Home Loan: గృహ రుణానికి.. ధీమా!

గృహరుణం... ఒక వ్యక్తి జీవితంలో ఇదే పెద్ద అప్పు. దీన్ని తీసుకున్న వ్యక్తికి అనుకోనిదేదైనా జరిగితే.. కుటుంబానికి ఆ వ్యక్తిని కోల్పోయిన బాధ ఒక వైపు.. అప్పు చెల్లించలేకపోతే.. ఉంటున్న ఇంటిని వదులుకోవాలా అనే ఆందోళన మరోవైపు.. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే.. ఇంటి రుణం తీసుకున్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఈ రుణాన్ని చెల్లించేందుకు అవసరమైన బీమా ఏర్పాట్లు  చేసుకోవాల్సిందే. మరి, ఆ పాలసీని  ఎలా తీసుకోవాలి? తెలుసుకుందాం..

Updated : 21 May 2021 08:39 IST

గృహరుణం... ఒక వ్యక్తి జీవితంలో ఇదే పెద్ద అప్పు. దీన్ని తీసుకున్న వ్యక్తికి అనుకోనిదేదైనా జరిగితే.. కుటుంబానికి ఆ వ్యక్తిని కోల్పోయిన బాధ ఒక వైపు.. అప్పు చెల్లించలేకపోతే.. ఉంటున్న ఇంటిని వదులుకోవాలా అనే ఆందోళన మరోవైపు.. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే.. ఇంటి రుణం తీసుకున్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఈ రుణాన్ని చెల్లించేందుకు అవసరమైన బీమా ఏర్పాట్లు  చేసుకోవాల్సిందే. మరి, ఆ పాలసీని  ఎలా తీసుకోవాలి? తెలుసుకుందాం..
ఆర్జించే వ్యక్తికి ఏదైనా జరిగినప్పుడు ఆ కుటుంబానికి భరోసా కల్పించే పథకం జీవిత బీమా. అందుకే, ఆర్థిక ప్రణాళికలో దీనికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే అనిశ్చితి పెరిగింది. అందుకే, జీవిత, ఆరోగ్య బీమా పాలసీల అవసరం మరింత పెరిగింది. దీంతోపాటు ఇప్పుడు ఇంటి రుణం ఉన్న వారు తీసుకోవాల్సిన మరో బీమా లోన్‌ కవర్‌ టర్మ్‌ పాలసీ.
కష్టకాలంలో..
గృహరుణం సాధారణంగా 20-30 ఏళ్ల పాటు కొనసాగే దీర్ఘకాలిక అప్పు. ఈ మధ్య కాలంలో రుణం తీసుకున్న వ్యక్తికి ఏదైనా జరగరానిది జరిగితే.. ఆ అప్పు చెల్లించాల్సిన బాధ్యత అతని కుటుంబ సభ్యులపై ఉంటుంది. లేదా.. ఇంటిని అమ్మేసి, రుణం తీర్చాలి. ఇలాంటి పరిస్థితులను తప్పించాలంటే.. రుణం తీసుకునే సమయంలోనే దానికి అనుబంధంగా ఒక బీమా పాలసీ తీసుకోవాలి. అది టర్మ్‌ పాలసీ లేదా హోంలోన్‌ ఇన్సూరెన్స్‌ లాంటిది కావచ్చు. రుణం తీసుకున్న కుటుంబ యజమానికి ఏదైనా జరిగినప్పుడు ఈ పాలసీ ద్వారా వచ్చిన పరిహారంతో గృహరుణాన్ని తీర్చేసేందుకు  వీలవుతుంది.
గడువు తీరేదాకా..
హోం లోన్‌ ఇన్సూరెన్స్‌ పనితీరు టర్మ్‌ పాలసీని పోలి ఉంటుంది. దీని వ్యవధి గృహరుణంతో అనుసంధానిస్తారు. అంటే.. గృహరుణం కొనసాగినన్ని రోజులు.. ఈ బీమా రక్షణ ఉంటుందన్నమాట. ఈ వ్యవధిలో రుణగ్రహీత మరణిస్తే.. పాలసీ ఆ రుణ మొత్తాన్ని చెల్లించేస్తుంది. ఈ తరహా బీమా పాలసీలు ఉన్నాయంటే.. అర్థం కష్టకాలంలో ఇంటిని బ్యాంకు స్వాధీనం చేసుకోకుండా చూసుకోవచ్చు.
 ప్రీమియం సంగతేమిటి?
టర్మ్‌ పాలసీలు తీసుకున్నప్పుడు ఏటా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కానీ.. గృహరుణ బీమా కోసం పాలసీకి ఒకేసారి ప్రీమియం తీసుకుంటారు. గృహరుణం ఇచ్చిన బ్యాంకే   పాలసీకి ప్రీమియం చెల్లించేందుకూ రుణం ఇస్తుంది. రుణగ్రహీత సొంతంగానూ పాలసీని తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
ఉదాహరణకు మీరు రూ.30లక్షల గృహరుణం తీసుకున్నారనుకుందాం.. దీనికి బీమా కోసం రూ.లక్ష వరకూ ప్రీమియం చెల్లించాలనుకుంటే.. బ్యాంకు మీకు రూ.31 లక్షల రుణం మంజూరు చేస్తుంది. దానికి అనుగుణంగా మీరు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ మీ దగ్గర కాస్త వెసులుబాటు ఉంటే.. ప్రీమియం కోసం రుణాన్ని తీసుకోకుండా..  మీ సొంత డబ్బుతోనూ పాలసీని కొనుగోలు చేయొచ్చు. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది.
రుణం కోసం బీమా తీసుకోకుండా.. ప్రత్యేకంగా సొంత టర్మ్‌ పాలసీ తీసుకొని, దానికి ఏడాదికోసారి మర్చిపోకుండా ప్రీమియం చెల్లించినా కలిసొస్తుంది.

తోడుగా మరోటి..
గృహరుణ బీమా పాలసీని ఎంచుకున్నప్పుడు చాలామంది తమకు అప్పటికే ఉన్న టర్మ్‌ ఇన్సూరెన్స్‌లాంటివి ఆపేస్తుంటారు. ఇది పొరపాటు. ఈ బీమా ద్వారా కేవలం గృహరుణానికి మాత్రమే రక్షణ ఉంటుంది. కానీ, ఇతర బాధ్యతల సంగతేమిటి? కాబట్టి, కచ్చితంగా టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ను కొనసాగించాలి. ఇప్పటికీ లేకపోతే.. కొత్తగా టర్మ్‌ పాలసీని తీసుకోవడం మంచిది. కరోనా మహమ్మారి మిగులుస్తున్న ఆర్థిక సంక్షోభంతో ఎంత రక్షణ ఉన్నా.. తక్కువే అనిపిస్తోంది. కాబట్టి, వీలైనంత ఆర్థిక రక్షణ కలిగి ఉండటం తప్పనిసరి.

రకాలున్నాయి..

గృహరుణ బీమా పాలసీల్లోనూ కొన్ని రకాలు ఉన్నాయి. రుణగ్రహీత అవసరాన్ని బట్టి.. వీటిని ఎంచుకోవచ్చు..
* రుణానికి ఈఎంఐ చెల్లిస్తుంటాం కాబట్టి, క్రమంగా అసలు మొత్తం తగ్గుతూ వస్తుంది. దీనికి అనుగుణంగానే బీమా పాలసీ విలువ సర్దుబాటు అవుతుంది. గృహరుణం అసలు బకాయి కన్నా.. ఇది బీమా మొత్తం కాస్త అధికంగానే ఉంటుంది.
* పాలసీ తీసుకున్నప్పుడు ఉన్న బీమా మొత్తం వ్యవధి పూర్తయ్యే వరకూ కొనసాగుతుంది. అంటే, రుణ మొత్తం తగ్గినా.. బీమా విలువ తగ్గదు.
* కొన్నాళ్లపాటు స్థిరంగా బీమా విలువ కొనసాగుతుంది. ఆ తర్వాత ఏటా కొంత మేరకు తగ్గుతూ వస్తుంది.
ఈ మూడింటిలో ఏది ఎంచుకోవాలన్నది రుణ గ్రహీత ఆర్థిక ప్రణాళిక, ఇతర అవసరాలను బట్టి నిర్ణయించుకోవాలి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని