ITC Market cap: ఐటీసీ మార్కెట్‌ క్యాప్‌ @ రూ.5 లక్షల కోట్లు.. 11వ భారత కంపెనీ

ITC Market cap: ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. ఐటీసీ ఆర్థికంగా మంచి వృద్ధి నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ స్టాక్‌ను కొనడానికి మదుపర్లు ఆసక్తి చూపిస్తున్నారని నిపుణులు తెలిపారు.

Published : 20 Apr 2023 21:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సిగరెట్ల నుంచి హోటళ్ల వరకు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్న ఐటీసీ లిమిటెడ్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (ITC Market Cap) రూ.5 లక్షల కోట్లకు చేరింది. భారత్‌లో ఈ మైలురాయిని అందుకున్న 11వ కంపెనీగా ఇది నిలిచింది. ఈ ఏడాదిలో ఇప్పటి  వరకు కంపెనీ షేరు విలువ (ITC Share Price) రికార్డు స్థాయిలో 21 శాతం పెరగడం విశేషం.

ఈరోజు ఇంట్రాడేలో షేరు విలువ బీఎస్‌ఈలో 1.1 శాతం పెరిగి రూ.402.60 దగ్గర రికార్డు స్థాయికి చేరింది. ఆ సమయంలో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (ITC Market Cap) రూ.5.01 లక్షల కోట్లుగా నమోదైంది. ఇప్పటి వరకు రిలయన్స్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్‌.. రూ.5 లక్షల కోట్ల మార్కెట్‌ విలువను అందుకున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి.

ఎఫ్ఎంసీజీ, పేపర్‌, హోటల్స్‌ సహా అన్ని విభాగాల్లో ఐటీసీ మెరుగైన వృద్ధిని నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలో మదుపర్లు ఈ స్టాక్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు మార్కెట్‌ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా అధిక ద్రవ్యోల్బణం, వాతావరణ పరిస్థితులపై అనిశ్చితి, బలహీన గ్రామీణ విక్రయాల వంటి సవాళ్లు ఉన్నప్పటికీ.. ఐటీసీ రాణిస్తుండడం మదుపర్లను ఆకర్షిస్తోందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని