అక్ష‌య తృతీయకి బంగారం కొంటున్నారా! ఇవి ప‌రిశీలించండి

భార‌తీయుల‌కు బంగారం అంటే ఎంత మోజో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌తి పండుగ, శుభ‌కార్యాల్లోనూ పుత్త‌డి ధ‌రించి సంబ‌రాలు జ‌రుపుకోవ‌డం సాంప్ర‌దాయంగా వ‌స్తోంది.....

Updated : 02 Jan 2021 17:29 IST

భార‌తీయుల‌కు బంగారం అంటే ఎంత మోజో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌తి పండుగ, శుభ‌కార్యాల్లోనూ పుత్త‌డి ధ‌రించి సంబ‌రాలు జ‌రుపుకోవ‌డం సాంప్ర‌దాయంగా వ‌స్తోంది. అలాగే ప్ర‌త్యేకించి బంగారం కొన‌డానికే ప్ర‌జలు బారులు తీరే రోజే అక్ష‌య తృతీయ. ఈ రోజు బంగారం కొంటే మంచిద‌ని చాలా మంది న‌మ్ముతారు. కాబ‌ట్టి ప‌సిడికి అనూహ్య‌మైన డిమాండ్ పెరుగుతుంది. మ‌న‌లో చాలా మంది బంగారాన్ని కేవ‌లం న‌గ‌ల త‌యారీకే కాకుండా పెట్టుబ‌డి అవ‌కాశంగానూ భావిస్తాం. నాణేలు, క‌డ్డీలు, ఆభ‌ర‌ణాల రూపంలో కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతారు.

ప్ర‌పంచంలో అత్య‌ధికంగా బంగారాన్ని దిగుమ‌తి చేసుకునే దేశాల్లో మ‌న‌ది ఒక‌టి. ఒక సంస్థ అధ్య‌య‌నం ప్ర‌కారం దేశంలో ప్ర‌భుత్వం వ‌ద్ద‌ బంగారం నిల్వ‌లు 550 ట‌న్నులుండ‌గా, ప్ర‌జ‌లు, వివిధ సంస్థ‌లు, గుడుల వ‌ద్ద 20 వేల ట‌న్నుల‌పైనే బంగారం ఉంది.

అయితే ఖ‌రీదైనప్ప‌టికీ అక్షయ తృతీయ నాడు బంగారం కొన‌డానికి ప్ర‌జలు బారులు తీరుతుంటారు. ఆభ‌ర‌ణాల త‌యారీ సంస్థ‌లు కూడా ఈ రోజు కోసం ఆతృత‌గా ఎదురు చూస్తుంటాయి. వారి వార్షిక అమ్మ‌కాల్లో ఐదో వంతు విక్ర‌యాలు ఈ రోజునే జరుగుతుంటాయి. ఈ సారీ కూడా విక్ర‌యాల‌పై ఆయా సంస్థ‌లు చాలా ఆశ‌లే పెట్టుకున్నాయి.

సాధార‌ణంగా ఈ పండ‌గ‌ స‌మీపిస్తున్న స‌మ‌యంలో బంగారం ధ‌ర విప‌రీతంగా పెరుగుతుంటుంది. ఈ వారంలో 24, 22 క్యారెట్ల బంగారం ధ‌ర‌లు వ‌రుస‌గా రూ.32 వేలు, రూ.30 వేలుగా నమోద‌వ‌డ‌మే పెరుగుతున్న డిమాండ్‌కి నిద‌ర్శ‌నం. అయితే రేపు అక్ష‌య తృతీయ సంద‌ర్భంగా బంగారం కొనుగోలు చేసేట‌ప్పుడు వినియోగ‌దారులు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మంచిది. ప‌సిడి ప‌ట్ల‌ మీ బ‌ల‌హీన‌త‌ను సొమ్ము చేసుకుని కొంత మంది మిమ్మ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టించే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి అటువంటి వారి చేతిలో మోస‌పోకుండా ఈ కింద వివ‌రించిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మీ పండ‌గ ఆనందం రెట్టింప‌వుతుంది.

1. బంగారం స్వ‌చ్ఛ‌త‌ను తెలుసుకోండి

బంగారం స్వ‌చ్చ‌త‌ను క్యారెట్ల‌లో లెక్కిస్తారు. 24 క్యారెట్ల బంగారం 99.9 శాతం, 22 క్యారెట్ల బంగారం 92 శాతం స్వచ్ఛ‌మైన‌ది. ప్ర‌తీ ఒక క్యారెట్ 4.2 స్వ‌చ్ఛ‌మైన బంగారానికి స‌మానం. దీన్నిబ‌ట్టి 14, 18 క్యారెట్లలో, 58.33, 75 శాతం స్వ‌చ్ఛ‌మైన బంగారం ఉంటుంది. 24 క్యారెట్ల బంగారం ఆభ‌ర‌ణాల త‌యారీకి ప‌నికి రాదు. కాబ‌ట్టి న‌గ‌ల త‌యారీదారులు సాధార‌ణంగా 14,18, 22 క్యారెట్ల బంగారాన్ని వాడుతుంటారు.

2. త‌యారీ ఖ‌ర్చులు

ప్ర‌స్తుతం బంగారం ధ‌ర‌ల్లో త‌యారీ ఖ‌ర్చులు కూడా క‌లిసే ఉంటున్నాయి. కాబ‌ట్టి ఈ ఖ‌ర్చుల గురించి విపులంగా తెలుసుకోవ‌డం మంచిది. లేక‌పోతే న‌గ‌ల త‌యారీ సంస్థ‌లు మీ నుంచి అధికంగా తయారీ ఖ‌ర్చుల‌ను వ‌సూలు చేసే అవ‌కాశం ఉంది.

బంగారం ధ‌ర‌ల‌ను, గ్రాము చొప్పున లెక్కించి+ బ‌రువు(గ్రాముల‌లో)+త‌యారీ ఖ‌ర్చులు+జీఎస్‌టీని క‌లిపి లెక్కిస్తారు.

3. ఎలా త‌యారు చేశారో తెలుసుకోవాలి

ఆభ‌ర‌ణాల త‌యారీని యంత్రంపై రూపొందించారా లేదా మానవులు త‌యారు చేశారా అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే మానవుల‌చే త‌యార‌వ‌డంతో పోలిస్తే యంత్ర సాయంతో రూపొందించిన ఆభ‌ర‌ణాల ఖ‌ర్చులు త‌క్కువ‌గా ఉంటాయి.

4. బ‌రువుని స‌రిచూడండి

మ‌న దేశంలో చాలా ఆభ‌ర‌ణాల త‌యారీ కంపెనీలు బ‌రువు ప్ర‌కారం బంగారం విక్ర‌యిస్తాయి. ఎక్కువ బరువున్న ఆభ‌ర‌ణాలు ధ‌ర ఎక్కువ‌గానే ఉంటుంది. కాబ‌ట్టి బ‌రువుని స‌రి చూసుకోవ‌డం ఉప‌యుక్తం. ఎందుకంటే ఆభ‌ర‌ణాల త‌యారీలో వ‌జ్రాలు, విలువైన రాళ్ల‌ను కూడా పొందుప‌రచ‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతుంది, కాబ‌ట్టి ఆభ‌ర‌ణాల త‌యారీలో ఎంత బంగారాన్ని వాడార‌నే విష‌యం తెలుసుకుంటే మంచిది.

5. బైబ్యాక్‌

మీ వ‌ద్ద ఉన్న పాత ఆభ‌ర‌ణాలు మార్పిడి చేసుకుని కొత్త‌వి కొనాల‌నుకున్న‌ప్పుడు, చాలా ఆభ‌ర‌ణాల కంపెనీలు బైబ్యాక్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తుంటాయి. ఆభ‌ర‌ణాల డిజైన్ల‌లో మార్పు ఉన్న‌ప్ప‌టికీ, వీటి విలువ ఒకేలాగా ఉంటుంది. న‌గ‌లు కొనేట‌ప్పుడు బైబ్యాక్ ఆఫ‌ర్ల గురించి చ‌ర్చింటం మీకు కొంత ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉండే అవ‌కాశం ఉంది.

6. న‌గ‌ల షాప్‌ల‌ను త‌నిఖీ చేయండి

మ‌న దేశంలో ల‌క్ష‌ల సంఖ్య‌లో న‌గ‌ల దుకాణాలున్నాయి. చిన్న చిన్న షాప్‌ల నుంచి బంగారం కొన‌టం అంత మంచిది కాదు. ఎందుకంటే వీటిలో న‌కిలీ బంగారం లేదా దొంగిలించిన బంగారం అమ్మే అవ‌కాశాలున్నాయి. అదే పేరున్న షాప్‌లో కొనుగోలు చేస్తే గ్యారంటీ ఉంటుంది కాబ‌ట్టి రిస్క్ త‌క్కువ‌.

7. బీఐఎస్‌ మార్క్ ఉందో లేదో గ‌మ‌నించండి

బంగారం కొనేట‌ప్పుడు వాటిపై బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్‌(బీఐఎస్‌) హాల్‌మార్క్ ఉందో లేదో గ‌మ‌నిచండి. బంగారం నాణ్య‌మైన‌దా లేదా అని ప‌రిశీలించ‌డానికి ఇది తోడ్ప‌డుతుంది. ఇది వియ‌న్నా క‌న్వెన్ష‌న్‌-1972 ప్ర‌కారం అంత‌ర్జాతీయంగా చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌లిగిన‌ది. కాబ‌ట్టి బంగారం కొనుగోలు స‌మ‌యంలో ఇది ఉందో లేదో ప‌రిశీలించడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని