రుసుముల రూపేణా బీఎస్‌ఈపై రూ.165 కోట్ల భారం

ఆప్షన్ల కాంట్రాక్టులపై, ప్రీమియం విలువ మీద కాకుండా.. నోషనల్‌ వ్యాల్యూ మీద రుసుము చెల్లించాల్సిందిగా బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీని (బీఎస్‌ఈ) సెబీ ఆదేశించింది.

Published : 30 Apr 2024 02:09 IST

సెబీ ఆదేశాల నేపథ్యం

దిల్లీ: ఆప్షన్ల కాంట్రాక్టులపై, ప్రీమియం విలువ మీద కాకుండా.. నోషనల్‌ వ్యాల్యూ మీద రుసుము చెల్లించాల్సిందిగా బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీని (బీఎస్‌ఈ) సెబీ ఆదేశించింది. ప్రీమియం విలువకు, నోషనల్‌ విలువకు మధ్య వ్యత్యాసం చాలానే ఉంటుంది కనుక, ఇకపై సెబీకి రుసుము కింద మరింత ఎక్కువ మొత్తాన్ని బీఎస్‌ఈ చెల్లించాల్సి రావచ్చు. గత సంవత్సరాలకు కూడా ఈ ప్రకారంగా ఎంతైతే తక్కువగా చెల్లించిందో, ఆ రుసుమును 15% వార్షిక వడ్డీతో కలిపి చెల్లించాలని సెబీ సూచించినట్లు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ)కి ఇచ్చిన సమాచారంలో బీఎస్‌ఈ వెల్లడించింది. బీఎస్‌ఈ వద్ద లభ్యమవుతున్న ప్రాథమిక వివరాల ప్రకారం చూస్తే.. ఇందుకోసం బీఎస్‌ఈ రూ.165 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. దీనికి జీఎస్‌టీ అదనం. ఈ ఆదేశాలకు సంబంధించిన లేఖను అందుకున్న తేదీ నుంచి, నెల రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని ఎన్‌ఎస్‌ఈకి బీఎస్‌ఈ తెలిపింది. ట్రేడవుతున్న మొత్తం కాంట్రాక్టుల స్ట్రైక్‌ ప్రైస్‌ను నోషనల్‌ వ్యాల్యూగా పరిగణిస్తారు. ట్రేడవుతున్న మొత్తం కాంట్రాక్టుల మొత్తం ప్రీమియంను, ప్రీమియం విలువగా లెక్కలోకి తీసుకుంటారు. కాగా.. సెబీ ఆదేశాల ప్రభావంతో సోమవారం ఎన్‌ఎస్‌ఈలో బీఎస్‌ఈ షేరు ఇంట్రాడేలో 18.64% నష్టంతో రూ.2,612కు దిగివచ్చింది. చివరకు 13.31 శాతానికి నష్టాన్ని పరిమితం చేసుకుని రూ.2,783 వద్ద స్థిరపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని