Updated : 21 Jan 2022 15:36 IST

Investments: బంగారం, స్థిరాస్తిలో ఎక్కువగా పెట్టుబ‌డులు పెడుతున్నారా?

  

ఇంటర్నెట్‌ డెస్క్‌: మొట్ట మొద‌టి ఇల్లు కొనుగోలు చేయ‌డం.. న‌చ్చిన‌ ఆభ‌ర‌ణాల‌ను కొనుగోలు చేయ‌డం వంటివి భావోద్వేగాల‌కు సంబంధించిన విషయం. మదుపు చేసేటప్పుడు కొన్నిసార్లు రాబ‌డి, రిస్క్‌, లిక్విడిటీ, ప‌న్ను వంటివి ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా భావోద్వేగాల‌తో నిర్ణయాలు తీసుకుంటారు. ఇత‌ర అంశాల‌ను అంత‌గా ప‌ట్టించుకోరు. బంగారం, స్థిరాస్తిలో పెట్టుబ‌డులు ఎప్పటికీ మంచివే అనే ఒక న‌మ్మకంతో ఉంటారు. అందుకే ఈ పెట్టుబ‌డుల‌పై ఎక్కువ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తుంటారు. కానీ ఇవి కొంత రిస్క్‌తో కూడుకొని ఉంటాయి. ఇందులో స్థిరమైన రాబడి ఉండకపోవచ్చు. లిక్విడిటీ స‌మ‌స్యలు కూడా ఉంటాయి. అలాగ‌ని ఈ పెట్టుబ‌డుల‌కు పూర్తిగా దూరంగా ఉండాల‌ని చెప్పడం ఇక్కడి ఉద్దేశం కాదు. కానీ, ఎక్కువ మొత్తంలో వాటికే కేటాయించ‌కుండా పెట్టుబ‌డుల‌ను స‌మ‌తుల్యం చేసుకుంటే మంచిదని ఆర్థిక నిపుణుల అభిప్రాయం.

బంగారం, స్థిరాస్తులు: బంగారం ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉంటుంది గానీ దీనిపై ఎలాంటి డివిడెండ్ లేదా వ‌డ్డీ ల‌భించ‌దు. అంత‌ర్జాతీయంగా క‌మొడిటీ, చ‌మురు, డాల‌ర్‌పై ఆధార‌ప‌డి వీటి ధ‌ర‌లు మారుతుంటాయి. వీటిని సాధార‌ణ పెట్టుబ‌డుదారులు అంత‌గా ప‌ట్టించుకోరు. స్థిరాస్తి పెట్టుబ‌డుల్లో లిక్విడిటీ స‌మస్యలు, లావాదేవీలు, రుసుములు అధికంగా ఉంటాయి. దీంతోపాటు రిజిస్ర్టేష‌న్, ఆక్రమణలు వంటి స‌మ‌స్యలు ఉంటాయి. అయితే, ఈ పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే రాబ‌డిని కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. స్థిరాస్తి పెట్టుబ‌డుల‌పై దీర్ఘకాలిక రాబ‌డి, మార్కెట్లలో వ‌చ్చే రాబ‌డి కంటే త‌క్కువగా ఉండే అవకాశం ఉంది. బంగారం పెట్టుబ‌డుల‌ను కూడా ఇదేవిధంగా చూడొచ్చు. బంగారంతో పోలిస్తే స్థిరాస్తి పెట్టుబ‌డుల‌పై కొంత ఎక్కువ రాబ‌డి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

రిస్క్‌: ఆభ‌ర‌ణాల రూపంలో బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఎక్కువ‌ ఆస‌క్తి చూపుతారు. కానీ, అమ్మేందుకు వెన‌కాడుతారు. బంగారం, స్థిరాస్తి ఉంటే ఎప్పటికైనా మంచిదే అని భావిస్తారు. దీంతో కేవ‌లం పెట్టుబ‌డులు పెట్టి వ‌దిలేయ‌డంతో రాబ‌డి ఎక్కువ‌గా ఉండ‌దు. ఇది పెట్టుబ‌డుల ప్రణాళికకు పూర్తి విరుద్ధం అని చెప్పుకోవాలి.
  
పెట్టుబ‌డుల వైవిధ్యత: ఈ ర‌క‌మైన పెట్టుబ‌డుల‌తో ఆర్థిక లక్ష్యాలు కూడా దెబ్బతినే అవ‌కాశం ఉంది. పెద్ద మొత్తంలో బంగారం, స్థిరాస్తిపై పెట్టుబ‌డి పెట్టడం వల్ల ఇత‌ర పెట్టుబ‌డుల‌కు త‌గినంత మొత్తం కేటాయించ‌లేక‌పోవ‌చ్చు. పిల్లల చ‌దువు, వివాహం, ప‌ద‌వీ విర‌మ‌ణ వంటి ల‌క్ష్యాలు దెబ్బతినే అవకాశం ఉంది. అవి పెట్టుబ‌డుల ప్రణాళికలో ఉండే చాలా ముఖ్యమైన అంశాలు. దీంతోపాటు అత్యవసర సమయాల్లో ఈ పెట్టుబ‌డులు ఉప‌యోగ‌ప‌డ‌వు.

పోర్ట్‌ఫోలియోలో ఎంత శాతం ఈ పెట్టుబ‌డులు ఉండొచ్చు..?
మీ పోర్ట్‌ఫోలియోలో ఈ పెట్టుబ‌డులు ఎన్ని ఉన్నాయో ఒక‌సారి చూసుకోండి. రిస్క్‌, ఆర్థిక లక్ష్యాల ఆధారంగా పెట్టుబ‌డులు పెట్టాలి. బంగారం, స్థిరాస్తి పెట్టుబ‌డుల‌ను ప‌రిమితం చేయాలి. మిగిలిన ల‌క్ష్యాల‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా జీవిత‌, ఆరోగ్య బీమాల‌ను ఆర్థిక‌ ప్రణాళికలో భాగం చేయాలి. పోర్ట్‌ఫోలియోలో స్థిరాస్తి పెట్టుబ‌డుల‌కు చివ‌రి స్థానం క‌ల్పించాలి. స్థిరాస్తి కొనుగోలుతో పాటు నిర్వహణ, విక్రయం కూడా క‌ష్టంగానే ఉంటుంది. ఇందులో లిక్విడిటీ ఉండ‌దు. లావాదేవీల వ్యయాలు, ప‌న్ను వంటివి రాబ‌డిని త‌గ్గిస్తాయి. పైగా కొంత మొత్తం మాత్రమే అవసరం అయినప్పుడు పూర్తి ఇంటిని/స్థలాన్ని అమ్మాల్సి రావచ్చు. దానికి కూడా సమయం పడుతుంది. ద్రవ్యోల్బణానికి మించి రాబ‌డి ఇస్తుంది కాబ‌ట్టి బంగారం కోసం కొంత కేటాయించాలి. పోర్ట్‌ఫోలియోలో 20 నుంచి 40 శాతం స్థిరాస్తి పెట్టుబ‌డుల‌కు, 5 నుంచి 10 శాతానికి మించ‌కుండా ప‌సిడి పెట్టుబ‌డుల‌కు కేటాయించాల‌నేది నిపుణుల సూచ‌న‌.

బంగారంలో మదుపు చేయాలనుకునేవారు ఈటీఎఫ్‌, సార్వభౌమ పసిడి బాండ్లను పరిశీలించడం మంచిది. వీటిల్లో బంగారం త‌రుగుద‌ల ఉండ‌దు. అలాగే భద్రత గురించి ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అదేవిధంగా బాండ్లు, ఈటీఎఫ్‌ల ద్వారా బంగారం పెట్టుబ‌డులపై ప‌న్ను త‌క్కువ‌గా ఉంటుంది. మీ పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ‌గా స్థిరాస్తి, బంగారం పెట్టుబ‌డులు ఉన్నట్లయితే వాటిని సరిచూసుకోండి. రెండో ఇల్లు కొనుగోలు చేయ‌డం లేదా బంగారం కొనుగోలు చేయ‌డం ఆర్థికంగా ధైర్యాన్ని ఇస్తుంది గానీ దానిపై తగినంత రాబడి ఉండకపోవచ్చన్న విష‌యం గుర్తుంచుకోండి. రుణాలు అందుబాటులో ఉన్నాయని రెండో ఇల్లు కొంటే ఇతర లక్ష్యాలకు పెట్టుబడులు పెట్టడం కష్టతరం అవుతుంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని