Coal India: కోల్‌ ఇండియాలో వాటా అమ్మే యోచనలో కేంద్రం?

కోల్‌ ఇండియా సహా మొత్తం ఐదు కంపెనీల్లో వాటాలు విక్రయించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఒక్కో దాంట్లో దాదాపు 5-10శాతం వాటాలను విక్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం.  

Published : 25 Nov 2022 16:15 IST

దిల్లీ: కోల్‌ ఇండియా, హిందూస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌, రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌లో 5-10 శాతం వాటాలను విక్రయించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఆఫర్-ఫర్‌-సేల్‌ ద్వారా వాటాలను విక్రయించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది. మొత్తం ఐదు కంపెనీల్లో వాటాలని అమ్మాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంట్లో రైల్వేశాఖ ఆధ్వర్యంలోని ఓ నమోదిత సంస్థ కూడా ఉందని సమాచారం.

ఈ కంపెనీల ప్రస్తుత షేరు ధరను పరిగణనలోకి తీసుకుంటే కనిష్ఠ ఆఫర్‌ ధర వద్ద కంపెనీకి రూ.16,500 కోట్లు సమకూరే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోందట. ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వానికి దిగుమతుల ఖర్చు, రాయితీల భారం పెరిగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా సమీకరించే నిధులతో ప్రభుత్వం వాటిని సర్దుబాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం ఈ ఏడాది రూ.65 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. కానీ, ఇప్పటి వరకు ఎల్‌ఐసీ ఐపీఓ ద్వారా రూ.26,500 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా తాజా వాటాల విక్రయం ఉపయోగపడనుంది. 

వాటాల విక్రయంపై ఇన్వెస్టర్ల ఆసక్తిని తెలుసుకోవడానికి ప్రభుత్వం ఇప్పటికే రోడ్‌షోలను కూడా ప్రారంభించినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఈ ఏడాది కోల్‌ ఇండియా షేరు ధర 48 శాతం, రాష్ట్రీయ కెమికల్స్‌ 55 శాతం పెరిగాయి. హిందూస్థాన్‌ జింక్‌ షేరు మాత్రం 7 శాతం నష్టపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని