Russian oil: రష్యాపై వ్యతిరేకత.. భారత్‌కు అలా కలిసొచ్చింది!

Russian oil imports: ఉక్రెయిన్‌ వార్‌కు ముందు భారత దిగుమతుల్లో 0.2 శాతంగా ఉన్న రష్యా చమురు వాటా ఏకంగా 10 శాతానికి చేరింది. అంటే 50 రెట్లు పెరిగింది.

Published : 23 Jun 2022 21:10 IST

దిల్లీ: ఉక్రెయిన్‌పై దాడిని వ్యతిరేకిస్తూ ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడం భారత చమురు కంపెనీలకు కలిసొచ్చింది. తక్కువ ధరకే చమురు దొరుకుతుండటంతో భారత రిఫైనరీలు దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. దీంతో రష్యా నుంచి క్రూడాయిల్‌ దిగుమతులు (Russian oil imports) అమాంతం పెరిగాయి. ఉక్రెయిన్‌ వార్‌కు ముందు భారత దిగుమతుల్లో 0.2 శాతంగా ఉన్న రష్యా చమురు (Russian oil) వాటా ఏకంగా 10 శాతానికి చేరింది. అంటే 50 రెట్లు పెరిగింది. భారత్‌కు ముడి చమురును ఎగుమతి చేస్తున్న టాప్‌-10 ఎగుమతి దారుల్లో రష్యా ఒకటిగా నిలిచిందని ప్రభుత్వ అధికారి ఒకరు గురువారం వెల్లడించారు. ఇందులో 40 శాతం చమురు ప్రైవేటు చమురు కంపెనీలైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, నైరా ఎనర్జీదేనని కావడం గమనార్హం.

2021 ఆర్థిక సంవత్సరం, 2022 తొలి త్రైమాసికం వరకు భారత్‌కు దిగుమతి అవుతున్న రష్యా చమురు వాటా కేవలం 0.2 శాతం మాత్రమే. రవాణా ఖర్చులు అధికంగా ఉండడం దిగుమతి చేసుకోవడం ఇబ్బందిగా ఉండేది. అయితే, ఉక్రెయిన్‌పై దాడికి దిగడంతో ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలకు దిగాయి. దీంతో బ్యారెల్‌కు 30 డాలర్లు తక్కువకే చమురు ఎగుమతి చేస్తామని రష్యా ప్రకటించింది. దీన్ని భారత్‌ అవకాశంగా మలుచుకుంది. దీంతో ఒక్క మే నెలలోనే ఏకంగా 25 మిలియన్‌ బ్యారెళ్ల చమురును భారత రిఫైనరీలు దిగుమతి చేసుకున్నాయి. మే నెలలో సౌదీ అరేబియాను వెనక్కి నెట్టి రెండో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా రష్యా నిలిచింది. ఇరాక్‌ మొదటి స్థానంలో ఉండగా.. సౌదీ అరేబియా మూడో స్థానంలో ఉంది. కాగా, రష్యా నుంచి చమురు దిగుమతులు ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని చమురు మంత్రిత్వ శాఖ గత నెల ప్రకటించడం గమనార్హం.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని