కొత్త ఏడాదిలో కొలువుల కోలాహలం

కొత్త ఏడాది తొలి మూడు నెలల్లో దేశీయంగా కొలువుల కోలాహలం నెలకొంటుందని మ్యాన్‌పవర్‌ గ్రూపు ఎంప్లాయ్‌మెంట్‌ అవుట్‌లుక్‌ తాజా సర్వే పేర్కొంది. కొవిడ్‌-19 ముందు స్థాయికి ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందని కంపెనీలు విశ్వసిస్తుండటమే ఇందుకు కారణమని సర్వే పేర్కొంది. నియామకాలకు

Published : 15 Dec 2021 04:49 IST

నియామకాలకు ఎనిమిదేళ్లలోనే అత్యంత ఆశావహ స్థితి: మ్యాన్‌పవర్‌

దిల్లీ: కొత్త ఏడాది తొలి మూడు నెలల్లో దేశీయంగా కొలువుల కోలాహలం నెలకొంటుందని మ్యాన్‌పవర్‌ గ్రూపు ఎంప్లాయ్‌మెంట్‌ అవుట్‌లుక్‌ తాజా సర్వే పేర్కొంది. కొవిడ్‌-19 ముందు స్థాయికి ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందని కంపెనీలు విశ్వసిస్తుండటమే ఇందుకు కారణమని సర్వే పేర్కొంది. నియామకాలకు ఇంత బలంగా సానుకూల పరిస్థితులు నెలకొనడం ఎనిమిదేళ్లలో ఇప్పుడేనని వెల్లడించింది. 3,020 సంస్థల నుంచి సేకరించిన అభిప్రాయాలతో నివేదిక రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. ఈ ప్రకారం.. సిబ్బంది సంఖ్యను పెంచుకుంటామని 64 శాతం కంపెనీలు తెలిపాయి. 15 శాతం కంపెనీలు సిబ్బందిని తగ్గించుకుంటామని చెప్పగా.. 20 శాతం కంపెనీలు సిబ్బంది సంఖ్యలో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చని తెలిపాయి. ఈ ప్రకారం నికరంగా 49 శాతం కంపెనీలు నియామకాలను పెంచుకునే ప్రణాళికలో ఉన్నట్లు తేలింది.

వినియోగం పెరగడం, విద్యా సంస్థల పునఃప్రారంభం, కొవిడ్‌-19 టీకాలు వేసే కార్యక్రమం వేగవంతంతో దేశ ఆర్థిక వ్యవస్థ వి-ఆకారంలో పుంజుకుందని మ్యాన్‌పవర్‌ గ్రూపు ఇండియా మేనేజింగ్‌ డైరెక్టరు సందీప్‌ గులేటి తెలిపారు. ఐటీ, సాంకేతిక రంగాల్లోని నియామకాలపై అదనంగా ‘గ్రేట్‌ రిజిగ్నేషన్‌’ (ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాల నుంచి వైదొలగడం) ప్రభావం కూడా ఉంటుందని తెలిపారు.

డిజిటల్‌కే అధిక గిరాకీ
చిన్న కంపెనీలతో పోలిస్తే పెద్ద కంపెనీల్లోనే అధిక నియామకాలు చోటుచేసుకోవచ్చు. 51 శాతం పెద్ద కంపెనీలు, 15 శాతం చిన్న కంపెనీలు నియామకాలపై యోచన చేస్తున్నాయి. డిజిటల్‌ విభాగంలోని ఉద్యోగాలకే అధిక గిరాకీ ఉందని సర్వే గుర్తించింది. ఐటీ, టెక్నాలజీ, టెలికాం, కమ్యూనికేషన్స్‌, మీడియా రంగాల్లో అత్యధిక కంపెనీలు (60%) నియామకాల ప్రణాళికలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో రెస్టారెంట్లు, హోటళ్లు (56%); బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, బీమా, స్థిరాస్తి (52%) రంగాలు ఉన్నాయి.హైబ్రిడ్‌  పని విధానం వైపు చాలా కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని