ATF price: ఆగని విమాన ఇంధన ధరల పెంపు.. వరుసగా ఎనిమిదో‘సారీ’!

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇప్పటికే భారీ ఎత్తున పెరగ్గా.. విమాన ఇంధన (ATF) ధరలు సైతం కొండెక్కాయి....

Published : 16 Apr 2022 14:54 IST

దిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో దేశీయంగా ఇంధన ధరలు మోత మోగుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇప్పటికే భారీ ఎత్తున పెరగ్గా.. విమాన ఇంధన (ATF) ధరలు సైతం కొండెక్కాయి. తాజాగా చమురు సంస్థలు మరోసారి ఏటీఎఫ్‌ ధరల్ని పెంచుతూ శనివారం నిర్ణయం తీసుకున్నాయి. దిల్లీలో ఏటీఎఫ్‌ ధర కిలో లీటర్‌పై రూ.277.5  (0.2శాతం) పెరిగింది. దీంతో దేశ రాజధానిలో కిలో లీటరు విమాన ఇంధన ధర రూ.1,13,202.33 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠానికి చేరింది.

ఈ ఏడాదిలో ఏటీఎఫ్‌ ధర పెరగడం వరుసగా ఇది ఎనిమిదోసారి. అంతకుముందు ఏప్రిల్‌ 1న కిలోలీటర్‌ ఏటీఎఫ్‌పై రెండు శాతం పెంచారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల ఆధారంగా ఏటీఎఫ్‌ ధరను ప్రతి నెలా 1, 16వ తేదీల్లో సవరిస్తుంటారు. 2022 జనవరి 1 నుంచి ప్రతి 15 రోజులకోసారి వీటి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఏటీఎఫ్‌ ధర 50 శాతానికి పైగా పెరిగింది. విమాన నిర్వహణలో దాదాపు 40 శాతం వాటా వ్యయం ఇంధనానిదే. దీంతో రాబోయే రోజుల్లో విమాన ప్రయాణికులపై మరింత భారం పడే అవకాశముంది. మరోవైపు దాదాపు రెండు వారాల పాటు వరుసగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గత 10 రోజులుగా స్థిరంగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని