Financial Crisis: ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారా?ఈ టిప్స్‌ పాటించండి..!

దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు ప్రారంభమైంది....

Updated : 23 Mar 2022 12:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు ప్రారంభమైంది. ఈ ప్రభావం అన్ని రంగాలపై ఉండనుంది. తయారీ సంస్థలకు ముడి సరకుల ధరలు భారంగా మారే అవకాశం ఉంది. ఉత్పత్తి ఖర్చులు పెరిగితే ఆ భారాన్ని సంస్థలు వినియోగదారులపైకి బదిలీ చేస్తాయి. ఫలితంగా నిత్యావసరాల ధరలు పెరుగుతాయి.

ఇప్పటికే కరోనా సంక్షోభం కారణంగా ఆదాయాలు దెబ్బతిన్న వారికి ఈ ధరల మోత పెద్ద తలనొప్పనే చెప్పాలి. ఆర్థిక అవసరాలను సర్దుబాటు చేసుకుంటూ నెట్టుకొస్తున్న వారికి పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. రుణాలు, ఈఎంఐలు చెల్లించడం కష్టతరంగా మారి పూర్తి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. మరి ఇలాంటి పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే ముందు నుంచే ఓ నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లాలి..

ఆదాయం ఎలా వస్తోంది..

మీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తోంది? ఎన్ని మార్గాల ద్వారా సమకూరుతోంది? వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించుకోవాలి. మీరు ఎంత బాగా సంపాదిస్తున్నా.. మీ ఆదాయ వనరులపై నిత్యం ఓ కన్నేసి ఉంచడం తప్పనిసరి. ఈ కింద తెలిపిన విషయాలపై మీకు కచ్చితంగా అవగాహన ఉండాలి..

* డబ్బును ఎక్కడ పెడుతున్నారు?

* మీ నెలవారీ ఖర్చులపై దృష్టి పెట్టండి.

* మీ అప్పులు/రుణాలను రాసి పెట్టుకోండి.

* మీరు పొదుపు చేసిన సొమ్ము ఎంత?

* మీ చేతిలో నగదు రూపంలో ఉన్న డబ్బు ఎంత?

అనవసర ఖర్చులు తగ్గించుకోండి..

అనవసరంగా ఎక్కడ ఖర్చు చేస్తున్నారో గుర్తించండి. వాటిని నివారించే ప్రయత్నం చేయండి. తద్వారా మిగిలే సొమ్మును అత్యవసర సమయాల్లో వినియోగించుకునేందుకు కేటాయించండి. అనవసర షాపింగ్‌లను తగ్గించడం, తరచూ బయట తినడం ఆపేయడం, అంతగా ఉపయోగించని సభ్యత్వాలను రద్దు చేయడం వంటి చర్యల ద్వారా ఖర్చులు భారీగా తగ్గిచంచుకోవచ్చు. ఇవి చాలా చిన్నవే అనిపించినా.. మొత్తంగా మన ఆదాయాన్ని పొదుపు చేయడంలో ఎంతో ప్రభావం చూపుతాయి.

బిల్లుల భారం తగ్గించుకోండి..

నెలవారీ ఖర్చుల్ని తగ్గించుకోవడానికి ఇది మరొక మార్గం. వివిధ సేవలకు చెల్లించే బిల్లుల విషయంలో వీలైనంత రాయితీ పొందడానికి ప్రయత్నించండి. బేరసారాలకు ఏమాత్రం వెనుకాడొద్దు. మరీ అత్యవసరమైతే.. కేబుల్‌, ఇంటర్నెట్‌, ల్యాండ్‌ఫోన్‌ వంటి బిల్లుల్ని కొంతకాలం పాటు పూర్తిగా తగ్గించుకోండి. వాటి స్థానంలో మొబైల్‌ను సద్వినియోగం చేసుకోండి.

ఉపయోగంలోలేని వస్తువులను విక్రయించండి..

సంక్షోభంలో ఉన్నప్పుడు ఖర్చులు తగ్గించుకోవడమే కాదు. ఇతర ఆదాయ మార్గాలపైనా దృష్టి పెట్టాలి. ఇంట్లో అంతగా ఉపయోగంలో లేని వస్తువులను విక్రయించడం ఒక మార్గం. వీలైతే తెలిసినవారికి అమ్మేయొచ్చు. లేదంటే సెకండ్‌ హ్యాండ్‌ వస్తువుల్ని అమ్మి పెట్టే సంస్థలు ఉంటాయి. వాటిని ఆశ్రయించొచ్చు. ఓఎల్‌ఎక్స్‌ వంటి ఆన్‌లైన్ సంస్థల ద్వారా కూడా వస్తువుల్ని విక్రయించవచ్చు.

ఇతర ఆదాయ మార్గాలు..

ఆర్థిక కష్టాలు చుట్టిముట్టినప్పుడు కాస్త అధికంగా శ్రమించాలి. మీ ప్రస్తుత ప్రధాన ఉపాధి వనరుతో పాటు ఖాళీ సమయంలో ఇతర ఆదాయ మార్గాలపైనా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా చిరుద్యోగులైతే ఆఫీసు నుంచి ఇంటికి రాగానే మరో పనిపై దృష్టి పెట్టాలి. ఫ్రీలాన్సింగ్‌, ట్యూషన్లు చెప్పడం, కన్సల్టెన్సీ సర్వీసులు, మార్కెటింగ్‌.. వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించొచ్చు.

మీ క్రెడిట్‌ స్కోరును మెరుగుపరచుకోండి..

కష్టాల్లో ఉన్నాం కదా అని మీ ఆర్థిక బాధ్యతల్ని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. రుణ చెల్లింపులు ఇతర ఈఎంఐలు సకాలంలో చెల్లించాలి. లేదంటే వడ్డీ పేరుకుపోయి తలకు మించిన భారంగా మారే అవకాశం ఉంది. ఫలితంగా క్రెడిట్‌ స్కోరు కూడా దెబ్బతింటుంది. అప్పుడు ఎక్కడా అప్పు కూడా పుట్టకపోవచ్చు. ఇది మీ ఆర్థిక కష్టాల్ని మరింత తీవ్రం చేసే ప్రమాదం ఉంది. అందుకే ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి సకాలంలో చెల్లింపులు చేయడం ఉత్తమం.

ఏ సంక్షోభం చెప్పి రాదు. కాబట్టి అన్ని వేళలా అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. ఎలాంటి ఇబ్బంది వచ్చినా సమర్థంగా ఎదుర్కోవాలి. పైన తెలిపిన అంశాలతో పక్కా ప్రణాళికగా ముందుకు వెళితే.. ఎంత లోతైన సంక్షోభం నుంచైనా బయటపడేందుకు అవకాశం ఉంటుంది. పూర్తిగా కష్టాలు తొలగిపోవడం సాధ్యం కాకపోవచ్చు. కానీ, మరిన్ని ఆర్థిక కష్టాలను మాత్రం దరిచేరకుండా చూసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని