ఎండోమెంట్‌ పాలసీని రద్దు చేసుకోవచ్చా?

పదేళ్ల క్రితం ఎండోమెంట్‌ పాలసీ తీసుకున్నాను. ఇప్పుడు ఆ పాలసీని రద్దు చేసుకొని, వచ్చిన రూ.2 లక్షలను మార్కెట్‌లో మదుపు చేయాలని అనుకుంటున్నాను. ఇది మంచి ఆలోచనేనా?

Updated : 18 Mar 2022 06:34 IST

పదేళ్ల క్రితం ఎండోమెంట్‌ పాలసీ తీసుకున్నాను. ఇప్పుడు ఆ పాలసీని రద్దు చేసుకొని, వచ్చిన రూ.2 లక్షలను మార్కెట్‌లో మదుపు చేయాలని అనుకుంటున్నాను. ఇది మంచి ఆలోచనేనా?

- రవీంద్ర

* మీ ఎండోమెంట్‌ పాలసీ వ్యవధి మరో 10-15 ఏళ్లు ఉంటే ఈ పాలసీని రద్దు చేసుకోవచ్చు. వచ్చిన మొత్తాన్ని డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చు. ఒకవేళ మీ పాలసీ వచ్చే 4-5 ఏళ్ల వరకే వ్యవధి ఉంటే రద్దు చేసుకోకుండా కొనసాగించండి.


ఆదాయపు పన్ను మినహాయింపు కోసం ఒకేసారి రూ.80వేల వరకూ మదుపు చేయాలనుకుంటున్నాను. దీనికోసం ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి.

- నారాయణ

* ఆదాయపు పన్ను ప్రణాళిక ఎప్పుడూ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ఉండాలి. మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తం సురక్షితంగా ఉండాలంటే.. పోస్టాఫీసు జాతీయ పొదుపు పథకాలు (ఎన్‌ఎస్‌సీ)లను లేదా పన్ను ఆదా బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఎంచుకోవచ్చు. వీటి కాల వ్యవధి అయిదేళ్లు. కాస్త నష్టభయం ఉన్నా.. అధిక రాబడి రావాలంటే ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) ఎంచుకోవాలి. ఇందులో మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. ఏప్రిల్‌ నుంచే ఇందులో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయడం మంచిది.


జూన్‌లో పదవీ విరమణ చేయబోతున్నాను. వచ్చిన ప్రయోజనాలను మదుపు చేసి, మరో నాలుగేళ్ల తర్వాత నెలనెలా పింఛను వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో నెలకు రూ.20వేల వరకూ సిప్‌ చేస్తున్నాను. ఈ మొత్తాన్నీ ఈ ఫండ్లలోనే మదుపు చేయొచ్చా?

- కుమార్‌

* మీకు వచ్చిన పదవీ విరమణ ప్రయోజనాలను బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి. ఇందులో సాధారణ ఈక్విటీ ఫండ్లతో పోలిస్తే నష్టభయం కాస్త తక్కువగా ఉంటుంది. నాలుగేళ్ల తర్వాత మీరు ఇందులో నుంచే క్రమానుగతంగా మీకు అవసరమైన మేరకు డబ్బును వెనక్కి తీసుకోవచ్చు. లేదా అప్పటివరకూ జమైన మొత్తాన్ని తీసుకొని, పోస్టాఫీసు పెద్దల పొదుపు పథకం లేదా అప్పుడున్న పింఛను పథకాల్లో మదుపు చేయొచ్చు.


నా వయసు 23. ఇటీవలే ఉద్యోగంలో చేరాను. ఆన్‌లైన్‌లో టర్మ్‌ పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఆరోగ్య బీమా మా సంస్థ అందిస్తోంది. నా వేతనం నెలకు రూ.30వేలు. ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలి. నా ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండాలి?

-వినయ్‌

* మీపై ఆధారపడిన వారుంటే తప్పనిసరిగా వారికి ఆర్థికంగా రక్షణ కల్పించాలి. దీనికోసం మీరు కనీసం రూ.40లక్షల విలువైన టర్మ్‌ పాలసీ తీసుకోవడం మంచిది. మంచి క్లెయిం సెటిల్‌మెంట్‌ ఉన్న బీమా సంస్థను ఎంచుకోండి. కంపెనీ ఇచ్చే బృంద ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ సొంత పాలసీ ఉండటం ఎప్పుడూ మేలే. వ్యక్తిగత ప్రమాద, వైకల్య బీమా పాలసీలను తీసుకోవాలి. కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధిగా జమ చేసుకోండి. నెలనెలా సిప్‌ చేసేందుకు డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లను ఎంచుకోండి.


- తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని