Bitcoin: స్టాక్‌ మార్కెట్‌ సూచీల బాటలో బిట్‌కాయిన్‌..!

ప్రధాన క్రిప్టోకరెన్సీల్లో ఒకటైన బిట్‌కాయిన్‌ విలువ.. స్టాక్‌ మార్కెట్‌ సూచీల తరహాలోనే కదలాడుతోంది.....

Published : 05 Feb 2022 15:17 IST

వాషింగ్టన్‌: ప్రధాన క్రిప్టోకరెన్సీల్లో ఒకటైన బిట్‌కాయిన్‌ విలువ.. స్టాక్‌ మార్కెట్‌ సూచీల తరహాలోనే కదలాడుతోంది. గత రెండు వారాల్లో ఈక్విటీ మార్కెట్లు పుంజుకోగా.. బిట్‌కాయిన్‌ సైతం అదే బాటలో పయనించింది. శనివారం కాయిన్‌ విలువ రెండు వారాల గరిష్ఠానికి చేరుకుంది.

గురువారం నాటి కనిష్ఠం నుంచి బిట్‌కాయిన్‌ విలువ 16 శాతం ఎగబాకి 41,983 డాలర్లకు చేరుకుంది. జనవరి 24 నాటి 32,950.72 డాలర్ల కనిష్ఠం నుంచి 27 శాతం పుంజుకుంది. ఈథేరియమ్‌ బ్లాక్‌చైన్‌ సాంకేతికతకు అనుసంధానమైన ఈథర్‌ కాయిన్‌ విలువ 3,000 డాలర్లకు చేరుకుంది. జనవరి 21 తర్వాత ఈథర్‌ ఈ విలువను అందుకోవడం ఇదే తొలిసారి.

శుక్రవారం బిట్‌కాయిన్‌ విలువ ఏకంగా 11 శాతం ఎగబాకింది. గత ఏడాది జూన్‌ మధ్య నాటి నుంచి ఒకరోజులో కాయిన్‌ ఈ మేర లాభపడడం ఇదే తొలిసారి. అలాగే గతకొన్ని రోజులుగా క్రమంగా కుంగుతూ వస్తున్న బిట్‌కాయిన్‌కు అందిన అతిపెద్ద మద్దతు కూడా ఇదే. అమెరికా మార్కెట్లు ఈ వారాన్ని లాభాల్లో ముగించిన విషయం తెలిసిందే. కీలక టెక్‌ కంపెనీల త్రైమాసిక ఫలితాలు కొంత కలవరపెట్టినప్పటికీ.. వారం మొత్తంలో మాత్రం సూచీలు లాభపడ్డాయి. అదే తరహాలో బిట్‌కాయిన్‌ సైతం ఎగబాకుతూ వచ్చింది.

బిట్‌కాయిన్‌ను ఇప్పటికీ మదుపర్లు ఒక ‘అసెట్‌ క్లాస్‌’గానే చూస్తున్నారని క్రిప్టోకరెన్సీ హెడ్జ్‌ఫండ్‌ టైర్‌ క్యాపిటల్‌ ‘చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌’ ఎడ్‌ హిండీ తెలిపారు. అందువల్లే కాయిన్‌ విలువలో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. స్టాక్‌ మార్కెట్ల సూచీలు కిందకు దిగజారగానే.. మదుపర్లు భయపడి బిట్‌కాయిన్‌ను టెక్‌ స్టాక్‌ల తరహాలో భావించి అమ్మకాలకు దిగుతున్నారని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని