Festival Sale: పండగ సేల్‌లో ఫోన్‌ కొంటున్నారా? మంచి ఫోన్‌ ఎలా ఎంచుకోవాలంటే..

Festival Sale: ఫీచర్లు మెరుగవుతున్న కొద్దీ ఫోన్ల ధరలు పెరుగుతాయి. అయితే, అవసవరమైన ఫీచర్లు ఉన్న ఫోన్‌ను కొనడంలో బడ్జెట్‌ అడ్డంకిగా మారకుండా చూసుకోవాలి. అందుకే ఇలాంటి పండగ సేల్‌ను అవకాశంగా మార్చుకోవాలి.

Updated : 04 Oct 2023 14:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పండగ సేల్‌ (Festival Sale) హంగామా ప్రారంభమైంది. రకరకాల ఆఫర్లతో వివిధ సంస్థలు యూజర్లను ఆకర్షిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ (Smartphone) కొనాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. అయితే, ఏ ఫోన్‌ కొనాలనే విషయంలో చాలా మంది గందరగోళానికి గురవుతారు. సైజ్‌, బ్రాండ్‌, స్పీడ్‌, కెమెరా, ఓఎస్‌.. వీటిలో ఏ ఫీచర్‌ ఎలా ఉంటే బెటరో నిర్ణయించుకోవడం సవాళ్లతో కూడుకున్న విషయమే. ఈ నేపథ్యంలో అసలు స్మార్ట్‌ఫోన్ (Smartphone) కొనేముందు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో చూద్దాం..

ఆపరేటింగ్‌ సిస్టమ్‌..

ఫోన్‌ కొనేముందు తొలుత నిర్ధారించుకోవాల్సిన ప్రధాన అంశం ఓఎస్‌ (Operating System). ఇప్పుడు మార్కెట్‌లో ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ ప్రధానంగా అందుబాటులో ఉన్న ఓఎస్‌లు. బ్లాక్‌బెర్రీ, విండోస్‌ కూడా ఉన్నప్పటికీ.. ఇవి కొన్ని ఫోన్లకే పరిమితమయ్యాయి. ఫోన్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను మీ అభిరుచులకు అనుగుణంగా మార్చుకోవాలనుకుంటే ఆండ్రాయిడ్ (Android) ఉత్తమం. విడ్జెట్లు, యాప్‌లు, ఐకాన్‌లను మనకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుకోవచ్చు. ఒకవేళ ఇప్పటికే ఇంట్లో యాపిల్‌ ఉత్పత్తులను వాడుతున్నట్లయితే ఐఫోన్‌ కొనడం మేలు. ప్రత్యేకంగా ఐఫోన్‌పై ఆసక్తి ఉన్నా, క్వాలిటీ, గోప్యతపై ప్రత్యేకంగా ఏమైనా పరిమితులున్నా ఈ ఫోన్‌కు వెళ్లడం మేలు.

సైజ్‌..

ఫోన్‌ తెర పరిమాణాన్ని పైభాగంలోని ఎడమ మూల నుంచి కింది భాగంలో కుడి మూల వరకు లెక్కిస్తారు. దీన్ని అంగుళాల్లో పేర్కొంటారు. 6.5 అంగుళాల కంటే ఎక్కువ ఉన్న ఫోన్లను పెద్దవిగా పరిగణించొచ్చు. 4.5 అంగుళాల కంటే తక్కువున్న ఫోన్లను చిన్నవిగా, 4.5 నుంచి 6.5 అంగుళాల వరకు మీడియం సైజ్‌ ఫోన్లుగా లెక్కిస్తారు. ఏ సైజ్‌ ఫోన్‌ తీసుకోవాలనేది మీ వాడకంపై ఆధారపడి ఉంటుంది. కేవలం కాల్స్‌, మెసేజ్‌లకు మాత్రమే అయితే చిన్నదాన్ని ఎంచుకోవచ్చు. వీడియో గేమ్స్‌, వీడియోలు చూడడానికైతే 6 అంగుళాల కంటే ఎక్కువ పరిమాణం ఉన్న ఫోన్‌ను ఎంపిక చేసుకోవాలి.

ఐఫోన్‌, పిక్సెల్‌, నథింగ్‌.. ప్రీమియం ఫోన్లపై పండగ ఆఫర్లివే!

ర్యామ్‌, స్టోరేజ్‌..

గేమ్స్‌ బాగా ఆడడం, లేదా ఒకే సమయంలో చాలా యాప్స్‌ను వాడే అవసరం ఉంటే మాత్రం ఫోన్‌ వేగం మెరుగ్గా ఉండాలి. అందుకు చూడాల్సింది ర్యామ్‌ (RAM). ర్యామ్‌ తక్కువగా ఉండే ఒక యాప్‌ నుంచి మరో యాప్‌నకు మారడానికి కొంత సమయం తీసుకుంటుంది. అందుకే ఫోన్‌ వేగంగా ఉండాలంటే ర్యామ్‌ ఎక్కువగా ఉండేది తీసుకోవాలి. ఇప్పుడు చాలా ఫోన్లలో 4జీబీ ర్యామ్‌ వస్తోంది. కానీ, గేమింగ్‌ కోసమైతే 8జీబీ ర్యామ్‌ బెస్ట్‌ అని నిపుణులు సూచిస్తున్నారు. స్టోరేజ్‌ విషయానికి వస్తే 64 జీబీ ఇప్పుడు చాలా ఫోన్లలో కామన్‌గా వస్తోంది. దీన్ని 1టీబీ వరకు పెంచుకొనే వెసులుబాటు ఉంది. అయితే, ఎక్కువగా సినిమాలు, ఫొటోలు, వీడియోలు స్టోర్‌ చేసుకోవాల్సిన అవసరం ఉంటే కనీసం 256జీబీ ఉండేలా చూసుకోవాలి. 6జీబీ ర్యామ్‌ + 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్లు ఉత్తమం!

కెమెరా..

ఇప్పుడంతా సెల్ఫీల ట్రెండ్‌ నడుస్తోంది. కాబట్టి ఫ్రంట్‌ కెమెరా కనీసం 8MP ఉంటే మంచి ఫొటోలను తీసుకోవచ్చు. బడ్జెట్‌ ఫోన్లలో 16MP వరకు సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంటోంది. ఇక వెనుక భాగంలో ఉండే ప్రధాన కెమెరా ఇప్పుడు చాలా ఫోన్లలో 50MP సామర్థ్యంతో వస్తోంది. ఫొటోలు, వీడియోలను చిత్రీకరించడంపై ఆసక్తి ఉన్న వారైతే 50MP మంచి ఆప్షన్‌. 16MPతో కూడా మంచి క్వాలిటీ ఫొటోలను తీయొచ్చు. అయితే, కెమెరా విషయంలో కేవలం ప్రధాన లెన్స్‌లే కాకుండా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, ఇమేజ్‌ సెన్సర్‌, అపెర్చర్‌, టెలీ ఫొటో లెన్స్‌ వంటి ఆప్షన్లు ఉన్న కెమెరా ఉంటే బెటర్‌. ఫొటోలకు మరిన్ని హంగులు అద్దేలా ఈ మధ్య కెమెరాలను కృత్రిమ మేధతో అనుసంధానిస్తున్నారు. ఈ ఫీచర్ కూడా ఉండేలా చూసుకోవాలి.

ప్రాసెసర్‌..

ప్రాసెసర్‌ విషయానికి వస్తే క్వాడ్‌కోర్‌, ఆక్టాకోర్‌, స్నాప్‌డ్రాగన్‌, మీడియాటెక్‌ ఇలా చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఏ ప్రాసెసర్‌ ఎంచుకోవాలో తెలుసుకోవడానికి ఒక థంబ్‌ రూల్‌ ఉంది. అదే ప్రాసెసింగ్‌ స్పీడ్‌. దీన్ని గిగా హెర్ట్‌జ్‌ల (GigaHertz- GHz)లో పేర్కొంటారు. ఎంత ఎక్కువ ఉంటే ప్రాసెసర్‌ అంత వేగంగా పనిచేస్తుంది. ఒకవేళ వీడియో, ఫొటో ఎడిటింగ్‌ పని ఎక్కువగా ఉన్నా లేదా మొబైల్‌ గేమ్స్‌ ఎక్కువగా ఆడేవారైతే ఎక్కువ GHz ఉన్న ప్రాసెసర్‌ను ఎంచుకోవాలి.

వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్స్‌ కొనేటప్పుడు ఏమేం చూడాలి?

బ్యాటరీ..

ఏకకాలంలో ఎక్కువ యాప్‌లు వాడతారా? వీడియో స్ట్రీమింగ్‌ యాప్‌లను ఎక్కువగా చూస్తుంటారా? గేమ్స్‌ బాగా ఆడుతుంటారా? ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడుపుతారా? అయితే, ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ (Battery Life) ఉండే ఫోన్‌ను తీసుకోవడం ఉత్తమం. ఇప్పుడు చాలా ఫోన్లలో 4000mAh కంటే శక్తిమంతమైన బ్యాటరీలే వస్తున్నాయి. 5,000mAh బ్యాటరీ చాలా ఫోన్లలో ఇప్పుడు కామన్‌గా మారింది.

ఫీచర్లు మెరుగవుతున్న కొద్దీ ధరలు పెరుగుతాయి. అయితే, కావాల్సిన లేదా అవసరమైన ఫీచర్లు ఉన్న ఫోన్‌ను కొనడంలో బడ్జెట్‌ అడ్డంకిగా మారకుండా చూసుకోవాలి. అందుకే ఇలాంటి పండగ సేల్‌ను  అవకాశంగా మార్చుకోవాలి. మెరుగైన ఫీచర్లు అందుబాటు ధరలో లభించాలంటే ఇప్పుడు ఉండే బ్యాంకు ఆఫర్లు, ప్రత్యేక రాయితీలను వాడుకోవాలి. నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే ఎంపిక చేసిన కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ క్రెడిట్‌ సదుపాయాన్ని కూడా ఇస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని