Updated : 26 Nov 2021 14:25 IST

china: చైనాలో రవాణా ఓడలు మాయం.. ఎందుకు..?

 ప్రపంచానికి మరో తలనొప్పి

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ప్రపంచ కర్మాగారంగా పేరు తెచ్చుకొన్న చైనాలో ఏ సమస్య ఎదురైనా అది మిగిలిన దేశాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. అతిపెద్ద రేవులున్న చైనాలో గత కొన్ని నెలలుగా వాణిజ్య నౌకలు జాడలేకుండా పోతున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా ప్రపంచ పంపిణీ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. తాజాగా ఈ ఓడల సమాచారం అంతర్జాతీయంగా అందుబాటులో ఉండకపోవడం, క్వారంటైన్‌ నిబంధనలు, కంటైనర్ల కొరత  పీడిస్తున్నాయి. సరుకు రవాణాకు సంబంధించి బుకింగ్స్‌.. ఇతర అంశాల్లో సమస్యలు తీవ్రమవుతున్నాయి.

ఏం జరుగుతోంది..?

సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా సముద్రంలో సంచరించే నౌకల కదలికలను ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌(ఏఐఎస్‌), ట్రాన్సీవర్‌ ఆధారంగా గుర్తిస్తుంటారు. ఒక నౌక ఎక్కడుంది, దాని వేగం, దిశ, పేరు వంటి సమాచారాన్ని హై ఫీక్వెన్సీ రేడియో ద్వారా తీరం వెంబడి స్టేషన్లకు పంపిస్తారు. నౌకలు ఈ స్టేషన్లకు దూరంగా ఉంటే ఉపగ్రహాల ద్వారా పంపిస్తారు. ప్రస్తుతం చైనా పరిధిలో సంచరించే నౌకల సమాచారం బయటకు పొక్కడంలేదు.

అక్టోబర్‌ చివరి వారం నుంచి షిప్పింగ్‌ పరిశ్రమ ట్రాకింగ్‌ వ్యవస్థ నుంచి చైనా పరిధిలోకి వెళుతున్న నౌకలు అదృశ్యమవుతున్నాయి. విదేశీ ట్రాకింగ్ వ్యవస్థలపై అనుమానంతో చైనా ఈ విధంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చైనాలో డేటా ప్రైవసీ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. గత మూడు వారాల్లో చైనా నుంచి 90శాతం నౌకలు ఏఐఎస్‌ సంకేతాల ద్వారా సమాచారం పంపడంలేదని గ్లోబల్‌ షిప్పింగ్‌ డేటా కంపెనీ వెస్సల్స్‌ వ్యాల్యూ పేర్కొంది.

పంపిణీ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం..

చైనాలో నౌకలు సంకేతాలు పంపడం లేదని ట్రాకింగ్‌ సంస్థలు చెబుతుంటే.. ఆ దేశ విదేశాంగ శాఖ మాత్రం ఏమీ జరగనట్లే స్పందించింది. ‘మా తీరంలో నిర్మించిన ఏఐఎస్‌ స్టేషన్లు మొత్తం అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం చట్టబద్ధంగా నిర్మించినవే. వీటిని మూసివేయలేదు.. పనిచేస్తూనే ఉన్నాయి’ అని పేర్కొంది. జాతీయ భద్రతా అధికారుల సూచనల మేరకు నవంబర్‌ ప్రారంభం నుంచే చైనా తీరప్రాంతాల్లోని ఏఐఎస్‌ స్టేషన్ల నుంచి ట్రాన్‌పాండర్లను తొలగించినట్లు సమాచారం.

ఈ సమస్యను తరచి చూస్తే.. చైనా పర్సనల్‌ ఇన్ఫర్మేషన్‌ ప్రొటెక్షన్‌  చట్టమే దీనికి కారణమని అర్థమవుతోంది. ఈ చట్టం నవంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం చైనా పరిధిలోకి వచ్చిన నౌకల సమాచారాన్ని తీసుకెళ్లాలంటే అక్కడి ప్రభుత్వ అనుమతులు తప్పని సరి. చైనాలోని సమాచారం విదేశీ ప్రభుత్వాలకు దక్కకుండా చేసేందుకే ఇలా చేస్తున్నారు. వాస్తవానికి ఈ చట్టం పరిధిలోకి షిప్పింగ్‌ డేటాను చేర్చలేదు. కానీ, అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఈ డేటాను ఆపేస్తున్నారు.

సమస్యలు తప్పవా..?

ఏఐఎస్‌ వ్యవస్థలో సిగ్నల్స్‌ నమోదు కాకపోయినా.. ఉపగ్రహాల సాయంతో తీరాలకు సమీపంలోని నౌకల గమనాన్ని గుర్తించవచ్చు. కానీ, క్షేత్రస్థాయిలో ఏఐఎస్‌ వ్యవస్థ నుంచి వచ్చినంత స్పష్టమైన సమాచారం మాత్రం దొరకదు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే తొలి 10 ఓడరేవుల్లో ఆరు చైనాలోనే ఉన్నాయి. మరోపక్క ఐరోపాలో క్రిస్మస్‌ సీజన్‌ మొదలైంది. చైనాలోని పంపిణీ వ్యవస్థలో కీలకమైన ఓడల లోడింగ్‌, అన్‌లోడింగ్‌, తీరాన్ని వీడిన సమాచారం అంతర్జాతీయంగా అందుబాటులో ఉండటం లేదు. ఇది ప్రపంచంలోని ఇతర ఓడరేవులపై ప్రభావం చూపిస్తోంది. ఎందుకంటే చాలా నౌకలు కేవలం ఒకే రేవులోనే లోడింగ్‌-అన్‌లోడింగ్‌ చేయవు. మార్గం మధ్యలోని పలు రేవుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అలాంటప్పుడు చైనాలో నౌక బయల్దేరిందో లేదో మిగిలిన రేవులకు తెలియకపోతే ఇబ్బందే కదా..! ఇది ఆయా రేవుల సామర్థ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది.

ఏడు వారాల క్వారంటైన్‌ నిబంధనలు..!

చైనాలో జీరో కొవిడ్‌ లక్ష్యాన్ని సాధించేందుకు షిప్పింగ్‌ పరిశ్రమపై కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. నౌకల్లోని విదేశీ సిబ్బందిని మార్చడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. దీంతోపాటు చైనా సెయిలర్లు తిరిగి దేశంలోకి రావాలంటే ఏకంగా ఏడు వారాల పాటు వివిధ దశల్లో క్వారంటైన్‌లో ఉండాలని పేర్కొంది. తీరానికి చేరడానికి మూడు వారాల ముందు నుంచి వారు క్వారంటైన్‌లో ఉండాలి. ఆ తర్వాత పోర్టులో రెండు వారాలు, వారి సొంత ప్రావిన్స్‌ల్లో మరో రెండు వారాలు క్వారంటైన్ తప్పనిసరి.

ఇక విదేశీ నౌకలు తమ సిబ్బంది ఎక్కడైనా రిఫ్రెష్‌ చేస్తే.. ఆ నౌక చైనా పోర్టులోకి రావాలంటే 14 రోజులు వేచి చూడాల్సిందే. ప్రపంచంలోనే అతిపెద్ద షిప్పింగ్‌ హబ్‌ అయిన చైనాలో ఈ కఠిన నిబంధనలు  పంపిణీ వ్యవస్థల్లో జాప్యాన్ని గణనీయంగా పెంచుతున్నాయి.  

అమెరికాలో కిక్కిరిసిన కంటైనర్లు..

ఎగుమతులకు కేంద్రమైన చైనాలో కంటైనర్లకు భారీగా కొరత ఏర్పడింది. అమెరికాలో పదుల సంఖ్యలో నౌకలు అన్‌లోడింగ్‌ కోసం ఎదురు చూస్తుండటంతో భారీ ఎత్తున కంటైనర్లు చిక్కుకుపోయాయి. లాంగ్‌ బీచ్‌, లాస్‌ఏంజెల్స్‌ పోర్టుల్లోనే వారం రోజులుగా దాదాపు 87 నౌకలు అన్‌లోడింగ్‌ కోసం పడిగాపులు పడుతున్నాయి. ఇక్కడ ఒక నౌక అన్‌లోడ్‌ కోసం కనీసం 12రోజులు వేచి చూడాల్సి వస్తోంది. ఇక అన్‌లోడింగ్‌ చేసేందుకు మరో 24 గంటలు పడుతుంది. అన్‌లోడ్‌ చేసిన కంటైనర్ల నిల్వకు చోటులేదు. వాటిని తరలించేందుకు తగినంత మంది డ్రైవర్లు అందుబాటులో లేరు. ఫలితంగా కంటైనర్లు అక్కడే పేరుకుపోతున్నాయి. వీటిల్లో చైనా నుంచి వెళ్లిన నౌకలే అత్యధికంగా ఉన్నాయి.  2019 అక్టోబరులో 20 అడుగుల కంటైనర్‌లో సరకులు రవాణా చేయడానికి 1,200 డాలర్లు ఖర్చయితే, నేడది దాదాపు 10,000 డాలర్లకు పెరిగింది. అది చాలదన్నట్లు కంటైనర్ల నుంచి సరకులను దించే నాథుడు లేక రేవుల్లో నౌకలు కిక్కిరిసిపోతున్నాయి.

Read latest Business News and Telugu News

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని