BMW: బీఎండబ్ల్యూ విద్యుత్‌ కారు సెడాన్‌ ఐ4 వచ్చేసింది.. ధరెంతో తెలుసా?

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తన పూర్తి స్థాయి ఎలక్ట్రిక్‌ కారు సెడాన్‌ ఐ4ని భారత్‌ మార్కెట్లోకి విడుదల చేసింది......

Updated : 26 May 2022 16:44 IST

గురుగ్రామ్‌: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తన పూర్తి స్థాయి ఎలక్ట్రిక్‌ కారు సెడాన్‌ ఐ4ని భారత్‌ మార్కెట్లోకి విడుదల చేసింది. దేశంలో ఎలక్ట్రిక్‌ మొబిలిటీ డ్రైవ్‌ను వేగవంతం చేసేందుకు రూ.69.9లక్షల ప్రారంభ ధరతో ఈ-కారును తీసుకొచ్చింది. వచ్చే ఆరు నెలల్లో మూడు విద్యుత్‌ వాహనాలను తీసుకొస్తామని గతేడాది నవంబరులో బీఎండబ్ల్యూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ఎస్‌యూవీ ‘ఐఎక్స్‌’, లగ్జరీ హ్యాచ్‌బ్యాక్‌ ‘మినీ’లను తీసుకొచ్చిన బీఎండబ్ల్యూ.. ఆల్‌ ఎలక్ట్రిక్‌ సెడాన్‌ ‘ఐ4’ను అందుబాటులోకి తెచ్చింది. సెడాన్‌ ఐ4 యూనిట్‌ పూర్తిస్థాయిలో నిర్మించి దిగుమతి చేయనుంది. ఐదో తరం బీఎండబ్ల్యూ ఈడ్రైవ్‌ టెక్నాలజీ కలిగిన ఈ వాహనం.. ఎలక్ట్రిక్‌ మోటార్‌, సింగిల్‌ స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఆధారిత ఇంటిగ్రేటెడ్‌ డ్రైవ్‌ యూనిట్‌ను కలిగి ఉంది. ఈ వాహనం 340 హెచ్‌పీ అవుట్‌పుట్‌తో కేవలం 5.7 సెకన్లలో 0 నుంచి 100 km/hr వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది. ఇది లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా 80.7kWh నెట్ (యూజబుల్) కెపాసిటీ కలిగి ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది.

గత పదేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా తాము ఎలక్ట్రిక్‌ మొబిలిటీకి మార్గదర్శకం చేస్తున్నట్టు బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్‌, సీఈవో విక్రమ్‌ పవాహ్‌ తెలిపారు.  దేశంలోని ఎలక్ట్రో మొబిలిటీలో తమ గ్రూపు అగ్రగామిగా ఉందని, దేశంలోనే తొలిసారి ఎలక్ట్రిక్‌ మిడ్‌సైజ్‌ సెడాన్‌ను పరిచయం చేస్తున్నందుకు తనకెంతో ఆనందంగా ఉందన్నారు. భారత్‌లో తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ విభాగంలో ఇది బీఎండబ్ల్యూ మూడో ఉత్పత్తి అని పేర్కొన్నారు. ఈ వాహనం దేశంలోని ఇతర ఎలక్ట్రిక్‌ వాహనాల కన్నా ఈ కారు భారతదేశంలోని ఇతర ఎలక్ట్రిక్‌ వాహనాల కన్నా 590 కి.మీల రేండ్‌ డ్రైవ్‌ను అందించగలదని  తెలిపారు. బీఎండబ్ల్యూ సెడాన్‌ ఐ4 కారును shop.bmw.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చని, ఈ ఏడాది జులై ప్రారంభం నుంచి డెలివరీలు మొదలవుతాయని కంపెనీ తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని