మెచ్యూరిటీ తర్వాత పీపీఎఫ్‌ ఖాతా పొడిగించొచ్చా?

 పీపీఎఫ్‌ ఖాతా పొడిగింపు కోసం, మీరు మీ బ్యాంక్ లేదా పోస్టాఫీసుకు తెలియజేయాలి

Updated : 18 Jun 2021 17:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతా మెచ్యూరిటీ వ్య‌వ‌ధి 15 సంవత్సరాలు. ఆ త‌ర్వాత మొత్తాన్ని ఉప‌సంహ‌రించుకొని ఖాతాను మూసివేయ‌వ‌చ్చు. కానీ డిపాజిటర్ తన ఖాతాను మూసివేయడం తప్పనిసరి కాదు. మీరు దీన్ని మెచ్యూరిటీ త‌ర్వాత కూడా ఐదేళ్లు.. ఆ త‌ర్వాత మ‌రో ఐదేళ్లు ఇలా కొన‌సాగించ‌వ‌చ్చు. లేదంటే మెచ్యూరిటీ త‌ర్వాత‌ వడ్డీతో సహా మొత్తాన్ని ఉపసంహరించుకొని ఖాతాను మూసివేయ‌వ‌చ్చు. అయితే పీపీఎఫ్ నుంచి మ‌రింత ప్ర‌యోజ‌నం పొందాల‌నుకుంటే పదవీ విరమణ చేసే వరకు దాన్ని కొన‌సాగించ‌డం మంచిది. అప్పుడు చ‌క్ర‌వ‌డ్డీతో క‌లిపి ఎక్కువ లాభం పొందొచ్చు.

చ‌క్ర‌వ‌డ్డీతో ల‌భించే ప్ర‌యోజ‌నం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఏటా పీపీఎఫ్‌లో ఓ లక్ష రూపాయలు పెట్టుబడి పెడతారని అనుకుందాం. 15 సంవత్సరాల సగటు వడ్డీ రేటు 7.5 శాతం. మెచ్యూరిటీ స‌మ‌యానికి సుమారు రూ.31 లక్షలు జ‌మ‌వుతాయి. అయితే అదే వడ్డీ రేటుతో ఈ డబ్బును రెట్టింపు చేయడానికి, 10 సంవత్సరాల కన్నా తక్కువ సమయం పడుతుంది.

* ఖాతాలో కొత్త‌గా డిపాజిట్ చేయాల్సిన అవ‌స‌రం లేకుండా కూడా కొన‌సాగించ‌వ‌చ్చు. అయితే ఈ కొన‌సాగింపు విష‌యాన్ని మీ బ్యాంక్ లేదా పోస్టాఫీసుకు తెలియజేయాలి.
* సంవత్సరంలోపు తెలియ‌జేయ‌క‌పోతే కొత్త‌గా డిపాజిట్ చేసేందుకు వీలుండ‌దు. కానీ, మీరు ఉపసంహరించుకునే వరకు ఖాతాలో ఉన్న మొత్తంపై వడ్డీ రావ‌డం కొన‌సాగుతుంది. ఆర్థిక సంవత్సరంలో ఒకసారి పాక్షిక ఉపసంహరణ చేయవచ్చు.

మీరు మీ డిపాజిట్‌ కొనసాగించాలని నిర్ణయించుకుంటే, ముందు ఫారం- హెచ్ సమర్పించడం తప్పనిసరి. లేకపోతే, మీ ఖాతాలో జమ చేసిన తాజా డిపాజిట్ల‌పై వ‌డ్డీ ల‌భించ‌దు. సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా పొంద‌లేరు.
* ఒకవేళ ఖాతాదారుడు తాజా డిపాజిట్ల‌ను కొనసాగాలని నిర్ణయించుకుంటే... ప్రతి పొడిగించిన ఐదేళ్ల‌ వ్యవధి ప్రారంభంలో ఖాతా బ్యాలెన్స్‌లో 60 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని