అల్ట్రాటెక్‌ సిమెంట్‌ డివిడెండ్‌ 700%

ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంస్థ అల్ట్రాటెక్‌ సిమెంట్‌, జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం ఏకీకృత పద్ధతిలో 35.24% పెరిగి రూ.2,258.58 కోట్లకు చేరింది.

Published : 30 Apr 2024 02:08 IST

జనవరి- మార్చి లాభం రూ.2,258.60 కోట్లు

దిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంస్థ అల్ట్రాటెక్‌ సిమెంట్‌, జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం ఏకీకృత పద్ధతిలో 35.24% పెరిగి రూ.2,258.58 కోట్లకు చేరింది. 2022-23 ఇదే త్రైమాసికంలో సంస్థ నికర లాభం రూ.1,670.10 కోట్లే. ఇంధన, ముడి సరుకు వ్యయాలు తగ్గడం, నిర్వహణ సామర్థ్యం, విక్రయాలు పెరగడం ఇందుకు దోహదం చేశాయి. ఇదే సమయంలో కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.18,662.38 కోట్ల నుంచి 9.41% పెరిగి రూ.20,418.94 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు 6.7% పెరిగి రూ.17,381.09 కోట్లుగా నమోదయ్యాయి. ఇతర ఆదాయంతో కలిపి మొత్తం ఆదాయం 9.42% పెరిగి రూ.20,554.55 కోట్లకు  చేరింది. సిమెంటు రవాణా, విద్యుత్‌ వ్యయాలు 2%, ఇంధన వ్యయాలు 21%, ముడి సరకు వ్యయాలు 15% తగ్గాయని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ తెలిపింది.

  •  ఏకీకృత విక్రయాలు 33.22 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల నుంచి 11% పెరిగి 35.08 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు చేరాయి.
  •  దేశీయ విక్రయాలు 11% పెరగ్గా, సామర్థ్య వినియోగం 98 శాతంగా ఉందని కంపెనీ తెలిపింది.
  •  పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2023-24) అల్ట్రాటెక్‌ సిమెంట్‌ నికర లాభం 38.05% పెరిగి రూ.7,003.96 కోట్లకు చేరింది. 2022-23లో నికర లాభం రూ.5,073.40 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం 12.21% వృద్ధితో రూ.71,525.09 కోట్లకు చేరింది.
  •  అల్ట్రాటెక్‌ బిల్డింగ్‌ సొల్యూషన్స్‌ (యూబీఎస్‌) విక్రయ కేంద్రాలు 3,952కు చేరాయి. ఇవి 6.2 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సిమెంటును విక్రయించాయి. మొత్తం విక్రయాల్లో వీటి వాటా 28%.
  •  రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.70 (700%) డివిడెండును డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.

సోమవారం బీఎస్‌ఈలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేరు 2.7% పెరిగి రూ.9,962.25 వద్ద ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని