Buy Now Pay Later: ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి

కొవిడ్‌-19 పరిణామాలతో ఎన్నో మార్పులను చూస్తున్నాం. వినియోగదారులు ఖర్చు పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఎలాంటి వడ్డీ భారం లేకుండా లేదా తక్కువ వడ్డీతో కొనుగోలు చేసేందుకు వీలుంటుందా అని గమనిస్తున్నారు.

Updated : 26 Oct 2021 13:06 IST

కొవిడ్‌-19 పరిణామాలతో ఎన్నో మార్పులను చూస్తున్నాం. వినియోగదారులు ఖర్చు పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఎలాంటి వడ్డీ భారం లేకుండా లేదా తక్కువ వడ్డీతో కొనుగోలు చేసేందుకు వీలుంటుందా అని గమనిస్తున్నారు. నిత్యావసర వస్తువులనూ  ఆన్‌లైన్‌లో కొంటున్న ఈ రోజుల్లో బిల్లుల చెల్లింపులకూ కాస్త వ్యవధి ఉన్న వాటివైపే     మొగ్గు చూపిస్తున్నారు. ఇవన్నీ కొత్త ఆవిష్కరణలకు కారణం అవుతున్నాయి. ‘ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి’ (బై నౌ పే లేటర్‌ - బీఎన్‌పీఎల్‌)లాంటి వాటికి ఆదరణ పెరిగింది. మరి ఈ బీఎన్‌పీఎల్‌ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా...

పండగల వేళ.. ఏదో ఒకటి కొనుగోలు చేయడం సాధారణంగా జరిగేదే. చేతిలో డబ్బులు లేకపోయినా.. క్రెడిట్‌ కార్డులు లేదా రుణాల్లాంటివి తీసుకొని కొంటారు చాలామంది. ఇప్పుడు కొత్తగా మరో విధానమూ వచ్చింది. అదే ‘బై నౌ పే లేటర్‌’.  కరోనా పరిస్థితుల తర్వాత ఒక్కసారిగా ఇది వెలుగులోకి వచ్చింది.

ఏమిటీ బీఎన్‌పీఎల్‌

కొన్ని వస్తువులను కొనుగోలు చేసినప్పుడు ఆ బిల్లును వెంటనే చెల్లించకుండా.. కొన్నాళ్ల తర్వాత ఒకేసారి లేదా వాయిదాల రూపంలో చెల్లించేందుకు వీలు కల్పించే విధానమే ఈ బీఎన్‌పీఎల్‌. ఈ వ్యవధిలో సున్నా శాతం లేదా స్వల్ప వడ్డీని ఈ బీఎన్‌పీఎల్‌ సంస్థలు వసూలు చేస్తాయి. చిన్న మొత్తంలో రుణం కావాలని అనుకున్నప్పుడు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. రూ.2,000 నుంచి రూ.లక్ష వరకూ ఈ తరహా రుణాలు అందుబాటులో ఉంటాయి. బిల్లు మొత్తం చెల్లించేందుకు 14 రోజుల నుంచి 30 రోజుల వ్యవధి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 90 రోజుల సమయమూ ఉంటుంది. నిర్ణీత వ్యవధి దాటితే మాత్రం రుసుముల మోత తప్పదు.

ఎన్నో ఫిన్‌టెక్‌ అంకురాలు ఇప్పుడు ఈ బీఎన్‌పీఎల్‌ సేవలను అందిస్తున్నాయి. అంతేకాదు.. ఇప్పుడు బ్యాంకులూ ఈ  విభాగంలోకి ప్రవేశించాయి. ఇ-కామర్స్‌  వెబ్‌సైట్లూ.. కొన్ని సంస్థలతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.

ఎంపికలో జాగ్రత్తగా..

ప్రస్తుతం ఎన్నో బీఎన్‌పీఎల్‌ సంస్థలు వినియోగదారులను  ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే, వీటిలో ఏది మన అవసరాలకు సరిపోతుందనేది చూసి, ఎంచుకోవాలి.

రుణ పరిమితి: సాధారణంగా రూ.2వేల నుంచి రూ.25 వేల వరకూ ఎక్కువ బీఎన్‌పీఎల్‌ సంస్థలు రుణాన్ని   అందిస్తున్నాయి. పలు బ్యాంకులూ రూ.20వేల వరకూ  ఈ వెసులుబాటును కల్పిస్తున్నాయి. మంచి క్రెడిట్‌ స్కోరు ఉన్న వారికి రూ.60,000, రూ.లక్ష పరిమితితోనూ ఈ రుణాలు లభిస్తున్నాయి. మీ అవసరాలకు సరిపోయే విధంగా రుణం ఇచ్చే సంస్థ ఏదన్నది చూసుకొని, దాన్ని ఎంచుకోండి.

నెట్‌వర్క్‌ ఎలా ఉంది?: మీరు ఎప్పుడూ కొనుగోళ్లు చేసే రిటైల్‌ స్టోరు లేదా ఇ-కామర్స్‌ సంస్థలో బీఎన్‌పీఎల్‌ అంగీకరిస్తున్నారా.. ఉంటే.. ఏ సంస్థలవి అనేది తెలుసుకోండి.

రుసుములు: బాకీని ఆలస్యంగా చెల్లించినప్పుడు నిబంధనల మేరకు అపరాధ రుసుములు తప్పవు. వీలైనంత వరకూ తక్కువ రుసుములు, వడ్డీ ఉండే సంస్థను ఎంచుకోండి.

నమ్మకం ఉండాలి: ఎప్పటికప్పుడు కొత్త సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. అన్నింటినీ నమ్మలేం. ఇప్పటికే మార్కెట్లో నిలదొక్కుకున్నవీ, పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న వాటిని పరిశీలించాలి.

సమయానికి డబ్బు అందుబాటులో లేనప్పుడు.. ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి వెసులుబాటును వినియోగించుకోవచ్చు. సులభంగా కొనొచ్చు... అంటే.. అర్థం మనకు అవసరం లేని వాటినీ కొనాలని కాదు. విచక్షణతో కొనుగోళ్లు చేయడం మర్చిపోవద్దు. లేకపోతే.. ఈ వెసులుబాటు వల్ల మీపై అనవసర ఆర్థిక ఒత్తిడి ఏర్పడుతుంది. క్రెడిట్‌ స్కోరూ దెబ్బతింటుంది. అందుకే, ఆర్థిక క్రమశిక్షణతో ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడమే శ్రేయస్కరం.


లాభమేమిటి?

వేగంగా...: వినియోగదారులు ఏదైనా కొనాలని అనుకున్నప్పుడు బీఎన్‌పీఎల్‌ సంస్థలు వారికి ఆర్థిక తోడ్పాటునందిస్తాయి. ఆదాయ ధ్రువీకరణకు సంబంధించి అనేక పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. కొన్ని క్షణాల్లోనే అవసరమైన మొత్తాన్ని అందిస్తాయి. అందువల్ల వేగంగా కొనుగోళ్లు చేసుకోవచ్చు.

వీలునుబట్టి: బీఎన్‌పీఎల్‌ సంస్థలు తమ వినియోగదారులకు అందించిన రుణం ఒకేసారి వాడుకోవాలనే నిబంధన విధించవు. అవసరాన్ని బట్టి, వాడుకొని, జీతం రాగానే ఒకేసారి చెల్లించే ఏర్పాటు చేసుకోవచ్చు. ఏదైనా కొనాలని అనుకొని, నగదుకు ఇబ్బంది పడుతున్నప్పుడు ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయి.

వడ్డీ లేకుండా: నిర్ణీత సమయంలో బాకీని చెల్లిస్తే ఎలాంటి వడ్డీ విధించడం లేదు చాలా బీఎన్‌పీఎల్‌ సంస్థలు. కానీ, ఆలస్యం చేస్తే మాత్రం అపరాధ రుసుము తప్పదు. కొన్ని సంస్థలు బాకీని ఈఎంఐలో చెల్లించే వీలు కల్పిస్తున్నాయి. ఇలాంటప్పుడు మాత్రం వడ్డీని వసూలు చేస్తున్నాయి. అయితే, వ్యవధి లోపు రుణం తీర్చేయడమే ఎప్పుడూ మంచిదని గుర్తు పెట్టుకోండి.

క్రెడిట్‌ కార్డులు లేని వారికి:  అందరికీ క్రెడిట్‌ కార్డులు ఉండకపోవచ్చు. ఇలాంటి వారికి స్వల్ప మొత్తంలో రుణం కావాలి అనుకున్నప్పుడు బీఎన్‌పీఎల్‌ సంస్థలను ఆశ్రయించవచ్చు. క్రెడిట్‌ కార్డులతో పోలిస్తే.. బీఎన్‌పీఎల్‌ సంస్థలు వేగంగా రుణాలనిస్తాయి.

నగదు వెనక్కి.. రాయితీలు: బీఎన్‌పీఎల్‌ రుణాలను ఇస్తున్న సంస్థలు తమ విస్తరణ కోసం వ్యాపార సంస్థలు, ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. వినియోగదారులకు నగదు వెనక్కి, ప్రత్యేక రాయితీలు అందించడంలాంటివీ అందిస్తున్నాయి. దీంతో కొనుగోలు చేయాలనుకునే వారికి ఎన్నో వెసులుబాట్లు లభిస్తున్నాయి.

- అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌.కామ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని