రిలయన్స్‌, బ్యాంకింగ్‌ షేర్లు నడిపించాయ్‌

సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో సెన్సెక్స్‌, నిఫ్టీ దాదాపు 1% పుంజుకున్నాయి. ముఖ్యంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బ్యాంకింగ్‌ షేర్లు మార్కెట్లను నడిపించాయి.

Published : 22 Mar 2023 01:41 IST

సమీక్ష

సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో సెన్సెక్స్‌, నిఫ్టీ దాదాపు 1% పుంజుకున్నాయి. ముఖ్యంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బ్యాంకింగ్‌ షేర్లు మార్కెట్లను నడిపించాయి. క్రెడిట్‌ సూయిజ్‌ సంక్షోభం సద్దుమణగడం సానుకూల ప్రభావం చూపింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు తగ్గి 82.59 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.65% పెరిగి 74.27 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు అదే ధోరణిలో ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 57,963.27 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కొనుగోళ్ల మద్దతుతో రోజంతా అదే దూకుడు కొనసాగించిన సూచీ.. ఇంట్రాడేలో 58,133.33 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 445.73 పాయింట్ల లాభంతో 58,074.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 119.10 పాయింట్లు పెరిగి 17,107.50 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,016- 17,127.70 పాయింట్ల మధ్య కదలాడింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 18 లాభపడ్డాయి. రిలయన్స్‌ 3.11%, బజాజ్‌ ఫైనాన్స్‌ 2.88%, టైటన్‌ 2.15%, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.14%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.94%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.89%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.73%, అల్ట్రాటెక్‌ 1.53%, ఎల్‌ అండ్‌ టీ 1.38%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.17% చొప్పున మెరిశాయి. పవర్‌గ్రిడ్‌ 2%, హెచ్‌యూఎల్‌ 1.88%, టెక్‌ మహీంద్రా 1.19%, టీసీఎస్‌ 1.12%, ఇన్ఫోసిస్‌ 0.91% నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో మన్నికైన వినిమయ వస్తువులు 1.57%, ఇంధన 0.99%, విద్యుత్‌ 0.74%, కమొడిటీస్‌ 0.71%, టెలికాం 0.63% రాణించాయి. ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ, స్థిరాస్తి, టెక్‌ నిరాశపరిచాయి. బీఎస్‌ఈలో 1978 షేర్లు లాభాల్లో ముగియగా, 1550 స్క్రిప్‌లు నష్టపోయాయి. 120 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

* ఈ ఏడాది సెప్టెంబరు 15 తరవాత సలహాదారు పదవిలో సంస్థలో కొనసాగాల్సిందిగా టీసీఎస్‌ ఎండీ, సీఈఓ రాజేశ్‌ గోపీనాథన్‌తో టాటా గ్రూప్‌ చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఎండీ పదవికి రాజీనామా చేసిన రాజేశ్‌, బాధ్యతల బదిలీ సాఫీగా సాగేందుకు సెప్టెంబరు వరకు కొనసాగుతానని వెల్లడించిన సంగతి విదితమే.

* తమ హైడ్రోకార్బన్‌ వ్యాపారం రూ.5000-7000 కోట్ల శ్రేణిలో ప్రధాన ఆర్డర్లు దక్కించుకున్నట్లు ఎల్‌ అండ్‌ టీ వెల్లడించింది.

* గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్ల ఏర్పాటు కోసం భారత సైన్యంతో ఎన్‌టీపీసీ విభాగమైన ఎన్‌టీపీసీ రెన్యూవబుల్‌ ఎనర్జీ ఒప్పందం కుదుర్చుకుంది.

* 2022-23 ఆర్థిక సంవత్సరానికి నాలుగో మధ్యంతర డివిడెండ్‌గా ఒక్కో షేరుకు రూ.26 చెల్లించేందుకు హిందుస్థాన్‌ జింక్‌ బోర్డు ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.10,985.83 కోట్లు వెచ్చించనుంది.

* బెంగళూరుకు చెందిన కృత్రిమమేధ సంస్థ ప్లూటూరాను కొనుగోలు చేయనున్నట్లు ఐటీ దిగ్గజ సంస్థ యాక్సెంచర్‌ ప్రకటించింది. లావాదేవీ మొత్తాన్ని వెల్లడించలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని