డాక్టర్‌ రెడ్డీస్‌కు రూ.1,307 కోట్ల లాభం

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు నమోదు చేసింది.

Published : 08 May 2024 03:46 IST

ఆదాయాల్లో 12% వృద్ధి
800% డివిడెండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు నమోదు చేసింది. ఏకీకృత ఖాతాల ప్రకారం ఆదాయం రూ.7,083 కోట్లు ఉండగా, దీనిపై రూ.1,307 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదేకాల ఫలితాలతో పోల్చి చూస్తే ఆదాయం 12%, నికరలాభం 36% పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం (2023-24) పూర్తి కాలానికి డాక్టర్‌ రెడ్డీస్‌ ఆదాయం రూ.27,916 కోట్లు కాగా, దీనిపై రూ.5,568 కోట్ల నికరలాభం, రూ.334 ఈపీఎస్‌ నమోదయ్యాయి.

అమెరికాలో అధిక వృద్ధి: ప్రధానంగా ఉత్తర అమెరికా మార్కెట్లో అధిక వృద్ధి నమోదు చేసినందున, గత ఆర్థిక సంవత్సరంలో ఆకర్షణీయ రీతిలో ఆదాయాలు, లాభాలు ఆర్జించగలిగినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ సహ-ఛైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ అన్నారు. వివిధ సంస్థలతో లైసెన్సింగ్‌, సహకార ఒప్పందాలు కుదుర్చుకున్నందున సమీప భవిష్యత్తులో వృద్ధి బాటలో కొనసాగేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పలు కొత్త ఔషధాలను అమెరికాలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

నగదు నిల్వలు రూ.6460 కోట్లు: గత ఆర్థిక సంవత్సరంలో ఉత్తర అమెరికా ఆదాయాలు, 2022-23తో పోల్చితే 28% పెరిగాయి. ఐరోపాలో 17%, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 3% చొప్పున ఆదాయాలు పెరిగాయి. రష్యా అమ్మకాల్లో 7% పెరుగుదల కనిపిస్తోంది. కానీ మనదేశంలో అమ్మకాలు 5% తగ్గాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ మూలధన వ్యయం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,520 కోట్లు ఉంది. మార్చి చివరికి కంపెనీ చేతిలో రూ.6,460 కోట్ల నగదు నిల్వ ఉంది. డెట్‌-టు-ఈక్విటీ నిష్పత్తి 0.23, ఆర్‌ఓసీఈ (రిటర్న్‌ ఆన్‌ కేపిటల్‌ ఎంప్లాయిడ్‌) 36% ఉన్నాయి. వాటాదార్లకు 800% డివిడెండ్‌ (రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ.40 చొప్పున) చెల్లించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది.

నూతన సీఎఫ్‌ఓ ఎం.వి.నరసింహం: డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ నూతన సీఎఫ్‌ఓగా ఎం.వి.నరసింహం నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన డాక్టర్‌ రెడ్డీస్‌లోనే డిప్యూటీ సీఎఫ్‌ఓగా పనిచేస్తున్నారు. ‘మేనేజ్‌మెంట్‌ కౌన్సిల్‌’లో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి సీఎఫ్‌ఓగా ఆయన బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం డాక్టర్‌ రెడ్డీస్‌ సీఎఫ్‌ఓగా ఉన్న పరాగ్‌ అగర్వాల్‌ తన వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశారు. ఈ ఏడాది జులై 31న ఆయన బాధ్యతల నుంచి వైదొలగుతారు.

జులై 29న ఏజీఎం: డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఏజీఎం (వాటాదార్ల వార్షిక సమావేశం) ఈ ఏడాది జులై 29న జరగనుంది. ఇది 40వ ఏజీఎం కావడం ప్రత్యేకత.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు