Updated : 18 Jun 2021 05:44 IST

పొదుపు ఖాతా.. ఇవన్నీ తెలుసుకున్నాకే..

కరోనా మహమ్మారి తర్వాత.. దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. దేశం అంతా ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో.. డిజిటల్‌ పొదుపు ఖాతాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువత బ్యాంకు శాఖలను సంప్రదించాల్సిన అవసరం లేకుండా.. యాప్‌ల ద్వారానే ఖాతాను పొదుపు ఖాతాను ప్రారంభించేందుకు ఇష్టపడుతున్నారు. దీనికి తగ్గట్టుగా బ్యాంకులూ తమ సాంకేతికతను మార్చుకుంటున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నీ ఇప్పుడు ఈ డిజిటల్‌ ఖాతాలను అందించేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే, ఈ డిజిటల్‌ పొదుపు ఖాతాలు ప్రారంభించేటప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.
డబ్బుకు సంబంధించిన ప్రతి అంశంలోనూ పొదుపు ఖాతా కీలకమే. జమ, ఖర్చులన్నీ దీని ఆధారంగానే జరుగుతాయి. కాబట్టి, సరైన చోట ఈ ఖాతాను ప్రారంభించడం.. సరైన బ్యాంకును ఎంచుకోవడం ముందుగా చేయాల్సిన అంశాలు. బ్యాంకులను బట్టి, సాంకేతికత, అందే సేవలు మారుతూ ఉంటాయి. మన అవసరాలకు ఏ బ్యాంకు సరిపోతుంది అనేది ఇక్కడ చూసుకున్నాకే.. ముందుకెళ్లాలి.
వడ్డీ రేట్లు..: పొదుపు ఖాతాను ప్రారంభించే ముందు... ఆ ఖాతాపై  వడ్డీ ఎంత వస్తోంది అనేది పరిగణించాల్సిన తొలి అంశం. చాలామంది పొదుపు ఖాతాలోనే తమ డబ్బును నిల్వ చేస్తుంటారు. తక్కువ వడ్డీ రేటు ఉంటే.. దాని వల్ల పెద్దగా ఫలితం ఉండదు. ఇప్పుడు కొన్ని బ్యాంకులు సాధారణ పొదుపు ఖాతాపైనా గరిష్ఠ వడ్డీని అందిస్తున్నాయి. ఇలాంటి బ్యాంకులను ఎంచుకోవచ్చు. పొదుపు ఖాతా నుంచి ఫిక్స్‌డ్‌.. ఫిక్స్‌డ్‌ నుంచి పొదుపు ఖాతాకు డబ్బు మారుతూ ఉండే ఫ్లెక్సీ డిపాజిట్‌ ఖాతాలూ అందుబాటులో ఉంటాయి. మీరు ఎంచుకుంటున్న బ్యాంకు ఇలాంటి సేవలను అందిస్తుందా లేదా చూసుకోండి.
రుసుములు: చాలా బ్యాంకులు పొదుపు ఖాతాలో కనీస నిల్వ నిబంధన పెడుతున్నాయి. మీరు డిజిటల్‌ ఖాతాను ప్రారంభిస్తున్న బ్యాంకులో కనీస నిల్వ ఎంత ఉండాలని అంటోందన్నది ముందుగా తెలుసుకోండి. సగటు నిల్వ లేనప్పుడు ఛార్జీలు ఎంత మేరకు విధిస్తున్నారు.. ఇతర రుసుములు అంటే.. ఏటీఎం ఛార్జీలు, చెక్కు రిటర్నులు, ఇతర ఏటీఎంలను ఉపయోగించినప్పుడు విధించే రుసుములు  తదితరాల గురించి ముందే స్పష్టంగా అర్థం చేసుకోండి.
సాంకేతికంగా: మీరు ప్రారంభించిన డిజిటల్‌ ఖాతా పనితీరు ఎలా ఉంది.. యాప్‌ను సులభంగా వినియోగించగలుగుతున్నారా? ఏదైనా సమస్య వస్తే.. పరిష్కరించేందుకు సేవాకేంద్రం ఎలా స్పందిస్తోంది.. ఇతర సేవలు, సదుపాయాలు ఏమున్నాయిలాంటివీ తెలుసుకోండి. యూపీఐ, ఆన్‌లైన్‌ను ఉపయోగించుకునే వీలుందాలాంటివీ చూసుకోండి.
డిజిటల్‌ పొదుపు ఖాతా ప్రారంభించాక.. మీకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అనిపిస్తే.. దాన్ని రద్దు చేసుకోండి. ఉంటే ఉండనీ అన్న ధోరణి పనికిరాదు. అనవసరంగా ఛార్జీలు భరించాల్సి వస్తుంది. క్రెడిట్‌ స్కోరుపైనా దీని ప్రభావం ఉంటుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని