబ్బంది ఎదురైనప్పటికీ.. ‘యూపీఐ ఆటో పే’ సదుపాయంతో ఆ సమస్యను నెట్‌ఫ్లిక్స్‌ అధిగమించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని