సొమ్ము దాచుకో... సొంతంగా చదువుకో...

గ్రాడ్యుయేషన్‌ పూర్తయింది. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగమూ వచ్చింది. ఇక ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. సొంతంగా ముందుకు సాగొచ్చు. అంతా రంగుల ప్రపంచమే అనుకుంటున్నారా..!

Published : 15 Oct 2021 03:38 IST


దాచుకోవాలనుకున్న మొత్తాన్ని పొదుపు ఖాతాలోనే ఉంచటం సరికాదు. అదే బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయటం వల్ల కొంత అదనపు వడ్డీ లభిస్తుంది. తద్వారా కేవలం పొదుపుతోనే సరిపెట్టకుండా మదుపూ చేసినట్లు అవుతుంది. ఈ లావాదేవీలను మీకు జీతం క్రెడిట్‌ అయ్యే బ్యాంకులోనే నిర్వహించండి. తద్వారా ఆ బ్యాంకుతో మీరు బంధం ఏర్పడుతుంది. భవిష్యత్తులో పై చదువుల కోసం విద్యా రుణాన్ని ఆ బ్యాంకు నుంచే తీసుకోవచ్చు. మన లావాదేవీల సమాచారం ఆ బ్యాంకర్‌ వద్ద ఉంటుంది కాబట్టి, సులువుగా అప్పు పొందే వీలుంటుంది.


గ్రాడ్యుయేషన్‌ పూర్తయింది. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగమూ వచ్చింది. ఇక ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. సొంతంగా ముందుకు సాగొచ్చు. అంతా రంగుల ప్రపంచమే అనుకుంటున్నారా..! అంతటితో ఆగిపోవద్దు. జీవితంలో పైకెదగాలంటే స్పష్టమైన ప్రణాళిక, దానికి తగిన కార్యాచరణ తప్పనిసరి. ఈ క్రమంలో నైపుణ్యాలే కీలకం. ఆ అవకాశం ఉన్నత విద్యతోనే లభిస్తుంది. డిగ్రీతోనే సరిపెట్టుకొని ఏదో ఒక మోస్తరు ఉద్యోగంలో కుదురుకుంటే... ఆ స్థాయిలోనే జీవితం గడిచిపోతుంది. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించటం కోసం కృషి చేయాలి.  విదేశాల్లో ఎంఎస్‌ లేదా ఇక్కడే మంచి పేరున్న సంస్థ/ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ/ ఎంటెక్‌, ఆ తర్వాత పీహెచ్‌డీ... వరకూ చదువుకునే అవకాశం ఉంది. తద్వారా కెరీర్‌లో అత్యున్నత స్థానానికి చేరుకోవచ్చు. అందుకు మొదటిసారి ఉద్యోగంలో చేరినప్పుడే తొలి అడుగు పడాలి. ఉన్నత చదువుల కోసం అయ్యే ఖర్చు భరించటం అందరు తల్లితండ్రులకు సాధ్యం కాదు. అందువల్ల ఉద్యోగం చేస్తూ వచ్చిన జీతంలో సాధ్యమైనంత మేరకు పొదుపు చేసి మీరు నిర్దేశించుకున్న లక్ష్య సాధనకు బాటలు వేసుకోవాలి


రోజూ ఆఫీసుకు వెళ్లి రావటానికి సరైన రవాణా సౌకర్యం లేకపోతే సొంతంగా కారు గానీ, టూ-వీలర్‌ కానీ కొనాలనిపిస్తుంది. తప్పకపోతే ఒక టూ-వీలర్‌ కొనుక్కోండి. దానికి అప్పు చేసే సమయంలో తక్కువ వడ్డీ రేటు ఎక్కడ లభిస్తుందనేది పరిశీలించండి. ఒక ఏడాది లేదా రెండేళ్ల వ్యవధిలోనే అప్పు తీరిపోయే విధంగా ఈఎంఐ నిర్ణయించుకోండి. టూ-వీలర్‌ మీ అవసరాలకు అనువైనది ఎంచుకోండి కానీ ఆకర్షణలకులోనై ఖరీదైన బండి వైపు మొగ్గుచూపితే మీ పర్సుకు అది భారమైపోతుంది.


నెల జీతంలో మీరు ఎంత మొత్తాన్ని పొదుపు చేయాలనుకుంటున్నదీ ముందుగానే నిర్ణయించుకోవాలి. ఆ సొమ్ము పక్కనబెట్టి మిగిలిన మొత్తాన్నే మీ ఖర్చులకు వాడుకోవాలి. ఖర్చులను ఆ మొత్తానికి సరిపోయే విధంగా పరిమితం చేసుకోవాలి. అంతేగానీ ఖర్చులు పెంచుకొని పొదుపు మొత్తాన్ని తగ్గించవద్దు.

మంచి ఉద్యోగం, మంచి జీతం కాబట్టి, అప్పులు ఇస్తామని, ఎంతో అధిక లిమిట్‌తో క్రెడిట్‌ కార్డు జారీ చేస్తామని... రకరకాలైన ఆఫర్లు వస్తుంటాయి. ఆ ఆకర్షణలకు లోనుకావద్దు. ఈ దశలో అప్పులు చేయటం మంచిది కాదు. క్రెడిట్‌ కార్డూ భారమే. దానిపై ఛార్జీలు, ఏదైనా ఒక వాయిదా కట్టలేకపోతే, క్రెడిట్‌ స్కోరు చెడిపోవటం... వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి అప్పులకు సాధ్యమైనంత దూరంగా ఉండటం మేలు.

బ్యాంక్‌ డిపాజిట్లతో పాటు ప్రత్యామ్నాయంగా కొంత మొత్తాన్ని మూచ్యువల్‌ ఫండ్లలో మదుపు చేసే అవకాశాలను పరిశీలించవచ్చు. ప్రతి నెలా సిప్‌ (క్రమానుగత పెట్టుబడి) పద్ధతిలో మంచి మ్యూచువల్‌ ఫండ్‌ ఈక్విటీ పథకాల్లో పెట్టుబడి పెడితే నిర్దేశించుకున్న ఆర్ధిక లక్ష్యాలను త్వరగా చేరుకోవచ్చు.

చిన్న వయసులో ఉన్నప్పుడే టర్మ్‌ పాలసీ తీసుకోవాలి. తక్కువ ప్రీమియంతో దీర్ఘకాలం పాటు బీమా లభిస్తుంది.

మూడు నెలల జీతానికి సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధిగా పెట్టుకుంటే, ఏదైనా అనుకోని ఖర్చును తట్టుకునే అవకాశం ఉంటుంది.

ఇలా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే మీరు మీ లక్ష్యాలను సాకారం చేసుకోవచ్చు. తల్లితండ్రుల మీద భారం వేయకుండా సొంతంగా ఉన్నత చదువులకు వెళ్లవచ్చు. నైపుణ్యాలు గడించి జీవితంలో ఉద్యోగంలో స్ధిరపడవచ్చు. లేదా ఒక అంకుర సంస్థ పెట్టి పైకి రావాలనే కలలను నిజం చేసుకోవచ్చు. తద్వారా ఇతరులకు ఆదర్శంగా మారవచ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని