Apple India revenue: భారత్‌లో రెండింతలైన ‘యాపిల్‌’ ఆదాయం

Apple India revenue: టెక్‌ దిగ్గజం ‘యాపిల్‌’ ఆదాయం భారత్‌లో దాదాపు రెండింతలు కావడం విశేషం....

Published : 29 Jul 2022 12:01 IST

న్యూయార్క్‌: టెక్‌ దిగ్గజం ‘యాపిల్‌’ ఆదాయం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రెండు శాతం పెరిగి 83 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. అదే సమయంలో భారత్‌లో కంపెనీ ఆదాయం దాదాపు రెండింతలు కావడం విశేషం. ఈసారి ఆదాయం తమ అంచనాలను మించిందని సీఈఓ టిమ్‌ కుక్‌ వెల్లడించారు. సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు, విదేశీ మారకంలో బలమైన ప్రతికూలతలు, రష్యాలో సంస్థ వ్యాపారంపై ఎదురుదెబ్బ వంటి సవాళ్లున్నప్పటికీ.. మూడో త్రైమాసికంలో బలమైన ఆదాయం నమోదైందని తెలిపారు.

అమెరికా, ఐరోపా, ఇతర ఆసియా-పసిఫిక్‌ ప్రాంతాల్లో తమ కంపెనీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైందని టిమ్‌ కుక్‌ వివరించారు. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు, వర్ధమాన ఆర్థిక వ్యవస్థల్లోనూ మెరుగైన వృద్ధి నమోదైందని తెలిపారు. భారత్‌తో పాటు బ్రెజిల్‌, ఇండోనేషియా, వియత్నాం దేశాల్లో ఆదాయం రెండింతలైందని పేర్కొన్నారు. ఈ దేశాల్లో ఆదాయాలకు ఐఫోన్‌ విక్రయాలు కీలకంగా నిలిచాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇంకా ఐఫోన్‌ అమ్మకాలు తక్కువగానే ఉన్నాయన్నారు. ఆయా ప్రదేశాల్లోనూ విస్తరణ ప్రణాళికలు కొనసాగుతాయని వివరించారు.

కంపెనీకి సర్వీసుల ద్వారా వచ్చే ఆదాయం 12 శాతం పెరిగి 19.6 బిలియన్‌ డాలర్లుగా నమోదైనట్లు సీఎఫ్‌ఓ, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ల్యూకా మేస్ట్రీ తెలిపారు. ఇది వివిధ దేశాల్లో తమ పోర్ట్‌ఫోలియో ఎంత బలంగా ఉందో నిరూపిస్తోందన్నారు. వివిధ కంపెనీలు యాపిల్‌ ఉత్పత్తుల కొనుగోలుపై పెట్టుబడులను పెంచుతున్నాయని తెలిపారు. అందుకు విప్రోను ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. కొత్త ఉద్యోగులను ఆకర్షించడానికి దీన్ని వారొక వ్యూహంగా ఉపయోగించుకుంటున్నారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని