బ్యాంకు...మీ ఇంటి వద్దకే...

మారుతున్న పరిస్థితుల్లో కిరాణా సామగ్రి మొదలు.. ఖరీదైన ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల వరకూ గుమ్మం వద్దకే వచ్చి అందిస్తోన్న జీవన శైలి అలవాటయ్యింది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌తో.. బ్యాంకు చేతిలో ఉన్నట్లుగా మారిపోయినా.. కొన్ని తప్పనిసరి సందర్భాల్లో బ్యాంకు శాఖకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు ఆ ఇబ్బందీ లేకుండా

Published : 12 Feb 2021 01:53 IST

మారుతున్న పరిస్థితుల్లో కిరాణా సామగ్రి మొదలు.. ఖరీదైన ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల వరకూ గుమ్మం వద్దకే వచ్చి అందిస్తోన్న జీవన శైలి అలవాటయ్యింది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌తో.. బ్యాంకు చేతిలో ఉన్నట్లుగా మారిపోయినా.. కొన్ని తప్పనిసరి సందర్భాల్లో బ్యాంకు శాఖకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు ఆ ఇబ్బందీ లేకుండా.. ఇంటి వద్దకే బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంతవరకూ కొంతమంది ప్రైవేటు బ్యాంకు ఖాతాదారులకే ఇంటి వద్ద బ్యాంకింగ్‌ సేవలు లభించేవి. ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులూ ఇలాంటి సేవలను ప్రారంభించడంతో సామాన్య ఖాతాదారులకూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ఎలాంటి సేవలంటే..
కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన ‘ఈజ్‌’ సంస్కరణల ఫలితంగా ఇంటి వద్దకే బ్యాంకింగ్‌ సేవలను అందించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. అత్యాటి టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఇంటెగ్రా మైక్రో సిస్టమ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌లకు చెందిన డోర్‌ స్టెప్‌ బ్యాంకింగ్‌ (డీఎస్‌బీ) ఏజెంట్ల సహాయంతో ఆర్థిక, ఆర్థికేతర బ్యాంకింగ్‌ సేవలను అందించడం ప్రారంభించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు ఖాతాదారులు కాల్‌సెంటర్‌, వెబ్‌ పోర్టల్‌, మొబైల్‌ ద్వారా అభ్యర్థిస్తే వారి ఇంటి వద్దనే బ్యాంకు సేవలను పొందవచ్చు. మొదట దేశంలోని 100 పట్టణాల్లో ప్రారంభించిన ఈ సేవలు త్వరలో అన్ని పట్టణాల్లోనూ పొందే అవకాశం ఉంది. డీఎస్‌బీ వల్ల నగదును జమ చేయడం, నగదు ఉపసంహరణ, చెక్కు డిపాజిట్‌, డిమాండ్‌ డ్రాఫ్ట్‌ చేయడం వంటి సాధారణ బ్యాంకింగ్‌ కార్యకలాపాల కోసం బ్యాంకు శాఖను సంప్రదించాల్సిన అవసరం లేదు. మీకు సహాయం చేసేందుకు బ్యాంకు నియమించిన సిబ్బందితో మీ ఇంటి వద్దే బ్యాంకింగ్‌ సౌకర్యాలు లభిస్తాయి.
డీఎస్‌బీ పథకంలో ఆర్థికేతర లావాదేవీలతో పాటు.. నగదు జమ/ఉపసంహరణ వంటి ఆర్థిక లావాదేవీలూ నిర్వహించుకోవచ్చు. ఈ సేవలను మైనర్లకు, ఉమ్మడి ఖాతాదారులకు తప్ప కేవైసీ పూర్తి చేసిన ఖాతాదారులందరూ పొందవచ్చు.

* చెక్కు/డ్రాఫ్ట్‌/పే ఆర్డర్‌లాంటివి తీసుకెళ్లడం/అందించడం,  కొత్త చెక్కు పుస్తకం అభ్యర్థన, 15జీ/15హెచ్‌ ఫారాలు, ఆదాయపు పన్ను/జీఎస్‌టీ చలాన్లను తీసుకెళ్లడం, ఈసీఎస్‌ అభ్యర్థన, ఖాతా వివరాలు, టర్మ్‌ డిపాజిట్‌ రశీదు, టీడీఎస్‌/ఫారం డెలివరీ 16 సర్టిఫికెట్‌ అభ్యర్థన, గిఫ్ట్‌ కార్డ్‌ అందించడంలాంటి సేవలను పొందేందుకు వీలుంది.
* ఖాతాదారులు ప్రతి లావాదేవీకి రూ.75 సేవా రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

నగదు లావాదేవీలూ..
నగదు ఉపసంహరణ సదుపాయాన్ని పొందేందుకు ఖాతాదారు బ్యాంకు ఖాతాను ఆధార్‌ లేదా డెబిట్‌ కార్డుతో అనుసంధానించాలి. నగదు ఉపసంహరణ సేవను బుక్‌ చేసుకున్నప్పుడు మైక్రో ఏటీఎం ఆధారిత సురక్షిత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలను అందించేందుకు డీఎస్‌బీ ఏజెంటు ఖాతాదారుడి ఇంటికి వచ్చి, నగదు చెల్లిస్తారు. లావాదేవీ పరిమితిని కనిష్ఠంగా రూ.1,000, గరిష్ఠంగా రూ.10,000లుగా ఉంది. నగదు జమ అవకాశం ప్రస్తుతానికి అందుబాటులో లేకపోయినప్పటికీ.. త్వరలోనే ఈ సేవలు ప్రారంభించే అవకాశం ఉంది.
* పెన్షనర్లు లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పణనూ డోర్‌ స్టెప్‌ బ్యాకింగ్‌ ద్వారా చేయొచ్చు. జీవన్‌ ప్రమాణ్‌ యాప్‌ ఉపయోగించి, ఆన్‌లైన్‌ ద్వారా డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించే సదుపాయం ఉంది.

 

సేవలు ఎలా?
వినియోగదారుల సేవా కేంద్రాన్ని 18001037188; 180012113721 నెంబర్లలో సంప్రదించవచ్చు.  డోర్‌ స్టెప్‌ బ్యాంకింగ్‌ (డీఎస్‌బీ) మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ప్రభుత్వ బ్యాంకుల ఖాతాదారులు వారి ఇంటి వద్దనే బ్యాంకింగ్‌ సేవలను పొందవచ్చు. వీటి ద్వారా వినియోగదారులు తమ అభ్యర్థనలను ఏ దశలో ఉన్నాయన్నదీ తెలుసుకోవచ్చు.
* దాదాపు అన్ని ప్రభుత్వ బ్యాంకులూ ఈ సేవలను అందిస్తున్నాయి.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, యుకో బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులలో ఖాతా ఉన్న ఖాతాదారులు వీటిని పొందవచ్చు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 70 ఏళ్ల వయసు దాటిన సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులకు దేశవ్యాప్తంగా డీఎస్‌బీ సేవలను ప్రారంభించింది. కేవైసీ పూర్తి చేసిన ఖాతాలకు, హోమ్‌ బ్రాంచీ నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఖాతాదారులు ఈ సేవలను పొందే అవకాశం ఉంది.

 

- ఫణి శ్రీనివాసు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని