GST collections: ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లలో 18% వృద్ధి

ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.33 లక్షల కోట్లుగా నమోదయ్యాయి....

Updated : 01 Mar 2022 19:26 IST

 

దిల్లీ: ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు (GST collections) రూ.1.33 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 18 శాతం వృద్ధి రికార్డయ్యింది. అయితే, గత నెలలో నమోదైన రూ.1.40 లక్షల కోట్లతో పోలిస్తే మాత్రం తగ్గాయి. ఒమిక్రాన్ వ్యాప్తే దీనికి కారణమని ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

తాజా రూ.1.33 లక్షల కోట్ల వసూళ్లలో కేంద్ర జీఎస్టీ (CGST) రూ.24,435 కోట్లు కాగా.. రాష్ట్రాల జీఎస్టీ (SGST) రూ.30,779 కోట్లు. సమ్మిళిత జీఎస్టీ (IGST) కింద రూ.67,471 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.33,837 కోట్లతో కలిపి), సెస్‌ రూపంలో రూ.10,340 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.638 కోట్లతో కలిపి) వసూలైనట్లు ఆర్థికశాఖ తెలిపింది.

గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ సారి జీఎస్టీ వసూళ్లు 18 శాతం, 2020లో ఇదే నెలతో పోలిస్తే 26 శాతం పెరిగాయి. 2021 ఏప్రిల్‌ నెలలో వసూళ్లు జీవనకాల గరిష్ఠాన్ని తాకాయి. ఆ నెల రూ.1.41లక్షల కోట్లు వసూలయ్యాయి. ఫిబ్రవరిలో 28 రోజులే ఉంటాయి కాబట్టి.. జనవరితో పోలిస్తే వసూళ్లు తగ్గుతాయని కేంద్ర ఆర్థిక శాఖ గుర్తుచేసింది. అలాగే ఒమిక్రాన్‌ వ్యాప్తి కారణంగా విధించిన పాక్షిక లాక్‌డౌన్‌లు, వారాంతపు, రాత్రిపూట కర్ఫ్యూలు వంటి పరిణామాలు కూడా వసూళ్లపై ప్రభావం చూపినట్లు తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని