భారత వృద్ధిలో వేగం కొనసాగుతుంది
దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం 2023-24లోనూ కొనసాగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన వార్షిక నివేదికలో పేర్కొంది.
నిర్మాణాత్మక సంస్కరణలు అవసరం
మధ్యకాలంలో స్థిర వృద్ధికి అదే కీలకం
పెరిగిన నకిలీ నోట్లు, మోసాలు
విపత్తుల్లోనూ పనిచేసేలా చెల్లింపుల వ్యవస్థకు ప్రతిపాదన
ఆర్‌బీఐ వార్షిక నివేదిక
ముంబయి: దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం 2023-24లోనూ కొనసాగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన వార్షిక నివేదికలో పేర్కొంది. భౌగోళిక, రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని.. మధ్యకాలంలో స్థిర వృద్ధికీ ఇవి కీలకమని వివరించింది. ఆ నివేదికలో ఏముందంటే..
2022-23లో 7% వృద్ధి: ఈ ఏడాది మార్చిలో కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాంకుల వైఫల్యం వల్ల ఏర్పడిన అనిశ్చితి ఇపుడు తొలిగింది. అయితే అంతర్జాతీయ వృద్ధి మందగమనం పాలవుతున్నందున ఆర్థిక మార్కెట్లలో ఊగిసలాట పెరగొచ్చు. ఈ పరిస్థితుల్లోనూ మనదేశ వృద్ధి రేటు 2022-23లో 7 శాతంగా నమోదు కావచ్చు. ప్రజల్లో ఖర్చుపెట్టే ధోరణి పుంజుకుంది. వినియోగదారు విశ్వాసం రాణిస్తోంది. కొవిడ్ పరిణామాల అనంతరం పండగ సీజనులో వ్యయాలు పెరగడం, ప్రభుత్వం మూలధన వ్యయాలు పెంచడం వంటివి వృద్ధికి ఊతంగా నిలవనున్నాయి. బలమైన స్థూల ఆర్థిక విధానాలకు తోడు కమొడిటీ ధరలు తగ్గడం, బలమైన ఆర్థిక రంగం, ఆరోగ్యకర కార్పొరేట్ రంగం, ద్రవ్య విధానాల మద్దతు వల్ల 2023-24లోనూ వృద్ధిలో వేగం కొనసాగొచ్చు. అయితే వృద్ధిపై, అంతర్జాతీయ అనిశ్చితి కొంత మేర ప్రభావం చూపొచ్చు. మధ్యకాలంలో ద్రవ్య పరపతి విధాన చర్యల ద్వారా, రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యంలోపే ఉండేలా చూస్తాం.
విపత్తు సమయాల్లో చెల్లింపులకు..
ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాల వంటి విపత్తు సమయాల్లో కీలక ఆర్థిక లావాదేవీలను జరపడానికి ప్రత్యేక చెల్లింపుల వ్యవస్థను తీసుకురావడంపై ఆర్‌బీఐ దృష్టి సారించింది. ‘ప్రజల ప్రాణాలను రక్షించేందుకు బంకర్లు ఎలా ఉపయోగ పడతాయో, అందుకు సమాన స్థాయిలో కీలక చెల్లింపులకు ఈ వ్యవస్థ’ ఉపయోగ పడాలన్నది ఆర్‌బీఐ లక్ష్యం. ప్రస్తుత సంప్రదాయ సాంకేతికతలకు భిన్నంగా.. ఎక్కడి నుంచైనా, చాలా తక్కువ మంది సిబ్బందితో నిర్వహించేలా ఒక లైట్ వెయిట్ అండ్ పోర్టబుల్ పేమెంట్ సిస్టమ్(ఎల్‌పీఎస్‌ఎస్)ను ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఆన్‌లైన్ చెల్లింపులకు ఉపయోగపడుతున్న ఆర్‌టీజీఎస్, నెఫ్ట్, యూపీఐ వ్యవస్థలు భారీ పరిమాణం లావాదేవీలకు ఉపయోగపడుతున్నాయి. అయితే సంక్లిష్ట వైర్ నెట్‌వర్క్‌లు, అధునాతన ఐటీ వ్యవస్థలపై ఆధారపడి ఇవి పనిచేస్తున్నాయి. ప్రకృతి విపత్తులో ఆయా వ్యవస్థలకు ఇబ్బంది కలిగితే, ఇవి పనిచేయకపోవచ్చు. అప్పుడు ప్రభుత్వ, మార్కెట్లకు సంబంధించి కీలక ఆర్థిక చెల్లింపులు జరిపేందుకు ఎల్‌పీఎస్‌ఎస్ ఉపకరించాలన్నది లక్ష్యం.
అంచనా నష్టాల విధానం..
2023-24లో నిరర్థక ఆస్తుల కోసం ఆర్థిక సంస్థలు జరిపే కేటాయింపులకు వీలుగా ‘నష్టం అంచనాల విధానాన్ని’ తీసుకురావాలని ప్రతిపాదించింది. తద్వారా మొండి బకాయిల పరిష్కార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది. దీని ద్వారా బ్యాంకులు తమ సొంత రుణ నష్ట నమూనాలను రూపకల్పన చేసుకోవచ్చు. అయిదేళ్ల కాలానికి అధిక కేటాయింపులు చేసుకోవచ్చు.
* 2022-23లో ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీటు 2.5% పెరిగి రూ.63.45 లక్షల కోట్లకు చేరింది. అధికాదాయం ఇందుకు దోహదం చేసింది. 2021-22లో ఇది రూ.61,90,302.27 కోట్లుగా ఉంది.
మోసాలు ఇలా
* 2020-21 లో 77 వేలు, 2021-22లో 84 వేలు, 2022-23లో 95 వేలకు పైగా యూపీఐ మోసాల కేసులు నమోదయ్యాయి.
* మన సెల్‌ఫోన్లలోకి మోసగాళ్లు పంపే రిమోట్ అసిస్టెన్స్ సాఫ్ట్‌వేర్లను డౌన్‌లోడ్ చేసుకున్నామా.. మన ఫోన్‌లోని సమాచారం మొత్తం వారి ఆధీనంలోకి వెళ్లిపోతుంది. తదుపరి కస్టమర్ కేర్ ప్రతినిధులుగా మాట్లాడుతూ ఇ-కేవైసీ పూర్తి చేయాలని, లేని పక్షంలో వాలెట్లు పని చేయవని చెబుతుంటారు. ఆధార్-పాన్ అనుసంధానం చేయాలంటూ, ఆ నంబర్లు కాజేస్తున్నారు. తదుపరి వారే పంపే యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే, మన వాలెట్‌లోని నగదు అంతా ఖాళీ అవుతోంది.
* నకిలీ యూపీఐ రిక్వెస్ట్ కావాలనే మన యూపీఐ ఖాతాకు నగదు పంపిస్తారు. ఆ తరువాత ఫోన్ చేసి పొరపాటున నగదు మీ నంబరుకు పంపామని, ఆ డబ్బుతో అత్యవసరంగా పని ఉన్నందున, తిరిగి పంపించమని ప్రాధేయ పడతారు. ఇందుకోసం మరో లింక్ పంపిస్తారు. దాన్ని క్లిక్ చేశామా.. మన ఫోన్ వారి ఆధీనంలోకి వెళ్తుంది. వాలెట్, బ్యాంకు ఖాతాలోని నగదు దోచేస్తారు. అందువల్ల ఇలాంటివి అంగీకరించకూడదు. మనకు నగదు వచ్చిన నంబరుకే బదిలీ చేస్తే సరిపోతుంది.
* యూపీఐ పిన్‌ను ప్రతి నెలా మార్చుకోవడం సురక్షితం. కస్టమర్ కేర్ ప్రతినిధులం అని చెప్పినా , ఈ వివరాలు ఇవ్వకూడదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
YSRCP: వైకాపా జిల్లా అధ్యక్షుల మార్పు
-
Vizag: ఫోర్జరీ సంతకాలతో ముదపాక భూముల విక్రయం
-
Rahul Gandhi: భారాస అంటే భాజపా రిస్తేదార్ సమితి: రాహుల్
-
TDP: ‘ఐప్యాక్‌కు రూ.274 కోట్లు అప్పనంగా దోచిపెట్టారు’
-
Jangaon: విద్యుత్తు స్తంభంపై కార్మికుని నరకయాతన