Life Insurance: ఆరోగ్య బీమా.. ఒకటికి మించి పాలసీలుంటే...

వైద్య చికిత్స ఖర్చు పెరుగుతున్న నేపథ్యంలో ఒకటికి మించి ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవడం ఇప్పుడు సాధారణ విషయమే. యాజమాన్యాలు అందించే బృంద బీమాతో పాటు వ్యక్తిగతంగానూ పాలసీలూ ఉంటున్నాయి. ఇవే కాకుండా..

Updated : 31 Dec 2021 10:13 IST

వైద్య చికిత్స ఖర్చు పెరుగుతున్న నేపథ్యంలో ఒకటికి మించి ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవడం ఇప్పుడు సాధారణ విషయమే. యాజమాన్యాలు అందించే బృంద బీమాతో పాటు వ్యక్తిగతంగానూ పాలసీలూ ఉంటున్నాయి. ఇవే కాకుండా.. క్రిటికల్‌ ఇల్‌నెస్‌, టాపప్‌ ప్లాన్లు ఇలా రకరకాలూ తీసుకుంటున్నారు. మరి, క్లెయిం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏ పాలసీలను ఉపయోగించుకోవాలి?

చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినప్పుడు అయిన వాస్తవ ఖర్చును చెల్లించే పాలసీలు ఇండెమ్నిటీ పాలసీలు. ఇవి కాకుండా.. ఒక వ్యాధి సోకినప్పుడు కచ్చితంగా ఇంత మొత్తం చెల్లించేవి ఫిక్స్‌డ్‌ బెనిఫిట్‌ పాలసీలు. ఇండెమ్నిటీ పాలసీలు వ్యక్తిగతంగానూ, ఫ్యామిలీ ఫ్లోటర్‌, బృంద బీమాలో భాగంగానూ ఉంటాయి. ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం.. ఒక వ్యక్తికి రూ.3లక్షల విలువైన రెండు పాలసీలు ఉన్నాయనుకుందాం. అతను ఆసుపత్రిలో చేరినప్పుడు రూ.4లక్షల బిల్లు అయ్యింది. ఇప్పుడు ఒక పాలసీ నుంచి రూ.3లక్షలు, మరో పాలసీ నుంచి రూ.లక్ష క్లెయిం చేసుకోవచ్చు. అంతేకానీ, రెండు పాలసీల నుంచీ రూ.3లక్షల చొప్పున క్లెయిం చేసుకునేందుకు వీలుండదు. ఒకవేళ రూ.3 లక్షలు, రూ.4లక్షల పాలసీలు ఉంటే.. అప్పుడు రూ.4లక్షల పాలసీనే వాడుకోవచ్చు.

ఇండెమ్నిటీ.. ఫిక్స్‌డ్‌.. ఏది మేలు...

వైద్యానికి అయిన ఖర్చుతో నిమిత్తం లేకుండా.. నిర్ణీత మొత్తం అందించే ఫిక్స్‌డ్‌ పాలసీలు కొన్నిసార్లు అనుకూలంగా ఉంటాయి. క్యాన్సర్‌ కేర్‌, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్‌, కొవిడ్‌ రక్షక్‌ పాలసీలు వీటికి ఉదాహరణ. వ్యాధిని గుర్తించగానే పాలసీ విలువ మేరకు ఇవి పరిహారం ఇస్తాయి. కాబట్టి, ఒక ప్రత్యేక వ్యాధి సోకినప్పుడు దానికోసమే ప్రత్యేకంగా తీసుకున్న పాలసీని వాడుకోవచ్చు. అలా కాకుండా.. సాధారణ వైద్య చికిత్సలు, శస్త్రచికిత్సలకు సంబంధించి ఖర్చు కోసం ఇండెమ్నిటీ పాలసీలే ఉపయోగపడతాయి. కాబట్టి, పాలసీల్లో దేన్ని ఎంచుకోవాలో వ్యాధులను బట్టి నిర్ణయించుకోవాలి.

బృంద పాలసీకే ప్రాధాన్యం..

ఉద్యోగులకు యాజమాన్యం అందించే బృంద బీమా పాలసీ ఉంటుంది. అదే సమయంలో వ్యక్తిగత పాలసీలూ ఉంటాయి. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినప్పుడు.. ముందుగా కార్పొరేట్‌ పాలసీని ఉపయోగించుకోవచ్చు. కొన్నిసార్లు వీటిల్లో వ్యక్తిగత పాలసీలకు మించి ప్రయోజనాలుంటాయి. అంతేకాకుండా.. వ్యక్తిగత పాలసీలకు నో క్లెయిం బోనస్‌ కోల్పోకుండా ఉంటాం.

వ్యక్తిగతం.. ఫ్యామిలీ ఫ్లోటర్‌..

వ్యక్తిగత పాలసీతోపాటు.. కుటుంబానికి అంతటికీ కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్‌ ఉన్నప్పుడు.. తొలుత వ్యక్తిగత పాలసీతోనే క్లెయిం చేసుకోవాలి. దీనివల్ల ఫ్యామిలీ ఫ్లోటర్‌ విలువ తగ్గకుండా ఉంటుంది. కుటుంబ సభ్యులకు అవసరమైనప్పుడు వైద్య బిల్లులకు ఇబ్బంది పడక్కర్లేదు. వీటితోపాటు బీమా పాలసీ విలువ, క్లెయిం మొత్తాలను బట్టి, ఏ పాలసీ ఆ సమయానికి బాగుంటుందన్నదీ పరిశీలించాలి. ముఖ్యంగా ముందస్తు వ్యాధులు, సహ- చెల్లింపులాంటి నిబంధనలు చూసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని