61000- 61500 శ్రేణి కీలకం!

సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో గత వారం సూచీలు లాభాల్లో ముగిశాయి. అదానీ గ్రూప్‌ భయాలు, సాధారణ బడ్జెట్‌, ఎఫ్‌ఐఐ అమ్మకాలు, రూపాయి బలహీనతల ప్రభావంతో సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి.

Published : 06 Feb 2023 02:25 IST

సమీక్ష: సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో గత వారం సూచీలు లాభాల్లో ముగిశాయి. అదానీ గ్రూప్‌ భయాలు, సాధారణ బడ్జెట్‌, ఎఫ్‌ఐఐ అమ్మకాలు, రూపాయి బలహీనతల ప్రభావంతో సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. దేశీయంగా చూస్తే.. సాధారణ బడ్జెట్‌లో ప్రకటించిన మూలధన వ్యయాలు, పన్ను చెల్లింపుదార్లకు ఉపశమనం వంటివి మదుపర్ల సెంటిమెంట్‌ను బలపరిచాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీఓను వెనక్కి తీసుకోవడంతో గ్రూప్‌ షేర్లు కుదేలయ్యాయి. డిసెంబరు సేవల రంగ పీఎంఐ నెమ్మదించింది. త్రైమాసిక ఫలితాల ప్రభావంతో షేరు ఆధారిత కదలికలు మార్కెట్లను నడిపించాయి. బ్యారెల్‌ ముడిచమురు 7.8 శాతం తగ్గి 79.9 డాలర్ల వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 81.52 నుంచి 81.82కు బలహీనపడింది. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లను మరో 0.25 శాతం పెంచి 4.5%-4.75% చేసింది. ధరల స్థిరత్వం వచ్చేవరకు అధిక వడ్డీరేట్లు కొనసాగుతాయని ఫెడ్‌ వెల్లడించింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ కూడా వడ్డీ రేట్లు 0.5% పెంచింది. చైనా పారిశ్రామిక కార్యకలాపాలు వరుసగా ఆరో నెలా నీరసించాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 2 శాతానికి పైగా లాభంతో 60,842 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం రాణించి 17,854 పాయింట్ల దగ్గర స్థిరపడింది. మన్నికైన వినిమయ వస్తువులు, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ రంగాలు లాభపడగా.. విద్యుత్‌, చమురు-గ్యాస్‌, ఆరోగ్య సంరక్షణ షేర్లు డీలాపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.14,444 కోట్ల షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.14,184 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. జనవరిలో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) ఈక్విటీల నుంచి నికరంగా రూ.28,852 కోట్లు వెనక్కి తీసుకున్నారు. గత 7 నెలల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 1:2గా నమోదు కావడం..
పెద్ద షేర్లలో బలహీనతలను సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: గత వారం 58000-59000 పాయింట్ల శ్రేణిలో మద్దతు తీసుకున్న సెన్సెక్స్‌, లాభాల్లో ముగిసింది. ప్రస్తుతం కీలక నిరోధమైన 61000-61500 శ్రేణి దరిదాపుల్లో ట్రేడవుతోంది. ఈ స్థాయిని అధిగమిస్తే ప్రస్తుత రికవరీ 63000 పాయింట్ల వరకు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు 59,800 పాయింట్ల వద్ద మద్దతు లభించొచ్చు.

ప్రభావిత అంశాలు: కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నుంచి దేశీయ మార్కెట్లు సంకేతాలు తీసుకోవచ్చు. ఆర్‌బీఐ ఈసారి వడ్డీ రేట్లు పెంచొచ్చని, అయితే వేగాన్ని తగ్గించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అదానీ గ్రూప్‌ పరిణామాలపై మార్కెట్లు దృష్టిపెట్టొచ్చు. సూచీల్లో కొంత ఒడుదొడుకులు కొనసాగే అవకాశం ఉంది. దేశీయంగా.. డిసెంబరు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెలువడనున్నాయి. బ్యాంక్‌ డిపాజిట్లు, రుణాల వృద్ధి గణాంకాలపై కన్నేయొచ్చు. ఈ వారం టాటా స్టీల్‌, ఎయిర్‌టెల్‌, హీరో మోటోకార్ప్‌, ఎల్‌ఐసీ, లుపిన్‌, అరబిందో ఫార్మా, వోల్టాస్‌, ఎం అండ్‌ ఎం, భెల్‌, అదానీ పోర్ట్స్‌, అంబుజా, పిరమాల్‌, హిందాల్కో, ఐఆర్‌సీటీసీ, జొమాటో వంటి కంపెనీలు ఫలితాలు ప్రకటించనున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే.. యూరో ఏరియా రిటైల్‌ విక్రయాలు, కెనడా పీఎంఐ, అమెరికా ఎగుమతులు- దిగుమతులు, చైనా ద్రవ్యోల్బణం, బ్రిటన్‌ జీడీపీ, అమెరికా వినియోగదారు విశ్వాసం, ఆస్ట్రేలియా వడ్డీ రేట్ల నిర్ణయం విడుదల కానున్నాయి. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ కొనుగోళ్ల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు.

తక్షణ మద్దతు స్థాయులు: 60,000, 59,200, 58,700
తక్షణ నిరోధ స్థాయులు: 61,266, 62,000, 62,836
సెన్సెక్స్‌ 61,000-61500 శ్రేణి అధిగమిస్తేనే లాభాలు కొనసాగే అవకాశం ఉంటుంది.

సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని