ఆరోగ్య బీమా పాల‌సీలో రిస్టోరేష‌న్ బెనిఫిట్ అంటే..

రిస్టోరేష‌న్ బెనిఫిట్ భ‌విష్య‌త్తు క్లెయిమ్ల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది

Updated : 06 Apr 2021 15:12 IST

కోవిడ్‌-19 మ‌ళ్లీ ఉగ్ర‌రూపం దాల్చుతుంది. మ‌రోవైపు ఆరోగ్య సంర‌క్ష‌ణ ఖ‌ర్చులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అధిక హామీతో వ‌చ్చే ఆరోగ్య బీమా పాల‌సీల‌కు దేశంలో డిమాండ్ ఎక్కువ‌గా ఉంది. అందుకు త‌గిన‌ట్లుగా అధిక హామీతో కూడిన పాల‌సీలు అందుబాటులో ఉన్నాయి. అయితే కొత్తపాల‌సీల కంటే ప్ర‌స్తుతం ఉన్న పాల‌సీకి రిస్టోరేష‌న్ బెనిఫిట్(పున‌రుద్ధ‌ర‌ణ ప్ర‌యోజ‌నం) ప్లాన్‌ను ఎంచుకోవ‌డం ద్వారా ఒక సంవత్స‌రంలో పాల‌సీకి సంబంధించిన హామీ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకున్న‌ప్ప‌టికీ, మ‌రోసారి వినియోగించుకునేందుకు వీలుగా ఒరిజిన‌ల్‌ క‌వ‌రేజ్‌ను పున‌రుద్ధ‌రిస్తారు. 

రిస్టోరేష‌న్ బెనిఫిట్  అంటే..
ఒక వ్య‌క్తి తాను తీసుకున్న బీమా పాల‌సీ హామీ మొత్తాన్ని పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ వినియోగించుకుంటే, బీమా సంస్థ అస‌లు హామీ మొత్తాన్ని తిరిగి పునురుద్ధ‌రిస్తుంది. దీనినే రిస్టోరేష‌న్ బెనిఫిట్ అంటారు. 

పాలసీబజార్.కామ్ హెల్త్ ఇన్సూరెన్స్-హెడ్- అమిత్ ఛబ్రా మాట్లాడుతూ "కోవిడ్ -19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి, దీని ప్ర‌భావం ఎప్పుడు, ఎవ‌రిపైనైనా క‌నిపించ‌వ‌చ్చు. అందువ‌ల్ల‌ తగిన మొత్తంలో బీమా ఉండ‌డం చాలా ముఖ్యం. కోవిడ్ -19 క్లెయిమ్‌లు రూ.15 ల‌క్ష‌ల నుంచి రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు పెరిగడం మేము చూశాము. ఒక‌వేళ వినియోగ‌దారులు త‌క్కువ మొత్తంలో హామీ అందించే పాల‌సీని తీసుకున్న‌ట్ల‌యితే, ఎక్కువ హామీ మొత్తం అందించే పాల‌సీల‌కు మారాలి. "  అని చెప్పారు.  

సాధార‌ణ బీమా పాల‌సీతో పాటు రిస్టోరేష‌న్ ప్లాన్‌ను కొనుగోలు చేయ‌డం ద్వారా ఆరోగ్య బీమా ర‌క్ష‌ణ‌ను పెంచుకోవ‌చ్చు. ఈ ప్ర‌ణాళిక ప్ర‌కారం, ఆసుప‌త్రిలో చేర‌డం, ఇత‌ర ఆరోగ్య సంర‌క్ష‌ణకు అయిన‌ ఖ‌ర్చుల కార‌ణంగా  ఒక సంవ‌త్సంలో పాల‌సీ ద్వారా వ‌చ్చే హామీ మొత్తాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా క్లెయిమ్ చేసిన‌ప్ప‌టికీ, వంద శాతం హామీని తిరిగి పున‌రుద్ధ‌రించుకోవ‌చ్చు. 

“ఇది ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక కుటుంబంలో న‌లుగురు లేదా ఐదుగురు.. ఇలా ఎంత మంది స‌భ్యులున్నా.. వ‌యసుతో సంబంధం లేకుండా..ప్ర‌తీ ఒక్క‌రికి ఆరోగ్య బీమా చేయించ‌డం అవ‌స‌రమే. అయితే  ప్రతి ఒక్కరికీ విడివిడిగా పాలసీ తీసుకోవడం ఖరీదైన‌ వ్యవహారం. కుటుంబసభ్యుల్లో చిన్న వయసువారు, ఆరోగ్యవంతులు ఉంటే ఈ ప్రీమియం అనేది అనవసరపు ఖర్చుగా అనిపించవచ్చు. ఇలాంటి విషయాలను అధిగమిస్తూ, త‌క్కువ ప్రీమియంతో కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ బీమా స‌దుపాయాన్ని అందించేదే ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ. 

ఇక్కడ కుటుంబంలోని స‌భ్యులంద‌రికీ బీమా హామీ వ‌ర్తిస్తుంది. అయితే ఏదైనా అనారోగ్య కార‌ణం చేత ఒక స‌భ్యుడు ఆసుపత్రిలో చేరితే..బీమా హామీలో చాలా వ‌ర‌కు.. ఆ కుటుంబ స‌భ్యుని వైద్య ఖ‌ర్చుల‌కే స‌రిపోతుంది. ఈ సంద‌ర్భంలో .. ఆ సంవ‌త్స‌రం మొత్తం ఆ స‌భ్యునితో పాటు, మిగిలిన వారికి బీమా ర‌క్ష‌ణ ఉండ‌దు. అలాంటి సమయంలో, రిస్టోరేష‌న్ ప్ర‌యోజ‌నక‌రంగా ఉంటుంది, ఎందుకంటే, సంస్థ బీమా మొత్తాన్ని వెంటనే పునరుద్ధరిస్తుంది కాబ‌ట్టి అదే సభ్యునికి లేదా కుటుంబంలోని ఇతర సభ్యులకు సంబంధించిన వైద్య ఖ‌ర్చుల కోసం, అదే పాల‌సీని మళ్లీ క్లెయిమ్ చేయవచ్చు. అని డిజిట్ ఇన్సూరెన్స్, హెల్త్ అండ్ ట్రావెల్ హెడ్ డాక్టర్ సుధా రెడ్డి అన్నారు.

రెస్టోరేష‌న్ బెనిఫిట్‌తో పాల‌సీల‌ను తీసుకుంటే ప్రీమియం కూడా పెర‌గొచ్చు. ఇది రెండు ర‌కాలుగా అందుబాటులో ఉంది. మొద‌టిది హామీ మొత్తం పూర్తిగా వినియోగించున్న సంద‌ర్భంలో..పాల‌సీకి సంబంధించిన హామీ మొత్తాన్ని పూర్తిగా క్లెయిమ్ చేసుకున్న‌ప్పుడు మాత్ర‌మే.. తిరిగి పున‌రుద్ధ‌రిస్తారు. రెండ‌వ‌ది పాక్షికంగా వినియోగించుకున్న‌ప్పుడు.. పాల‌సీకి స‌బంధించిన హామీ మొత్తంలో కొంత భాగాన్ని క్లెయిమ్ చేసుకుంటే..హామీ మొత్తాన్ని తిరిగి పున‌రుద్ధ‌రిస్తారు. 

ఇక్క‌డ గుర్తించుకోవాల్సి మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే.. రెండు భిన్న వ్యాధుల‌కు మాత్ర‌మే రిస్టోరేష‌న్ ప్ర‌యోజ‌నం అందుబాటులో ఉంటుంది. అలాగే పున‌రుద్ధ‌ర‌ణ భ‌విష్య‌త్తు క్లెయిమ్‌ల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. పాల‌సీ తీసుకున్న సంవ‌త్స‌రంలో మొద‌టి చేసిన క్లెయిమ్‌కి మ‌రోసారి వ‌ర్తించ‌దు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని