సంక్షిప్త వార్తలు

రెడ్‌క్లిఫ్‌ లైఫ్‌టెక్‌ అనుబంధ విభాగం రెడ్‌క్లిఫ్‌ ల్యాబ్స్‌ రాబోయే ఆరు నెలల్లో 1,000 మందిని పైగా నియమించుకునే యోచనలో ఉంది. ప్రారంభ, మధ్య, ఉన్నతస్థాయి ఉద్యోగుల నియామకాలను చేపట్టనుంది.

Published : 07 Dec 2021 02:25 IST

6 నెలల్లో 1,000 నియామకాలు: రెడ్‌క్లిఫ్‌

దిల్లీ: రెడ్‌క్లిఫ్‌ లైఫ్‌టెక్‌ అనుబంధ విభాగం రెడ్‌క్లిఫ్‌ ల్యాబ్స్‌ రాబోయే ఆరు నెలల్లో 1,000 మందిని పైగా నియమించుకునే యోచనలో ఉంది. ప్రారంభ, మధ్య, ఉన్నతస్థాయి ఉద్యోగుల నియామకాలను చేపట్టనుంది. బెంగళూరు, హైదరాబాద్‌, ముంబయితో పాటు, ద్వితీయ శ్రేణి నగరాలైన రాయ్‌పుర్‌, డెహ్రడూన్‌, కాన్పూర్‌లలో ఈ నియామకాలు ఉంటాయని రెడ్‌క్లిఫ్‌ ల్యాబ్స్‌ తెలిపింది. సీనియర్‌ నాయకత్వ హోదాలు, టెక్నాలజీ, మార్కెటింగ్‌, విక్రయాలు, వినియోగదారుల సహకారం, కార్యకలాపాలు, ఫ్లెబొటోమిస్ట్స్‌ లాంటి విభాగాల్లో నియామకాలు జరుపుతామంది.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 నగరాల్లో 1,200 మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు.


‘జేపియర్‌’తో ‘క్విగ్జీ’ భాగస్వామ్యం

ఈనాడు, హైదరాబాద్‌: క్లౌడ్‌ ఆధారిత నో-కోడ్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌, ఎంటర్‌ప్రైజ్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ సేవల సంస్థ అయిన క్విగ్జీ, అమెరికాకు చెందిన జేపియర్‌తో చేతులు కలిపింది. దీనివల్ల క్విగ్జీ వినియోగదార్లు తమ ఎంటర్‌ప్రైజ్‌ యాప్‌లను, గూగుల్‌ షీట్స్‌, గూగుల్‌ డాక్స్‌, జీమెయిల్‌, మైక్రోసాఫ్ట్‌ అవుట్‌లుక్‌, సేల్స్‌ఫోర్స్‌, బాక్స్‌, డ్రాప్‌బాక్స్‌, అడోబ్‌ సైన్‌, హబ్‌స్పాట్‌ వంటి 3,000 కు పైగా యాప్‌లు, సేవలను నో-కోడ్‌ పద్ధతిలో కనెక్ట్‌ చేయొచ్చు. ఈ భాగస్వామ్యం వల్ల ఉత్పాతదకత పెరగటంతో పాటు, జాప్యాన్ని నివారించవచ్చని క్విగ్జీ వ్యవస్థాపకుడు, సీఈఓ గౌతమ్‌ నిమ్మగడ్డ వివరించారు. ప్రస్తుతం తమకు 1.8 లక్షల మందికి పైగా యూజర్లు, 15 రకాల పరిశ్రమలకు చెందిన 60 మంది క్లయింట్లు ఉన్నట్లు తెలిపారు. జేపియర్‌తో భాగస్వామ్యం వల్ల ఒక ఏడాది వ్యవధిలో తమ యూజర్ల సంఖ్య 10 లక్షలకు, క్లయింట్ల సంఖ్య 100కు పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు.


నేపాల్‌ నుంచి కిసాన్‌క్రాఫ్ట్‌కు రూ.20 కోట్ల ఆర్డర్‌

ఈనాడు, హైదరాబాద్‌: నెల్లూరు జిల్లాలోని యూనిట్లో పలు రకాలవ్యవసాయ యంత్ర సామగ్రి ఉత్పత్తి చేస్తున్న కిసాన్‌క్రాఫ్ట్‌ అనే సంస్థకు నేపాల్‌ నుంచి రూ.20 కోట్ల ఆర్డర్‌ లభించింది. 5,000 ఇంటర్‌కల్టివేటర్‌ యంత్రాలను సరఫరా చేయాల్సి ఉన్నట్లు కిసాన్‌క్రాఫ్ట్‌ ఛైర్మన్‌ రవీంద్ర అగ్రవాల్‌ వెల్లడించారు. ఇటీవల కాలంలో సార్క్‌ దేశాలకు తమ వ్యవసాయ యంత్రాలను ఎగుమతి చేయడంపై ఈ కంపెనీ దృష్టి సారించింది. మనదేశంలోని కఠిన వ్యవసాయ పరిస్థితులను తట్టుకునేలా  కిసాన్‌క్రాఫ్ట్‌ యంత్ర సామగ్రిని రూపొందించామని, ఇటువంటి పరిస్థితులే ఉన్న నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక తదితర సార్క్‌ దేశాలకు సైతం ఈ యంత్రాలు అనువుగా ఉంటాయని తెలిపారు.


ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో60 ‘పీఎల్‌ఐ’ దరఖాస్తులకు ఆమోదం

దిల్లీ: ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కింద ప్రోత్సాహకాలను కోరుతూ ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ కంపెనీలు సమర్పించిన పెట్టుబడి ప్రతిపాదనల్లో 60 దరఖాస్తులకు సోమవారం కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో అమూల్‌, ఐటీసీ, హెచ్‌యూఎల్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, పార్లే ఆగ్రో, టాటా కన్జూరమ్‌ ప్రోడక్ట్స్‌, నెస్లే ఇండియా వంటి సంస్థల ప్రతిపాదనలు ఉన్నాయి. కేటగిరి 1 కింద 91 దరఖాస్తులు రాగా, 60 ప్రతిపాదనలను ఆమోదించారు. ఇందులో 12 దరఖాస్తులు రెడీ టు ఈట్‌, రెడీ టు కుక్‌ విభాగానికి చెందిన కంపెనీలవి కాగా.. 17 దరఖాస్తులు పండ్లు, కూరగాయాల విభాగ కంపెనీలవి. సముద్ర ఉత్పత్తులకు చెందిన 11 దరఖాస్తులకు ఆమోదం తెలుపగా, ఇందుఓ అవంతి ఫ్రోజన్‌ ఫుడ్స్‌ కూడా ఉంది.


ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులకు ఒకే ధర ఉండాలి

బి2బి రిటైలర్లతో సమాన అవకాశాలు కల్పించాలి
లేదంటే మేం సరఫరా నిలిపేస్తాం ః కంపెనీలకు డిస్ట్రిబ్యూటర్ల హెచ్చరిక 

దిల్లీ: ఎఫ్‌ఎంసీజీ  కంపెనీలు తమ ఉత్పత్తుల్ని అందరికీ ఒకే ధరకు అందించాలని, లేదంటే తమ పోర్ట్‌ఫోలియో నుంచి ఆ ఉత్పత్తుల్ని తొలగిస్తామని ఆలిండియా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐసీపీడీఎఫ్‌) హెచ్చరించింది. సంపద్రాయ పంపిణీదార్లతో పోలిస్తే బిజినెస్‌ టు బిజినెస్‌ (బి2బి) పంపిణీ సంస్థలకు తక్కువ ధరలకే ఉత్పత్తులు అందించడం తమకు ఇబ్బందిగా మారుతోందని ఫెడరేషన్‌ ఆవేదన వ్యక్తం చేసింది. జియోమార్ట్‌, వాల్‌మార్ట్‌, మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ, బూకర్‌, ఎలాస్టిక్‌రన్‌, ఉడాన్‌ వంటి బి2బి సంస్థలకు ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు తక్కువ ధరలకు ఉత్పత్తులు విక్రయించడాన్ని కొనసాగిస్తే, జనవరి నుంచి సహాయ నిరాకరణకు దిగుతామని పేర్కొంది. ఒకే బ్రాండ్‌ ఉత్పత్తిని రెండు ధరలతో విపణిలోకి ఎలా ప్రవేశ  ఏఐసీపీడీఎఫ్‌ అధ్యక్షుడు ధైర్యశీల్‌ పాటిల్‌ ప్రశ్నించారు.  


ప్రపంచ దిగ్గజ ఆయుధ తయారీ సంస్థల్లో హెచ్‌ఏఎల్‌, భెల్‌, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ

దిల్లీ: ఆయుధాల తయారీ, మిలిటరీ సేవలపరంగా ప్రపంచంలోని అత్యుత్తమ 100 కంపెనీల జాబితాలో మనదేశానికి చెందిన మూడు కంపెనీలకు చోటు లభించింది. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) 42వ స్థానంలో నిలవగా ఇండియన్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీస్‌కు 60వ ర్యాంకు, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌)కు 66వ ర్యాంకు లభించాయి. 2020 సంవత్సరానికి గాను స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రి) ఈ జాబితాను రూపొందించింది. 2020లో ఈ మూడు సంస్థల మొత్తం ఆయుధాల విక్రయాలు 2019తో పోలిస్తే 1.7 శాతం పెరిగి 6.5 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 100 అత్యుత్తమ కంపెనీల మొత్తం విక్రయాల్లో ఈ మూడింటి వాటా 1.2 శాతమని సిప్రి పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని