ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న మీకు వ‌ర్తిస్తుందా?

భార‌త‌దేశంలోని ఏప్ర‌దేశంలోనూ ప‌క్కా ఇల్లు లేని వారు పీఎమ్ఏవై-యూ కింద వ‌డ్డీ రాయితీ రుణం పొందేంద‌కు అర్హులు.....

Published : 25 Dec 2020 16:29 IST

భార‌త‌దేశంలోని ఏప్ర‌దేశంలోనూ ప‌క్కా ఇల్లు లేని వారు పీఎమ్ఏవై-యూ కింద వ‌డ్డీ రాయితీ రుణం పొందేంద‌కు అర్హులు.

ప్ర‌భుత్వ హౌసింగ్ ప‌థ‌కం, ప్ర‌ధాన్ మంత్రి ఆవాస్ యోజ‌నను రెండు భాగాలుగా విభ‌జించారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-అర్బ‌న్ (పీఎమ్ఏవై-యూ), ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ‌ లేదా రూరల్ (పీఎమ్ఏవై-జీ)

2022 నాటికి ప‌క్కా ఇళ్లు నిర్మించాల‌నే ల‌క్ష్యంతో పీఎమ్ఏవైను ప్ర‌వేశ‌పెట్టారు. పీఎమ్ఏవై-యూ, కింద దాదాపు 65.43 ల‌క్ష‌ల‌ ఇళ్లు ఇప్ప‌టికే మంజూరు చేశారు. వాటిలో 35.49 ల‌క్ష‌ల ఇళ్లు నిర్మాణంలో ఉండ‌గా, 12.26 ల‌క్ష‌ల ఇళ్లు పూర్త‌య్యాయి. 12.19 ల‌క్ష‌ల గృహాల‌లో ల‌భ్దిదారులు నివ‌సిస్తున్నారు.

పీఎమ్‌ఏవై కింద గృహాన్ని పొందేందుకు అర్హ‌త క‌లిగి ఉండి, భార‌త‌దేశంలో ఎక్క‌డా ప‌క్కా ఇళ్లు లేనివారు ఈ ప‌థ‌కం కింద రుణం పొంద‌వ‌చ్చు. రుణం పొందిన వారికి వడ్డీలో రాయితీ ల‌భిస్తుంది. రూ.3 ల‌క్ష‌ల‌లోపు కుటుంబ వార్షిక ఆదాయం ఉన్న‌ ఆర్థిక బ‌ల‌హీన వ‌ర్గాల(ఈడ‌బ్ల్యూఎస్‌) వారు, రూ.3 నుంచి రూ.6 ల‌క్ష‌ల‌లోపు కుటుంబ వార్షిక ఆదాయం ఉన్న‌ త‌క్కువ ఆదాయం గ‌ల(ఎల్ఐజీ) కుటుంబాల వారు, రూ.6 నుంచి రూ.12 ల‌క్ష‌లు కుటుంబ వార్షిక ఆదాయం ఉన్న‌ మ‌ధ్య‌త‌ర‌గ‌తి గ్రూప్ -I కుటుంబాల వారు, రూ.12 నుంచి 18 ల‌క్ష‌లు కుటుంబ వార్షిక ఆదాయం ఉన్న‌ మ‌ధ్య‌త‌ర‌గ‌తి గ్రూప్ -II (ఎమ్ఐజీ-II) కుటుంబాల వారు అర్హులు.

క్రెడిట్ లింకెడ్ స‌బ్సిడీ స్కీమ్ కింద అన్ని వ‌ర్గాల వారికి వ‌డ్డీ రాయితీని అందిస్తుంది. అర్హులైన ప‌ట్ట‌ణంలో నివ‌సించే పేద‌లకు, ఇల్లు నిర్మాణం, మెరుగుప‌రుచుకోవ‌డం, గ‌దుల‌ను విస్త‌రించ‌డం వంటి ప‌నులకు గృహ రుణాల‌ను వ‌డ్డీ రాయితీతో అందిస్తున్నారు. ఈ రాయితీ, రుణం ఇచ్చిన‌ సంస్థ ద్వారా ల‌బ్ధిదారుల ఖాతాల‌కు నేరుగా క్రెడిట్ చేస్తారు.

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తన వెబ్ సైట్ లో ప్రచురించిన నివేదిక ప్రకారం పీఎమ్ఏవై-జీ లో డిసెంబర్ 13 నాటికి 60.90 లక్షల ఇళ్ళు పూర్తయ్యాయి. వంట స్థలంతో క‌లిపి ఇంటి కనీస పరిమాణం25 చదరపు మీటర్లు ఉంటుంది.

సామాజిక ఆర్థిక కుల గణన (ఎస్ఈసీసీ-2011)ల‌ను అనుస‌రించి, గ్రామ స‌భ‌లు ధృవీక‌రించిన‌ వారిని పీఎమ్ఏవై కింద ల‌బ్ధిదారులుగా ఎంపిక చేస్తారు. నిరాశ్ర‌యులు,ప‌క్కా గృహాలు లేని కుటుంబాల వారికి ప్రాధాన్య‌త ఇస్తారు. కుటుంబ స‌భ్యుల‌లో 16 నుంచి 59 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు గ‌ల పురుషుడు లేన‌ప్పుడు, కుటుంబంలో 16 నుంచి 59 సంవ‌త్స‌రాల మ‌ధ్య పురుషుడు లేకుండా ఒక స్త్రీ, కుటుంబ పెద్ద‌గా ఉన్నప్పుడు, 25 సంవ‌త్స‌రాల‌కు పైబ‌డి చ‌దువుకున్న వ్య‌క్తి లేని కుటుంబాలు, దివ్యాంగుడైన వ్య‌క్తి ఉండి, సంపాద‌నా సామ‌ర్ధ్యం క‌లిగిన వ్య‌క్తి లేని కుటుంబాల‌కు, రోజు వారి ఆదాయంతో జీవించే భూమిలేని కార్మికులు ఈ ప్రాధాన్య‌తా జాబితాలో ఉంటారు.

మీరు పీఎమ్ఏవై కింద వ‌డ్డీ రాయితో రుణం తీసుకునేందుకు అర్హులైతే మీ బ్యాంకు, నేష‌న‌ల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) నుంచి మీ రుణం కోసం క్లెయిమ్ చేస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంకు వెబ్‌సైట్ ప్ర‌కారం - ఒక ఖాతాదారుడు ద‌ర‌ఖాస్తు చేసుకున్న బ‌హుళ అభ్య‌ర్ధ‌న‌ల‌ను ఎన్‌హెచ్‌బీ క్ర‌మ‌బ‌ద్దీక‌రించి డూప్లికేట్ క్ల‌యిమ్‌ను తిర‌స్క‌రిస్తుంది. అర్హ‌త ఉన్న రుణ‌గ్ర‌హీత‌ల‌, రాయితీ మొత్తం బ్యాంకుకి చెల్లిస్తుంది. వ‌డ్డీ రాయితీని, బ్యాంకు స్వీక‌రించిన త‌రువాత‌, అది ల‌బ్ధిదారుని రుణ ఖాతాకు జ‌మ చేస్తారు. రాయితీ నిక‌ర విలువ (ఎన్‌పీవీ) ప్ర‌స్తుతం 9 శాతంగా లెక్కిస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు, రుణ‌గ్ర‌హీత‌కు రూ.8 ల‌క్ష‌ల రుణం ల‌భిస్తే రూ.2.20 ల‌క్ష‌ల‌కు రాయితీ వ‌ర్తిస్తుంది. ఆ మొత్తాన్ని రుణం నుండి ముంద‌స్తుంగా త‌గ్గించ‌వ‌చ్చు. రుణ‌గ్ర‌హీత రూ.5.80 ల‌క్ష‌ల‌కు మాత్ర‌మే ఈఎమ్ఐ చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని