Elon Musk: ఎలాన్‌ మస్క్‌.. ఐదేళ్ల కిందటే ట్విటర్‌ ధర అడిగి..

అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ అనుకున్నది సాధించారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు

Published : 26 Apr 2022 14:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ అనుకున్నది సాధించారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ట్విటర్‌ను కొనాలన్న మస్క్‌ ఆలోచన ఇప్పటిది కాదు. ఐదేళ్ల కిందటే ఈ సంస్థను కొనుగోలు చేసేందుకు ఆయన ఆసక్తి చూపించారు. ఇందుకు సంబంధించిన ఓ ట్వీట్‌ ఇప్పుడు ఇదే సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ట్విటర్‌ను సొంతం చేసుకోవాలని 2017లోనే మస్క్‌ ఆలోచించారు. దీనిపై ఓ ఆసక్తికర ట్వీట్‌ కూడా చేశారు. ఆ ఏడాది డిసెంబరు 21న మస్క్‌ తన ట్విటర్‌ ఖాతాలో ‘I love Twitter’ అని రాసుకొచ్చారు. దీనికి డేవ్‌ స్మిత్‌ అనే ఓ యూజర్‌ స్పందిస్తూ.. ‘అప్పుడు మీరు దాన్ని కొనుగోలు చేయొచ్చుగా’ అని అన్నారు. ఇందుకు మస్క్‌ తిరిగి స్పందిస్తూ.. ‘ఎంత ఉంటుందేంటీ? (How Much is it?)’ అని అడిగారు. అప్పట్లోనే ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. ట్విటర్‌ను మస్క్‌ కొనాలంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయాలు కూడా వెల్లడించారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఇది నిజమైంది.

తాజాగా ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు మస్క్‌ ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో ఈ సంభాషణకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను డేవ్‌ స్మిత్‌ మరోసారి పోస్ట్‌ చేశారు. ‘ఈ సంభాషణ ఇన్నాళ్లూ నన్ను వెంటాడుతూనే ఉంది’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్‌ కాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఈ ఏడాది మార్చి నుంచి తరచూ ట్విటర్‌ ప్రస్తావన తీసుకొచ్చిన మస్క్‌.. తొలుత తాను ఓ కొత్త సోషల్‌ మీడియా సంస్థను ప్రారంభించాలనుకుంటున్నట్లు తన ఫాలోవర్లకు చెప్పారు. ఆ తర్వాత ట్విటర్‌లో 9.2శాతం వాటాలను సొంతం చేసుకున్నట్లు చెప్పి అందర్నీ షాక్‌కు గురిచేశారు. అనంతరం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన మస్క్‌.. ఇందుకోసం మంచి ఆఫర్‌ కూడా ప్రకటించారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మస్క్‌ను అడ్డుకొనేందుకు ట్విటర్‌ ప్రయత్నించింది కూడా. కానీ చివరకు, 44 బిలియన్‌ డాలర్లకు సంస్థను విక్రయించేందుకు మస్క్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని