Emergency Fund: అత్య‌వ‌స‌ర నిధి ఎంత అవ‌స‌రం? తెలుసుకునేదెలా?

ప్ర‌తీ ఒక్క‌రి ఆర్థిక ప్ర‌ణాళిక‌లో అత్య‌వ‌స‌ర నిధి త‌ప్ప‌నిస‌రిగా భాగం కావాలి. 

Updated : 31 Mar 2022 15:46 IST

జీవన ప్ర‌యాణంలో ఒడిదొడుకులు స‌హ‌జం. ఈరోజు ఉద్యోగంలో ఉన్నాం. ప్ర‌తి నెలా జీతం వ‌స్తుంది. ఈరోజు కోసం మాత్ర‌మే కాదు. భ‌విష్య‌త్తు కోస‌మూ ఆలోచించాలి. అన్ని రోజులు ఒకేలా ఉండ‌వు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు ఎప్పుడైనా రావ‌చ్చు. వాటిని ఎదుర్కొనేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. ఇందులో భాగ‌మే అత్య‌వ‌స‌ర నిధి ఏర్పాటు. ప్ర‌తీ ఒక్క‌రి ఆర్థిక ప్ర‌ణాళిక‌లో త‌ప్ప‌నిస‌రిగా భాగం కావాలి. 

ఎంత మొత్తం అవ‌స‌రం..

అత్య‌వ‌స‌ర నిధి.. ఎంత మొత్తం అవ‌స‌ర‌మో నిర్ణ‌యించుకునేందుకు రెండు విధానాలు ఉన్నాయి.  మొద‌టిది ఆదాయం, ఖ‌ర్చుల‌ను బ‌ట్టి అంచ‌నా వేయ‌డం. మీరు ప్ర‌తి నెలా ఎంత సంపాదిస్తున్నారు. ఇందులో ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవాలి. క‌నీసం 6 నుంచి 12 నెల‌ల సంపాద‌న‌తో అత్య‌వ‌స‌ర నిధి ఏర్పాటు చేయ‌డం మంచిది. ఒక‌వేళ మీరు స్వ‌యం ఉపాధి పొందుతున్న వారైతే మీ నెల‌వారి ఖ‌ర్చుల‌ను.. అందుకు అయ్యే మొత్తాన్ని అంచ‌నా వేసి ఆ మేర‌కు.. 12 నెల‌ల ఖ‌ర్చుల‌కు స‌మాన‌మైన మొత్తాన్ని అత్య‌వస‌ర నిధిగా ఏర్పాటు చేసుకోవాలి. 

రెండోది ఎలాంటి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు వ‌చ్చే అవ‌కాశం ఉంది.. దానికి ఎంత మొత్తం కావాల‌నేది ముందుగానే అంచ‌నా వేయ‌డం. ఉదాహ‌ర‌ణ‌కు.. మీ కుటుంబంలో జ‌న్యు ప‌ర‌మైన ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయ‌నుకుందాం.  అంటే త‌ల్లిదండ్రుల‌లో ఎవ‌రికైనా జ‌న్యుప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఉంటే.. అవి వారి సంతానానికి కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఆరోగ్య బీమా ఉన్న‌ప్ప‌టికీ అది అన్ని ఖ‌ర్చుల‌ను క‌వ‌ర్ చేయ‌క‌పోవ‌చ్చు. అలాంటప్పుడు సంబంధిత చికిత్స కోసం అయ్యే ఖ‌ర్చుల‌ను సుమారుగా అంచ‌నా వేసి అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా, మీరు ఎక్కువ‌గా ప్రకృతి వైపరీత్యాలు సంభ‌వించే ప్ర‌దేశాల‌లో నివ‌సిస్తున్నా, త‌రుచూ ఉద్యోగం మారుతున్నా.. ఇలా మీ ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసి దానికి త‌గిన‌ట్లుగా నిధిని స‌మ‌కూర్చుకోవాలి. 

ఎక్కడ పెట్టాలి? 

అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు ఎప్పుడు వ‌స్తాయో తెలియ‌దు. ఇదే స‌మయానికి డ‌బ్బు అవ‌స‌ర‌మ‌వుతుందని కచ్చితంగా చెప్ప‌లేం. అందువ‌ల్ల దీర్ఘ‌కాల లాక్ - ఇన్ - పిరియడ్‌ ఉండే ప‌థ‌కాల‌లో అత్య‌వ‌స‌ర నిధిని ఉంచ‌కూడ‌దు.. మూడు నెల‌ల కాల‌వ్య‌వ‌ధితో కూడిన ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ఇందుకోసం 90 రోజుల మెచ్యూరిటీ పిరియ‌డ్‌తో కూడిన లిక్విడ్ ఫండ్ల‌లో ఉంచి, ఆటో రెన్యువ‌ల్ ఆప్ష‌ను ఎంచుకోవ‌చ్చు. లిక్విడ్ ఫండ్స్ ఎంచుకునేటప్పుడు అధిక శాతం ప్రభుత్వ బాండ్స్ , లేదా ‘AAA’ రేటెడ్ బాండ్స్‌ను ఎంచుకోవడం మంచిది. 

అత్య‌వ‌స‌ర నిధిలో 10-15 రోజుల ఖర్చులకు అవసరమైన డబ్బును ఇంటి వద్ద ఉంచుకోవాలి. వరదలు, తుఫాన్లు వంటి ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్పుడు కొన్ని గంట‌లు లేదా రోజులు నెట్ వ‌ర్క్‌లు ప‌నిచేయ‌క‌పోవ‌చ్చు. బ్యాంకులు , ఏటీఎంలు కూడా మూతపడ్డ‌చ్చు. అలాంట‌ప్పుడు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. 

కొంత డబ్బును పొదుపు ఖాతాలో ఉంచాలి. అయితే పొదుపు ఖాతాలో ఉంటే రోజువారీ ఖర్చులకు వాడే అవకాశం ఉంది కాబట్టి, ఫ్లెక్సీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో ఉంచడం వల్ల  కొంచెం అధిక వడ్డీతో పాటు, అవసరమైనప్పుడు తిరిగి తీసుకోవ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని