ఫండ్ ఎంపిక చేయడం ఎలా?

ఇప్పుడున్న అన్ని కేట‌గిరీల నుంచి ఒక్కో ఫండ్ ఎంచుకోవాలా? అంటే కాద‌నే చెప్పాలి.....

Published : 18 Dec 2020 15:16 IST

ఇప్పుడున్న అన్ని కేట‌గిరీల నుంచి ఒక్కో ఫండ్ ఎంచుకోవాలా? అంటే కాద‌నే చెప్పాలి.

మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను చిన్న మ‌దుప‌ర్ల‌కు చాలా అనుకూలంగా ఉండే పెట్టుబ‌డి నిపుణులు చెబుతుంటారు. త‌క్కువ మొత్తంతోనే ఈక్విటీ, డెట్ ల‌లో పెట్టుబ‌డులు చేయ‌వ‌చ్చు. అయితే వీటిలో మ‌దుపు చేసేందుకు ఏ ఫండ్ ఎంచుకోవాల‌నేది మ‌దుప‌ర్లు తెలుసుకోవాలి. సెబీ ఇటీవ‌లె జారీచేసిన మ్యూచువ‌ల్ ఫండ్ల వ‌ర్గీక‌ర‌ణ నిబంధ‌న‌ల ప్ర‌ధాన ఉద్దేశం చిన్న మ‌దుప‌ర్లు ఏవిధమైన క్లిష్ట‌త లేకుండా మ్యూచువ‌ల్ ఫండ్ ను ఎంచుకోవ‌డ‌మే. అయితే ఈ వ‌ర్గీక‌ర‌ణ త‌రువాత మ్యూచువ‌ల్ ఫండ్లు మొత్తం 14 కేట‌గిరీలుగా మారాయి. వీటిలో ఈక్వీటీ ఆధారిత మ్యూచువ‌ల్ ఫండ్లే 15 ర‌కాలు ఉన్నాయి.అయితే మ‌దుప‌ర్లు ఇప్పుడున్న‌ ప్ర‌తీ కేట‌గిరీలో నుంచి ఒక్కో ఫండ్ ఎంచుకోవాలా? అంటే కాద‌నే చెప్పాలి.

ఎలా ఎంపిక చేసుకోవాలి?

ఈ వ‌ర్గీక‌ర‌ణ త‌రువాత ఏర్ప‌డిన అన్ని కేట‌గిరీల‌ను మ‌దుప‌ర్లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే పెట్టుబ‌డులు చేయాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు నిపుణులు. సాధార‌ణంగా లార్జ్ క్యాప్ ,మిడ్, మ‌ల్టీ, స్మాల్ క్యాప్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌డం మంచిద‌ని వారు సూచిస్తున్నారు. కొన్ని ఫండ్లు గ‌తంలో ఉన్న మాదిరిగానే ఇప్పుడు కూడా కూడా ఉన్నాయి. అయితే వీటికి తోడుగా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, వ్యాల్యూ , ఫోక‌స్డ్, డైన‌మిక్ అసెట్ అలోకేష‌న్ ఫండ్ల కేట‌గిరీలు కొత్త‌గా వ‌చ్చాయి.

ఏది అనుకూలం?

సాధార‌ణ మ‌దుప‌ర్లు ఎక్కువ‌గా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, మ‌ల్టీ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌డం మంచిది. వ‌ర్గీక‌ర‌ణ అనంత‌రం ఏర్ప‌డిన లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేట‌గిరీ చాలా విస్తృత‌మైన‌ది దీనికి బ‌దులుగా మ‌ల్టీ క్యాప్ ఫండ్లు ఎంచుకోవ‌డం మేల‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ఫండ్ల ఎంపిక చేసేట‌పుడు మ‌దుప‌ర్లు అన్ని కేట‌గిరీల‌ను ప‌రిగ‌ణించాల్సిన అవ‌స‌రం లేదు. కొన్ని కేట‌గిరీల‌కు చెందిన మ్యూచువ‌ల్ ఫండ్ల‌ ప‌రిధి చాలా విస్తృతంగా ఉంది. అలాంటి ఫండ్ల‌లో నిర్వాహ‌కుల‌కు పెట్టుబ‌డి నిర్ణ‌యాలు తీసుకునేందుకు ప‌రిధి విస్తృతంగా ఉంటుంది. వారు ఏ విధంగా పెట్టుబ‌డి నిర్ణ‌యాలు తీసుకుంటార‌నేది మ‌దుప‌ర్లు అంచ‌నా వేయ‌లేరు. కాబ‌ట్టి ఇలాంటి ఫండ్ల‌ను ఎంపిక చేసుకునేముందు బాగా ఆలోచించాలి.

ఉదాహ‌ర‌ణ‌కు కాంట్రా ఫండ్ తీసుకుంటే ఈ వ‌ర్గంలో వివిధ ఫండ్లను వేర్వేరు ఫండ్ మేనేజ‌ర్లు నిర్వ‌హిస్తుంటారు. వీటిలో ఒక ఫండ్ మేనేజ‌రుకు కాంట్రా షేర్లుగా అనిపించేవి మ‌రోక మేనేజ‌రుకు అనిపించ‌క‌పోవ‌చ్చు. కాబ‌ట్టి ఒకే కేట‌గిరీ అయినా పెట్టుబ‌డులు చేసే విధానం,పోర్టుఫోలియో నిర్మాణంలో తేడాలు రావొచ్చు.

ఒకే కేట‌గిరీలో ఉన్నా ప‌నితీరును పోల్చిచూసేందుకు కాస్త క్లిష్టంగా ఉండే డైన‌మిక్ అసెట్ అలోకేష‌న్ ఫండ్లు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్సెడ్ అడ్వాంటేజ్ ఫండ్ ( హెచ్‌డీఎఫ్‌సీ ప్రుడెన్స్ ఫండ్, బ్యాలెన్సెడ్ ఫండ్ కేట‌గిరీలో ఉండేది.) ఇప్పుడు ఈ ఫండ్ డైన‌మిక్ అసెట్ అలోకేష‌న్ ఫండ్ కేట‌గిరీలోకి వ‌చ్చింది. దీని నిర్వ‌హ‌ణ లో ఉన్న ఆస్తుల విలువ రూ.36,415 కోట్లు చాలా త‌క్కువ కాలంపాటు ఈ ఫండ్ ఆస్తులు 65 శాతం ఈక్విటీలో త‌క్కువ ఉండేవి. ఇప్పుడు కేట‌గిరీ మారాకా ఏవిధంగా ఉంద‌నేది చూసుకోవాలి.

వ్యాల్యూ ఫండ్ల విష‌యంలోనూ ఇదే విధంగా జ‌ర‌గొచ్చు. వాల్యూ ఫండ్లు మార్కెట్ అనుకూలంగా ఉన్న‌పుడు రాణించ‌క‌పోవ‌చ్చు. ఈ విష‌యం సాధార‌ణ మ‌దుప‌రికి అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌లేం. వారు ఆ ఫండ్ మంచిది కాద‌నే అవ‌కాశం ఉంటుంది. వ్యాల్యూ ఫండ్లు మంచి రాబ‌డిని అందించాలంటే కొంత స‌మ‌యం వేచియుండాలి. ఇలాంటి ఫండ్లను ఎంచుకోవాలంటే మ‌దుప‌ర్ల‌కు కొంత అవ‌గాహ‌న ఉండాలి.

ఎంచుకోండి ఇలా!

మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు ఇప్ప‌టికే వ‌ర్గీక‌ర‌ణ‌ను పూర్తిచేసి వాటి కొత్త ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించాయి. మ‌దుప‌ర్లు మ్యూచువ‌ల్ ఫండ్ల స‌ర్దుబాటు చేసుకునేందుకు ఇదే మంచి త‌రుణంగా భావించాలి. వీలైనంత వ‌ర‌కూ లార్జ్ క్యాప్, మ‌ల్టీ క్యాప్ , మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ వంటి ప్రాథ‌మిక‌ కేటిగిరీల‌కు చెందిన ఫండ్ల‌ను ఎంచుకోవ‌డం మంచిద‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కొంత న‌ష్ట‌భ‌యం ఎక్కువ తీసుకునే వారు మిడ్ , స్మాల్ క్యాప్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌చ్చు. న‌ష్ట‌భ‌యం త‌క్కువ‌గా తీసుకునేవారు లార్జ్, మ‌ల్టీ క్యాప్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌డం మంచిది. వీలైనంత వ‌ర‌కూ విస్త్రృత ప‌రిధి క‌లిగి ఉన్న ఫండ్ల‌ను ఎంచుకోక‌పోవ‌డం మంచిది. అయితే మీకు ఆ ఫండ్ల పెట్టుబ‌డి చేసే విధానం, ఫండ్ మేనేజ‌రు గురించి అవ‌గాహ‌న ఉన్న‌పుడు వాటిని ఎంచుకోవ‌చ్చు. ఈ విధమైన ఫండ్ల‌ను ఎంచుకునేందుకు ఆర్థిక నిపుణులు సంప్ర‌దించ‌డం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని