వివాహం తరువాత ఆర్ధిక ప్ర‌ణాళిక ఎలా ఉండాలి?

వివాహ వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌కు, అనంత‌రం అవ‌స‌ర‌మైన ఖ‌ర్చుల‌ను కూడా దృష్టిలో ఉంచుకోవాలి.

Updated : 25 Feb 2022 13:07 IST

వివాహం, జీవితంలో ఒక జంట‌కు మ‌ధుర ఘ‌ట్టం, ఇరు కుటుంబాల‌కు అత్యంత ముఖ్య‌మైన వేడుక‌. వివాహం లాంటి వేడుక‌లు జీవితంలో ఒకసారి మాత్ర‌మే జ‌రిగే తంతు, కాబ‌ట్టి వ‌ధూవ‌రులిద్ద‌రూ అట్ట‌హాసంగా జ‌రుపుకోవ‌డానికే ప్రాధాన్య‌త ఇస్తారు. పెళ్లి వేడుక‌ ఎప్పుడైతే ఘ‌నంగా కావాల‌ని ఆశిస్తారో.. ఖ‌ర్చులు కూడా అంతే భారీగా అయ్యే అవ‌కాశం ఉంది. పెళ్లి వ్య‌వ‌హారాల్లో ఖ‌ర్చులు ఎలా ఉంటాయో చాలా మందికి తెలిసిన విష‌య‌మే.

భార‌త్‌లో ఎక్కువ మంది మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల వారే ఉంటారు. వీరికి పెళ్లి ఖ‌ర్చు ఒక భారీ బ‌డ్జెట్ లాంటిదే అని చెప్ప‌వ‌చ్చు. ఇంకొక ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే, ఇంటికి ఖ‌ర్చు పెడితే అది మ‌న క‌ళ్ల ముందు క‌నిపిస్తుంది. చ‌దువుకు పెట్టిన ఖ‌ర్చు ఎక్క‌డికి పోదు, జీవితాంతం ఆ విద్య ఆ వ్య‌క్తినే కాకుండా మొత్తం కుటుంబాన్నే పోషిస్తుంది. కానీ, పెళ్లికి పెట్టిన ఖ‌ర్చు మాత్రం ఆ రోజే క‌నిపిస్తుంది, త‌ర్వాత క‌నిపించ‌దు.

పెళ్లి త‌ర్వాత అప్పుల  బ‌కాయిలు మిగల‌డం భార‌త్‌లో చాలా కుటుంబాల‌కు అల‌వాటే.  ధ‌న‌వంతులైతే ముంద‌స్తుగా ప్రణాళిక లేక‌పోయినా ప‌ర్వాలేదు గాని, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలు, వ‌ధూవ‌రులు పెళ్లిలో ఖ‌ర్చులు కీల‌క‌మైన విష‌యం కాబ‌ట్టి ఆ రోజు గురించి ఆర్ధికంగా సిద్ధం కావాల‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు.

ఆర్ధిక ప్ర‌ణాళిక అనేది వివాహ వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌కు మాత్ర‌మే కాకుండా, వివాహం అనంత‌రం అవ‌స‌ర‌మైన ఖ‌ర్చుల‌ను కూడా దృష్టిలో ఉంచుకుని చేయాలి. వివాహమైన వెంట‌నే రుణ చెల్లింపుల భారాన్ని నివారించ‌డానికి ముందుగా పొదుపు చేయ‌డం ప్రారంభించాలి. వివాహ ఖ‌ర్చు కోసం అవ‌స‌రాన్ని బట్టి వ్య‌క్తిగ‌త రుణాన్ని ఎంచుకోవ‌చ్చు.

వ‌ధూవ‌రులిద్ద‌రూ విద్యావంతులై, ఉద్యోగాలు చేసేవారు కూడా ఈ మధ్య అధికంగానే ఉన్నారు. పెళ్లిళ్ల భార‌మంతా త‌ల్లిదండ్రులు భుజాన వేసుకునే రోజులు పోయాయి. యువ‌త‌రం ఆర్ధికంగా స్వ‌తంత్రంగా మారింది, వారి ఆఫీసుల కారణంగా త‌ల్లిదండ్రుల‌కు దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా, వారి వివాహాల ఆర్ధిక భారాన్ని పంచుకుంటున్నారు, ఇది స్వాగ‌తించే ప‌రిణామం.

వివాహాల్లో పెద్ద మొత్తంలో డ‌బ్బులు ప్ర‌వ‌హించే అవ‌కాశం ఉంది. దాని కోసం బ‌డ్టెట్ ప్లాన్ వేసుకోవాలి. వివాహ ఖ‌ర్చులు ఎంతుండాల‌నే విష‌యం మీద నిపుణులు చెప్పేది ఏమిటంటే వివాహానికి ఖ‌ర్చు పెట్టేవారి జీతంలో 18 నెల‌ల‌ ఆదాయం ఉండాల‌ని, దీనికి మించితే భ‌విష్య‌త్ ఆర్ధిక ప్ర‌ణాళిక‌లు దెబ్బ‌తింటాయ‌ని చెబుతున్నారు.

వివాహం త‌ర్వాతే అస‌లు ఖ‌ర్చులు మొద‌ల‌వుతాయ‌ని పెద్ద‌ల మాట‌. వ‌ధూవ‌రులిద్ద‌రూ ఆరోగ్య బీమా తీసుకోవాలి, ట‌ర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. పిల్ల‌ల వివాహ‌ వ‌య‌స్సుకి త‌ల్లిదండ్రులు పెద్ద‌వారు అవుతారు కాబ‌ట్టి వారికి త‌ప్ప‌నిస‌రిగా ఆరోగ్య బీమా ఉండాలి. పొదుపు, పెట్టుబ‌డితో పాటు వివాహానంత‌ర ఆర్ధిక భారం త‌క్కువ‌గా ఉండేలా చూసుకోవ‌డానికి ఇప్ప‌టికే ఉన్న రుణాల‌ను చెల్లించ‌డానికి కూడా ప్ర‌య‌త్నించాలి.

వివాహం చేసుకునేట‌ప్పుడు ఆర్ధిక ప్ర‌ణాళిక కీల‌కం, దీని మొద‌టి ద‌శ భాగ‌స్వామి ఆర్ధిక ఆరోగ్యం గురించి పూర్తిగా అంచ‌నా వేయ‌డం, భ‌విష్య‌త్తు ఆర్ధిక వ్య‌వ‌హారాలు ఎలా నిర్వహించబడతాయనే దానిపై చ‌ర్చించుకోవ‌డం మంచిది. ఇరువురి త‌ల్లిదండ్రుల‌ కొరకు వైద్య అత్య‌వ‌స‌ర నిధులు ఉండాలి. వివాహ బంధానికి బ‌ల‌మైన ఆర్ధిక పునాదులు చాలా అవ‌స‌రం. ఆర్ధికంగా బ‌లంగా ఉన్న‌వారికి శారీర‌క‌, మాన‌సిక ధృడ‌త్వం కూడా స‌రియైన దిశ‌లోనే ఉంటాయి.

పెళ్ల‌యిన వ‌ధూవ‌రులిద్ద‌రిలో ఒక‌రికైనా క్రెడిట్ కార్డ్ ఉండ‌టం అవ‌స‌ర‌మే. భవిష్యత్తులో రుణాలు తీసుకోవ‌డానికి క్రెడిట్ స్కోర్ మెరుగు ప‌ర‌చుకోవ‌డానికి క్రెడిట్ కార్డ్ ఉప‌యోగ‌ప‌డుతుంది. అంతేకాకుండా, పెళ్ల‌యిన త‌ర్వాత భాగ‌స్వాములిద్ద‌రూ సంపాద‌న‌ప‌రులైతే గృహ‌రుణం జాయింట్‌గా తీసుకోవ‌డం కూడా మంచిది. గృహ‌రుణం కూడా ఎక్కువొస్తుంది. రుణాన్ని తీర్చేట‌పుడూ స‌మిష్టిగా బాధ్య‌త వ‌హించ‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని