మూడో రోజూ నష్టాలే

వరుసగా మూడో రోజూ సెన్సెక్స్‌, నిఫ్టీ ఆరంభ లాభాలను పొగొట్టుకున్నాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు లభించినప్పటికీ.. ఐటీ, వినియోగ, లోహ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడం

Published : 26 May 2022 03:14 IST

సమీక్ష

వరుసగా మూడో రోజూ సెన్సెక్స్‌, నిఫ్టీ ఆరంభ లాభాలను పొగొట్టుకున్నాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు లభించినప్పటికీ.. ఐటీ, వినియోగ, లోహ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడం ప్రతికూల ప్రభావం చూపింది. విదేశీ మదుపర్ల అమ్మకాలు, ముడిచమురు ధరలు సైతం మార్కెట్లపై ఒత్తిడి  పెంచాయి. అమెరికా ఫెడ్‌ గత సమావేశ నిర్ణయాలు వెలువడనుండటం కొంత అప్రమత్తతకు కారణమైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు పెరిగి 77.54 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు ధర 1.37% పెరిగి 115.1 డాలర్లకు చేరింది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్‌, షాంఘై, సియోల్‌ లాభపడగా.. టోక్యో స్వల్పంగా నష్టపోయింది. ఐరోపా సూచీలు మెరుగ్గా కదలాడాయి.

సెన్సెక్స్‌ ఉదయం 54,254.07 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అదే జోరు కొనసాగిస్తూ 54,379.59 పాయింట్ల వద్ద గరిష్ఠానికి చేరింది. అనంతరం మదుపర్ల అమ్మకాలతో నష్టాల్లోకి జారుకున్న సూచీ, ఒకదశలో 53,683.16 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 303.35 పాయింట్ల నష్టంతో   53,749.26 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం   99.35 పాయింట్లు తగ్గి 16,025.80 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,006.95- 16,223.35 పాయింట్ల మధ్య కదలాడింది.
నీ ఎగుమతులపై ఆంక్షల నేపథ్యంలో రెండో రోజూ చక్కెర షేర్లు క్షీణించాయి. దాల్మియా భారత్‌ 13.40%, ద్వారికేశ్‌ షుగర్‌ 9.38%, ఉత్తమ్‌ షుగర్‌ మిల్స్‌ 9.30%, బలరామ్‌పూర్‌ చీనీ 8.56%, అవధ్‌ షుగర్‌  8.04%, శ్రీరేణుకా 6.69%, మవానా షుగర్స్‌ 4.97% చొప్పున నష్టపోయాయి.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 18 నీరసపడ్డాయి. ఏషియన్‌ పెయింట్స్‌ 8.04%, టీసీఎస్‌ 3.69%, టెక్‌ మహీంద్రా 3.53%, విప్రో 3.30%, ఎల్‌ అండ్‌ టీ 3.09%, ఇన్ఫోసిస్‌ 2.06%, ఎం అండ్‌ ఎం 1.96%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.77%, ఎస్‌బీఐ  1.76%, టైటన్‌ 1.31% చొప్పున నష్టపోయాయి. ఎన్‌టీపీసీ 3.84%, కోటక్‌ బ్యాంక్‌  1.42%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.41%, హెచ్‌డీఎఫ్‌సీ 1.35%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.76% రాణించాయి. రంగాల వారీ సూచీల్లో ఐటీ         3.19%, స్థిరాస్తి 3.02%, పరిశ్రమలు 2.66%, ఎఫ్‌ఎమ్‌సీజీ 2.47%, యంత్ర పరికరాలు  2.44% కుదేలయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని