సానుకూలతలున్నాయ్‌ కానీ..

దేశీయ సూచీలు ఈ వారం సానుకూలతలు కనబరచవచ్చని, అయితే భారీ లాభాలు ఉండకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 17,500-17,900 శ్రేణిలో నిఫ్టీ-50 కదలాడొచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కొంత దిద్దుబాటు చోటుచేసుకున్నా, సానుకూలంగానే చూడాలంటున్నారు. ఫలితాల

Published : 16 Aug 2022 03:18 IST

స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం

లాభాల స్వీకరణకూ అవకాశం  

చమురు, బ్యాంకు షేర్లు రాణించొచ్చు

అంతర్జాతీయ మార్కెట్లే కీలకం  

విశ్లేషకుల అంచనాలు

దేశీయ సూచీలు ఈ వారం సానుకూలతలు కనబరచవచ్చని, అయితే భారీ లాభాలు ఉండకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 17,500-17,900 శ్రేణిలో నిఫ్టీ-50 కదలాడొచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కొంత దిద్దుబాటు చోటుచేసుకున్నా, సానుకూలంగానే చూడాలంటున్నారు. ఫలితాల సీజను ముగింపునకు వచ్చినందున, దిశానిర్దేశం కోసం మదుపర్లు అంతర్జాతీయ మార్కెట్ల వైపు చూడొచ్చు. జులైలో రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గడం ప్రభావం చూపొచ్చు. టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు విడుదల కానున్నాయి. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ జులై సమావేశ వివరాలు ఈ వారంలో వెలుగు చూస్తాయి. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

* చాలా వరకు సిమెంటు కంపెనీలు జూన్‌ త్రైమాసికానికి బలహీన ఫలితాలకు తోడు, భవిష్యత్తు అంచనాలు కూడా అలానే ప్రకటించిన నేపథ్యంలో ఈ రంగ షేర్లు మరింత ఊగిసలాటలకు గురికావొచ్చు.  

* ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు ఒత్తిడిలో కొనసాగొచ్చు. అనిశ్చితి వల్ల కొద్ది నెలలుగా ఈ రంగ షేర్లు రక్షణాత్మక ధోరణిని కనబరచాయి.  

* యంత్ర పరికరాల కంపెనీలు రికార్డు స్థాయి ఆర్డర్లను నమోదు చేశాయి. వాటిని పూర్తి చేసే అంశంపై ఇచ్చే ప్రకటనల కోసం ఎదురు చూస్తారు.  

* ఓఎన్‌జీసీ లాభం మూడింతలైన నేపథ్యంలో చమురు షేర్లు రాణించొచ్చు. అంతర్జాతీయ ముడి చమురు ధరల కనుగుణంగా అప్‌స్ట్రీమ్‌ కంపెనీల షేర్లు కదలాడొచ్చు.

* బ్యాంకు షేర్లలో సానుకూల చలనాలు కనిపించొచ్చు. పలు బ్యాంకులు బలమైన రుణ వృద్ధి, ఆస్తుల నాణ్యతను నమోదు చేయడం ఇందుకు దోహదం చేయొచ్చు. పడినపుడల్లా షేర్లను పోగు చేసుకోవచ్చని బ్రోకరేజీ సంస్థలు అంటున్నాయి.

* ఔషధ షేర్లు స్తబ్దుగా కదలాడొచ్చు. కంపెనీలు కొత్త ఆవిష్కరణల వేగాన్ని పెంచుకోగలవా లేదా అన్నదానిని మదుపర్లు గమనించొచ్చు.

* ఐటీ కంపెనీల షేర్లలో పెద్దగా కదలికలు ఉండకపోవచ్చు. అమెరికా, ఐరోపాలలో మాంద్యం ఏర్పడవచ్చన్న అనుమానాల నేపథ్యంలో గిరాకీ ధోరణులను గమనించాలి. నేడు ఏజీఎమ్‌ జరగనున్నందున హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌పై దృష్టి పడొచ్చు.

* వాహన కంపెనీల షేర్లు మార్కెట్‌ నుంచే సంకేతాలు అందుకోవచ్చు. సెమీకండక్టర్‌ సరఫరా పెరుగుతుండడం; పండుగల సీజనులో విక్రయాలు రాణిస్తాయన్న అంచనాలతో ఈ రంగంపై సానుకూలతలు కనిపిస్తున్నాయి.

* లోహ షేర్లలో ఒత్తిడి కనిపించొచ్చు. అంతర్జాతీయంగా ఉక్కు అధిక సరఫరాపై ఆందోళనలు ఇందుకు కారణం. హిందాల్కో, సెయిల్‌ యాజమాన్య వ్యాఖ్యలు ప్రభావం చూపొచ్చు.

* టెలికాం షేర్లు మార్కెట్‌తో పాటే కదలాడొచ్చు. 5జీ సేవల ప్రారంభ పరిణామాలపై మదుపర్లు దృష్టి పెట్టొచ్చు. భారతీ ఎయిర్‌టెల్‌పై విశ్లేషకులు ‘బులిష్‌’ ధోరణితో ఉన్నారు. స్పెక్ట్రమ్‌కు సంబంధించి కంపెనీలు తొలి వాయిదాను ఈనెల 17న చెల్లించాల్సి ఉంది.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం మన ఈక్విటీ, ఫారెక్స్‌, బులియన్‌, కమొడిటీ మార్కెట్లు పనిచేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని