Credit card: క్రెడిట్ కార్డ్‌ల‌ను మెరుగ్గా ఎలా ఉప‌యోగించాలి..?

విభిన్న క్రెడిట్ కార్డ్‌లు షాపింగ్‌, ఫ్లైట్‌ బుకింగ్‌, డైనింగ్, ఇంధ‌న అవ‌స‌రాలు వంటి విభిన్న అవ‌స‌రాల‌ను తీరుస్తాయి.

Updated : 23 Mar 2022 14:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: త‌క్కువ ఆదాయం సంపాదించేవారికి కూడా క్రెడిట్ కార్డుల‌ను మంజూరు చేస్తున్నాయి బ్యాంకులు. 2, 3 క్రెడిట్ కార్డుల‌ను కూడా మెయింటైన్ చేసేవారు చాలా మంది ఉన్నారు. అస‌లు క్రెడిట్ కార్డు అవ‌స‌రం ఎంత వ‌ర‌కు అవ‌స‌ర‌మ‌నేది వీటిని వాడేవారి మ‌న‌స్తత్వం మీద ఆధార‌ప‌డి ఉంటుంది. ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ గ‌ల‌వారికి క్రెడిట్ కార్డు అనేది ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌నే చెప్పాలి. అది లేనివారికి క్రెడిట్ కార్డులు చాలా వ‌ర‌కు రుణ‌గ్ర‌స్తులను చేస్తాయి. అంతేకాకుండా క్రెడిట్ కార్డ్‌ను తీసుకునేట‌ప్పుడు రివార్డ్ పాయింట్ల నిర్మాణం, క్రెడిట్ ప‌రిమితి, వార్షిక రుసుం, బ్యాలెన్స్ బ‌దిలీ, క‌స్ట‌మ‌ర్ల‌కు బ్యాంకులు అందించే సేవ‌లు లాంటి అనేక విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి.

మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లుల‌ను చెల్లించ‌డంలో ఇబ్బంది ప‌డుతుంటే క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ బ‌దిలీ సాయాన్ని తీసుకోవ‌చ్చు. క్రెడిట్ కార్డుల‌ను మెరుగ్గా నిర్వ‌హించ‌డానికి మొద‌ట‌గా మ‌న‌కు స‌రిపోయే క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోవాలి. ఎక్కువ జీతం పొందే వ్య‌క్తులు గ‌రిష్ఠ రివార్డ్ పాయింట్ల‌ను క్లెయిమ్ చేయ‌డానికి ఎక్కువ క్రెడిట్ కార్డ్‌ల‌ను పొందే ధోర‌ణి ఉంది. అయితే మీరు మీ ఖ‌ర్చులు, చెల్లింపు తేదీల‌ను జాగ్ర‌త్త‌గా ట్రాక్ చేయ‌కుంటే బ‌హుళ క్రెడిట్ కార్డ్‌లు హానిక‌రం అవుతాయి. ఒక నిర్దిష్ట క్రెడిట్ కార్డ్ కోసం దర‌ఖాస్తు చేయ‌డానికి ముందు వారి ఖ‌ర్చుల స్వ‌భావాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. విభిన్న క్రెడిట్ కార్డ్‌లు షాపింగ్‌, ఫ్లైట్‌ బుకింగ్‌, డైనింగ్, ఇంధ‌న అవ‌స‌రాలు వంటి విభిన్న అవ‌స‌రాల‌ను తీరుస్తాయి.

కొంత మంది క్రెడిట్ కార్డ్ వినియోగ‌దారులు క‌నీస మొత్తాల‌ను చెల్లించే సదుపాయం సౌక‌ర్య‌వంతంగా అందుబాటులో ఉండ‌టంతో, క‌నీస చెల్లింపుకు మొగ్గు చూపుతారు. కానీ చెల్లించ‌ని క్రెడిట్‌పై వ‌డ్డీ పెరిగిపోతుంది. ఇది చివ‌రికి రుణ ఉచ్చుకు దారితీస్తుంది. కార్డ్ చెల్లింపు బిల్లుల తేదీల‌ను జాగ్ర‌త్త‌గా గుర్తించుకుని గ‌డువు కాలానికి ఒక రోజు ముందే బిల్లుని చెల్లించ‌డం మంచిది. పైగా మీరు బ‌హుళ కార్డ్‌ల‌ను క‌లిగి ఉన్న‌ట్ల‌యితే, ఏ కార్డ్‌ని ఏ ప్ర‌యోజ‌నం కోసం ఉప‌యోగించాలో అర్థం చేసుకోవ‌డం మంచిది. క్రెడిట్ కార్డ్ ఉప‌యోగిస్తున్న‌ట్ల‌యితే బ్యాంక్ ద‌గ్గ‌ర అప్పు చేస్తున్న‌ట్లే. ఇది తీర్చ‌నంత కాలం వ‌డ్డీ ఆ త‌ర్వాత వ‌డ్డీపై వ‌డ్డీ పెరిగిపోతుంది. ఇది అప్పుగా మిగ‌ల‌కుండా ఉండ‌టానికి ప్ర‌తి నెలా చెల్లింపు ప్ర‌ణాళిక‌ను క‌లిగి ఉండ‌టం చాలా అవ‌స‌రం. వ‌డ్డీ రేట్లు, బ్యాలెన్స్ బ‌కాయి, వినియోగ నిష్ప‌త్తి వంటి అంశాల ఆధారంగా క్రెడిట్ కార్డ్ వాడ‌కానికి ప్రాధాన్య‌ం ఇవ్వాలి. మీ క్రెడిట్ కార్డ్‌కి వ‌చ్చే రివార్డ్ పాయింట్ల‌తో కొన్ని సెల‌క్ట్ చేసిన వ‌స్తువుల‌ను కూడా ఉచితంగా ఆన్‌లైన్‌లో తీసుకోవ‌చ్చు.

క్రెడిట్ కార్డులకు సంవ‌త్స‌ర రుసుములు ఉంటాయి. ఇవి మ‌నం క్రెడిట్ కార్డ్‌ని వాడ‌క‌పోయిన రుసుములు క‌ట్టించుకునే బ్యాంకులు ఉన్నాయి. బ్యాంకులు ఇచ్చే గ‌రిష్ఠ మొత్తాన్ని వినియోగిస్తే ఆ సంవ‌త్స‌రానికి  రుసుములు ర‌ద్దు చేసే క్రెడిట్ కార్డ్ సంస్థ‌లు చాలానే ఉన్నాయి.  కొన్ని క్రెడిట్ కార్డులు ఇవి ప్ర‌తి సంవ‌త్స‌రం ఒకే మొత్తానికి ఉండ‌వు. ప్ర‌తి సంవ‌త్స‌రం మ‌నం వాడే రుణానికి గ‌రిష్ఠ మొత్తాన్ని పెంచుకుంటూ వెళ‌తారు. దానిక‌న్నా త‌క్కువ వాడితే సంవ‌త్స‌ర రుసుము క‌ట్టాల్సిందే. ఇందుకుగానూ సంవ‌త్స‌ర ఫీజుని క‌ట్ట‌కుండా ఉండ‌టానికి గ‌రిష్ఠ మొత్తాన్ని అందుకోవ‌డానికి క్రెడిట్ కార్డుని అన‌వ‌స‌రంగా వాడ‌టం మంచిది కాదు. క్రెడిట్ కార్డ్‌ని ఎక్కువ వాడి అప్పు అధిక మొత్తాన్ని చెల్లించేక‌న్నా వారు ఇచ్చిన గ‌రిష్ఠ మొత్తం క‌న్నా త‌క్కువ వాడి సంవ‌త్స‌ర రుసుము చెల్లించ‌డం మంచిది. త‌క్కువ ఫీజుతో అయిపోతుంది.

మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ మీకు అర్థం కాక‌పోతే లేదా ఎక్కువ ఛార్జీ విధిస్తున్నారని మీరు భావిస్తే క‌స్ట‌మ‌ర్ కేర్ హెల్ప్‌లైన్‌కి కాల్ చేయ‌డానికి వెనుకాడొద్దు. మీ కార్డ్ నుంచి గ‌రిష్ఠ ప్ర‌యోజ‌నాన్ని పొంద‌డానికి మీ క్రెడిట్ కార్డ్ క్యాష్‌బ్యాక్ గ‌డువు ముగిసేలోపు రీడీమ్ చేసుకోండి. క్రెడిట్ కార్డులు ప‌దునైన క‌త్తి లాంటివి. ఈ క‌త్తికి 2 వైపులా ప‌దును ఉంటుంది. వాడేట‌ప్పుడు క్రెడిట్ కార్డ్ ఎంత సౌల‌భ్యంగా ఉంటుందో.. దీని బిల్లు క‌ట్టేట‌పుడు నిర్ల‌క్ష్యం చేస్తే అంతే ఆర్థికంగా న‌ష్టం ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డ్ ఆర్థిక క్రమ‌శిక్ష‌ణ పాటించేవారికి ఉప‌యోగ‌క‌ర‌మే అని చెప్పొచ్చు. దీని వ‌ల్ల మంచి క్రెడిట్ స్కోర్ మెయింటైన్ చేసే అవ‌కాశం ఉంటుంది. భ‌విష్య‌త్తులో వ్య‌క్తిగ‌త రుణాలు తీసుకునేట‌ప్పుడు, గృహ రుణాలు తీసుకునేట‌ప్పుడూ ఈ క్రెడిట్ స్కోర్ చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని