ఫ్లాట్ వడ్డీ రేటు అంటే ఏంటి? రుణాల‌పై దీని ప్ర‌భావం ఎంత‌?

బ్యాంకులు, రుణాలందించే ఆర్థిక సంస్థ‌లు వినియోగ‌దారుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి వివిధ రకాలైన రుణాలను అందిస్తారు.గృహ , వాహన , వ్యక్తిగత రుణం, విద్యా రుణం, ఆస్తి, బంగారం రుణం వంటి రుణాల‌ను తీసుకునేందు చాలా మంది ఆస‌క్తి చూపుతుంటారు. ఈ రుణాల‌కు అన్నింటికి ఒకే వ‌డ్డీ రేటు ఉండ‌దు. వేరు వేరు రుణాల‌కు వేరు వేరు వ‌డ్డీరేట్లు

Published : 23 Dec 2020 11:43 IST

బ్యాంకులు, రుణాలందించే ఆర్థిక సంస్థ‌లు వినియోగ‌దారుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి వివిధ రకాలైన రుణాలను అందిస్తారు.గృహ , వాహన , వ్యక్తిగత రుణం, విద్యా రుణం, ఆస్తి, బంగారం రుణం వంటి రుణాల‌ను తీసుకునేందు చాలా మంది ఆస‌క్తి చూపుతుంటారు. ఈ రుణాల‌కు అన్నింటికి ఒకే వ‌డ్డీ రేటు ఉండ‌దు. వేరు వేరు రుణాల‌కు వేరు వేరు వ‌డ్డీరేట్లు, కాల‌ప‌రిమితులు ఉంటాయి. మీరు రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునేప్పుడు, అనేక సంద‌ర్బాల్లో బ్యాంకు ఉద్యోగులు, ఏజెంట్‌లు రుణాల‌ను మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా చూపించేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. అందులోని నిబంధ‌న‌లు, ష‌ర‌తుల గురించి మీకు పూర్తిగా తెలియ‌క‌ చాలా మంది స్థిర‌ వ‌డ్డీ రేటు గురించి తెలియ‌క నెలవారీ చెల్లింపుల్లో చిక్కుకు పోతారు. రుణం తీసుకునేప్పుడు స్థిర వ‌డ్డీ (ఫ్లాట్ వ‌డ్డీ రేటు) రేట్ల‌ను చూపినా, వాస్త‌వంగా ఈఎమ్ఐ లెక్కించేప్పుడు మాత్రం అస‌లు వ‌డ్డీ (ఎఫెక్టివ్ వ‌డ్డీ ) రేటు వ‌ర్తిస్తుంది . ప్ర‌స్తుతం చాలా ఆర్థిక సంస్థ‌లు రుణాలు తీసుకునే వారిని ఆక‌ట్టుకునేందుకు రుణంపై వ‌ర్తించే వ‌డ్డీ రేటు (ఎఫెక్టీవ్ రేటు) కు బ‌దులుగా స్థిర వ‌డ్డీ రేటును ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఎఫెక్టీవ్ వ‌డ్డీ రేటు (ఈఐఆర్) దాని సంబంధిత స్థిర వ‌డ్డీ రేటు కంటే అధికంగా ఉంటుంది.

ఫ్లాట్ వడ్డీ రేటు రుణాలపై రుణ‌గ్ర‌హీత‌లు నెల‌వారీ చెల్లించే ఈఎమ్ఐని మిన‌హాయించ‌కుండా అస‌లు మొత్తంపై వ‌డ్డీరేటు వ‌ర్తింప‌చేస్తారు. రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేటు అంటే రుణ‌గ్ర‌హీత‌లు తీసుకున్న రుణం మొత్తంలో చెల్లించే మొత్తాన్ని మిన‌హాయించి మిగిలిన మొత్తంపై వ‌డ్డీరేటు వ‌ర్తింప‌చేస్తారు. దీంతో మొత్తం రుణ‌కాల‌ప‌రిమితి ముగిసే స‌రికి వినియోగ‌దారుడు చెల్లించే వ‌డ్డీ మొత్తం త‌గ్గుతుంది. రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేటు స్థిర‌ వ‌డ్డీ రేటు కంటే క‌నీసం 6 నుంచి 8 శాతం అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల రుణ‌దాతలు అతి త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌ను చూపిస్తుంటే అది స్థిర‌ వ‌డ్డీ రేటు కావొచ్చు. కాబ‌ట్టి ఒక‌సారి త‌న‌ఖీ చేసుకుని రుణం తీసుకోవాలి.

ఉదాహ‌ర‌ణ‌కు పీ2పీ (పీర్ టూ పీర్ లెండింగ్) విధానంలో, వ్య‌క్తిగ‌త రుణాల‌ను త‌క్కువ వ‌డ్డీకి ఆఫ‌ర్ చేస్తుంటారు. ఫ్లాట్ వ‌డ్డీ 8 నుంచి 12 శాతం వ‌ర‌కు ఉంటుంద‌ని చెబుతుంటారు. అయితే ఇక్క‌డ వినియోగ‌దారులుది చెల్లించిన ఈఎమ్ఐ ల‌ను మిన‌హాయించ‌కుండా మొత్తం కాల‌ప‌రిమితికి రుణం మొత్తంపై వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. వ్య‌క్తిగ‌త రుణం తీసుకునేప్పుడు ఉండే రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేటు లేదా ఎఫెక్టివ్ వ‌డ్డీరేటు 11 నుంచి 11.5 శాతం కంటే ఫ్లాట్ వ‌డ్డీరేటు 9 శాతం ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించినా ఇందులో ఎక్కువ వ‌డ్డీ చెల్లించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఫ్లాట్ వడ్డీ రేటు 9 శాతంగా చూపించే రెండు సంవ‌త్స‌రాల వ్య‌క్తి గ‌త రుణం పై మీరు చెల్లించే అస‌లు వ‌డ్డీ రేటు 16.5 శాతంగా ఉంటుంది. అందువ‌ల్ల మీరు రుణం తీసుకునేప్పుడు చూపించే త‌క్కువ‌ స్థిర వ‌డ్డీ రేటు చివ‌రికి అధిక వ‌డ్డీ రేటుగా మారుతుంది.

ఫ్లాట్ వడ్డీ రేటు రుణ ఫ‌థ‌కాలు ప్రారంభంలో మైక్రో ఫైనాన్స్ రంగంలో బాగా ప్రాచుర్యం చెందాయి. అయితే రెగ్యులేట‌ర్ నుంచి ప్ర‌తికూల‌తలు ఎదురుకావ‌డంతో వీటిని త‌గ్గించారు. అయితే ఇప్ప‌టికీ వ్య‌క్తిగ‌త రుణాలు, వినియోగ‌వ‌స్తువుల రుణం, వంటి వాటిలో ఇప్ప‌టికి ఈ విధానం కొన‌సాగుతోంద‌ని రుణగ్రహీతలు అటువంటి రుణాల మీద వ‌ర్తించే అస‌లు వ‌డ్డీ రేటును అర్థం చేసుకుని నిర్ణ‌యం తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.

ఫ్లాట్ వ‌డ్డీ రేట్ల వ‌ద్ద రుణం కాల‌ప‌రిమితి అంత‌టా, అస‌లు మొత్తంపై వ‌డ్డీని వ‌సూలు చేయడం వ‌ల్ల కాల‌క్ర‌మేణా రుణ భారం ఎక్కువ‌య్యే అవ‌కాశం ఉంది. దీనిని రుణ ద‌ర‌ఖాస్తుదారులు గుర్తించ‌డంలేద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. చాలా మంది రుణ‌గ్ర‌హీత‌లు తక్కువ ఫ్లాట్ వ‌డ్డీ రేట్ల‌తో డబ్బును ఆదా చేస్తున్నామ‌ని అనుకుంటారు. కానీ దీర్ఘకాలంలో, రెడ్యూసింగ్ వ‌డ్డీ రేటుతో పోలిస్తే అధికంగా చెల్లిస్తుంటార‌ని నిపుణ‌లు పేర్కొంటున్నారు

ఉదాహ‌ర‌ణ‌కి ఒక వ్య‌క్తి రుణం రూ. 1 ల‌క్ష, 10 శాతం ఫ్లాట్ వ‌డ్డీ రేటుతో 36 నెల‌ల కాల‌ప‌రిమితి తీసుకుంటే, అత‌ను వ‌డ్డీ నిమిత్తం చెల్లించే మొత్తం రూ.30 వేలు, అదే రుణం 15 శాతం రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేటు త‌గ్గింపుతో తీసుకుంటే చెల్లించే వ‌డ్డీ రూ.24,765 మాత్ర‌మే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని