ULIP: యులిప్‌ను రద్దు చేసుకోవచ్చా?

నేను నెలకు రూ.5,000 వరకూ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలనుకుంటున్నాను. డివిడెండ్‌, గ్రోత్‌ ఆప్షన్లలో ఏది మంచిది? దీర్ఘకాలిక దృష్టిలో డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి. వీటివల్ల మంచి రాబడికి అవకాశం ఉంటుంది. నష్టభయం ఉంటుందన్న సంగతి మర్చిపోవద్దు. డివిడెండ్‌ చెల్లింపు,

Updated : 19 Nov 2021 09:33 IST

* నేను నెలకు రూ.5,000 వరకూ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలనుకుంటున్నాను. డివిడెండ్‌, గ్రోత్‌ ఆప్షన్లలో ఏది మంచిది? 

 - సంతోశ్‌

దీర్ఘకాలిక దృష్టిలో డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి. వీటివల్ల మంచి రాబడికి అవకాశం ఉంటుంది. నష్టభయం ఉంటుందన్న సంగతి మర్చిపోవద్దు. డివిడెండ్‌ చెల్లింపు, డివిడెండ్‌ తిరిగి పెట్టుబడి, గ్రోత్‌.. ఈ మూడు ఆప్షన్లలో దేన్నైనా ఎంపిక చేసుకోవచ్చు. డివిడెండ్‌ చెల్లింపు, డివిడెండ్‌ తిరిగి పెట్టుబడి ఆప్షన్లలో డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ వర్తిస్తుంది. గ్రోత్‌ ఆప్షన్‌లో డబ్బులు వెనక్కి తీసుకున్నప్పుడే పన్ను వర్తిస్తుంది. పెట్టుబడి పెట్టి కనీసం 15 ఏళ్లపాటు కొనసాగించండి. ఆ తర్వాత క్రమానుగతంగా అవసరాన్ని బట్టి, కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. 15 ఏళ్లపాటు మీరు పెట్టుబడిని కొనసాగిస్తే.. 12 శాతం రాబడితో.. రూ.22,36,782 అయ్యేందుకు అవకాశం ఉంది.


* ఆరేళ్ల క్రితం యూనిట్‌ ఆధారిత బీమా పాలసీ తీసుకున్నాను. ఏడాదికి రూ.75,000 చెల్లిస్తున్నాను. దీనివల్ల పెద్దగా రాబడి ఏమీ రావడం లేదు. ఇప్పుడు దీన్ని రద్దు చేసుకోవచ్చా? లేదా 20 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించాల్సిందేనా?        

- రాజు

యూనిట్‌ ఆధారిత పాలసీ (యులిప్‌) తీసుకున్నప్పుడు ఎలాంటి రుసుములు, ఛార్జీలు లేకుండా అయిదేళ్ల తర్వాత డబ్బు వెనక్కి తీసుకోవచ్చు. పాలసీ తీసుకొని ఆరేళ్లు అయ్యింది అంటున్నారు కాబట్టి, దీన్ని రద్దు చేసుకోవచ్చు. ఎలాంటి ఛార్జీలూ వర్తించవు. డబ్బు అవసరం లేకపోతే.. డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి. మీ కుటుంబానికి తగిన ఆర్థిక రక్షణ కల్పించేందుకు మీ వార్షికాదాయానికి 12-15 రెట్ల వరకూ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోండి.


* ప్రైవేటు ఉద్యోగిని. పన్ను ఆదా కోసం సురక్షిత పథకాల్లో పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. నేను మరో రూ.90వేల వరకూ ఆదా చేయాల్సి ఉంది. నేను 20 శాతం పన్ను శ్లాబులో ఉన్నాను. ఏం చేయాలి? 

 - ప్రసాద్‌

పన్ను మినహాయింపు కోసం సురక్షితమైన పథకాలకు ఎంచుకోవాలనుకుంటే... వీపీఎఫ్‌ లేదా పీపీఎఫ్‌లను పరిశీలించవచ్చు. ఈ రెండూ సురక్షితమైనవే. వచ్చిన రాబడికి పన్ను వర్తించదు. పైగా మంచి వడ్డీ లభిస్తోంది. ప్రత్యామ్నాయంగా అధిక రాబడి వచ్చేలా.. ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలను (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పరిశీలించవచ్చు. దీనివల్ల అటు పన్ను మినహాయింపు, ఇటు ఈక్విటీ పెట్టుబడులు రెండూ సాధ్యం అవుతాయి. 


* మా బాబు వయసు రెండేళ్లు. ఇప్పుడు తన కోసం ఏదైనా పెట్టుబడి ప్రారంభించాలని అనుకుంటున్నాను. నెలకు రూ.15వేల వరకూ పెట్టుబడి పెడుతూ.. అవసరం ఉన్నప్పుడు వెనక్కి తీసుకునే వీలున్న పథకాలేమున్నాయి? ఎంత రాబడి వస్తుంది? 

- నవీన్‌

మీ బాబు భవిష్యత్‌ అవసరాల గురించి పెట్టుబడి పెట్టాలనుకుంటే.. విద్యా ద్రవ్యోల్బణం కన్నా అధిక రాబడి వచ్చేలా చూసుకోవాలి. దీనికి హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవచ్చు. ఇందులో 10-11 శాతం వరకూ రాబడి వచ్చేందుకు అవకాశం ఉంది. మరో 15 ఏళ్ల తర్వాత బాబు ఉన్నత చదువుల కోసం డబ్బు అవసరం ఉంటుంది. అప్పుడు డబ్బును వెనక్కి తీసుకోవచ్చు. 15 ఏళ్లపాటు 10 శాతం రాబడితో నెలకు రూ.15,000 మదుపు చేస్తే.. దాదాపు రూ.57,19,046 జమ అయ్యే వీలుంది.

- తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని