ఫారెక్స్‌ మార్కెట్లో జోక్యాన్నిభారత్‌ తగ్గించుకోవాలి

విదేశీ మారక మార్కెట్లో జోక్యం గురించి వెల్లడించడంలో భారత్‌ ఆదర్శప్రాయంగా ఉంటోందని అమెరికా ఆర్థిక శాఖ పేర్కొంది. అదే సమయంలో ఆర్థిక మూలాలను ప్రతిబింబించేలా మారక రేటు చలించేలా ప్రభుత్వం చేయాలని అంటోంది. విదేశీ మారక జోక్యాన్ని పరిమితం చేసుకోవాలని సూచించింది

Published : 05 Dec 2021 02:52 IST

అమెరికా ఆర్థిక శాఖ

వాషింగ్టన్‌: విదేశీ మారక మార్కెట్లో జోక్యం గురించి వెల్లడించడంలో భారత్‌ ఆదర్శప్రాయంగా ఉంటోందని అమెరికా ఆర్థిక శాఖ పేర్కొంది. అదే సమయంలో ఆర్థిక మూలాలను ప్రతిబింబించేలా మారక రేటు చలించేలా ప్రభుత్వం చేయాలని అంటోంది. విదేశీ మారక జోక్యాన్ని పరిమితం చేసుకోవాలని సూచించింది. ‘ఆర్థిక రికవరీ పుంజుకునే కొద్దీ అధికారులు నిర్మాణాత్మక సంస్కరణలను కొనసాగించాలి. అపుడే ఉత్పాదకత, జీవన ప్రమాణాలు పెరుగుతాయ’ని అభిప్రాయపడింది. అమెరికాకు ప్రధాన వాణిజ్య భాగస్వాములుగా ఉన్న దేశాలకు చెందిన విదేశీ మారక విధానాలు, స్థూల ఆర్థిక వ్యవస్థపై ఇచ్చిన పాక్షిక వార్షిక నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. ఫారెక్స్‌ విషయంలో అమెరికా ‘పరిశీలన జాబితా’లో ఉన్న 12 దేశాల్లో భారత్‌ కూడా ఉన్న విషయం తెలిసిందే. ‘జూన్‌ 2021 వరకు 12 నెలల్లో 10 నెలల పాటు ఆర్‌బీఐ విదేశీ మారకాన్ని కొనుగోలు చేసింది. జులై 2020 నుంచి ఫిబ్రవరి 2021 మధ్య భారీ కొనుగోళ్లు చేసింది. ఆ తర్వాత కరోనా రెండో దశ ఆగాక..మార్చి, ఏప్రిల్‌లో పరిమిత స్థాయిలో విక్రయాలు చేసింద’ని తన నివేదిలో పేర్కొంది. ‘జూన్‌ 2021తో ముగిసిన నాలుగు త్రైమాసికాల్లో అమెరికాతో భారత వస్తువులు, సేవల వాణిజ్య మిగులు 40 బిలియన్‌ డాలర్లకు పైగా నమోదైంది. 2013-2019 మధ్య ఉన్న 30 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఇది ఎక్కువ’ అని కూడా తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని