హామీతో పాటు రాబ‌డినిచ్చే దీర్ఘకాలిక బీమా ప‌థ‌కం

రాబ‌డి అందే కాల‌వ్య‌వ‌ధుల‌ను బ‌ట్టి మూడు ర‌కాల ప్రీమియం చెల్లింపు కాల‌వ్య‌వ‌ధులు(పీపీటీ) అందుబాటులో ఉన్నాయి

Published : 22 Dec 2020 18:53 IST

టాటా ఏఐఏ లైఫ్ ఇన్సురెన్స్ నుంచి వ‌చ్చిన తాజా జీవిత బీమా ప‌థ‌కం టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ గ్యారెంటీడ్ మంత్లీ ఇన్కం ప్లాన్‌. ఇది నాన్ పార్టిసిపేటెడ్ ట్రెడిష‌న‌ల్ ఇన్సూరెన్స్ పాల‌సీ. ఈ పాల‌సీ ద్వారా క‌చ్చితమైన రాబ‌డిని పొంద‌వ‌చ్చు. క‌చ్చిత‌మైన ఆదాయాన్నినిర్ణీత కాలం పాటు నెల‌వారీ ఆదాయం వ‌స్తుంద‌నేది ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తున్న‌ప్ప‌టీ దీర్ఘ‌కాలంలో పెట్టుబ‌డిపై వ‌చ్చే రాబ‌డి శాతం త‌క్కువ‌గా ఉంటుంది. ఈ పాల‌సీ గురించి మ‌రిన్ని వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రాబ‌డి అందే కాల‌వ్య‌వ‌ధుల‌ను బ‌ట్టి మూడు ర‌కాల ప్రీమియం చెల్లింపు కాల‌వ్య‌వ‌ధులు(పీపీటీ) అందుబాటులో ఉన్నాయి. ఈ ప‌థ‌కంలో అతి త‌క్కువ ప్రీమియం చెల్లింపుల కాల‌వ్య‌వ‌ధి 5 సంవ‌త్స‌రాలు. ఆదాయాన్ని 10 సంవ‌త్సారాల పాటు అందిస్తారు. ప్రీమియం చెల్లింపుల‌కు గ‌రిష్ట కాల‌వ్య‌వ‌ధి 12 సంవ‌త్స‌రాలు. ఆదాయం 24 సంవ‌త్స‌రాల పాటు చెల్లిస్తారు. ఆదాయానిచ్చే కాల‌వ్య‌వ‌ధి, ప్రీమియం చెల్లించే కాల‌వ్య‌వ‌ధికి రెట్టింపు ఉంటుంది.

మీరు ఎంచుకున్న ప్రీమియం, పాలుసీ కొనుగోలు చేసేనాటికి మీ వ‌య‌సు ఆధారంగా నెల‌వారీ ప్ర‌యోజ‌నాల‌ను లెక్కిస్తారు. వార్షిక ఆదాయం, మీరు చెల్లించిన మొత్తం ప్రీమియంపై 8.35 శాతం నుంచి 13.03 శాతం ఉంటుంది. నెల‌వారి ఆదాయాన్ని కోసం ఈ మొత్తాన్ని 12 భాగాలుగా విభ‌జిస్తారు.అధిక ప్రీమియం చెల్లింపు పాల‌సీని తీసుకుంటే నెల‌వారి ఆదాయం కూడా పెరుగుతుంది.

ఉదాహ‌ర‌ణకు 35 సంవ‌త్స‌రాల వ్య‌క్తి వార్షికంగా రూ.1 ల‌క్ష ప్రీమియం చొప్పున 12 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి పాల‌సీ ఎంచుకున్నారు. అత‌ని వ‌య‌సు ఆధారంగా చెల్లించిన మొత్తం ప్రీమియంపై 9 శాతం వార్షిక ఆదాయాన్ని ఇస్తుంది. ఇక్క‌డ‌ వార్షిక ప్రీమియం ఎక్కువ కాబ‌ట్టి వార్షిక ఆదాయాన్ని మ‌రో 0.4 శాతం పెంచుతారు. మొత్తంమీద, వార్షిక ఆదాయం చెల్లించిన ప్రీమియంపై 9.4 శాతంగా ఉంటుంది. అత‌ను చెల్లించిన 12 ల‌క్ష‌ల‌కు గాను 24 సంవ‌త్స‌రాల కాలానికి వార్షికంగా రూ. 1.13 ల‌క్ష‌లు, లేదా నెల‌వారీగా రూ.9,400 మొత్తాన్ని చెల్లిస్తారు.

బీమా ప్ర‌యోజ‌నాల విష‌యానికి వ‌స్తే ఈ ప‌థ‌కం వార్షిక ప్రీమియంపై 11 రెట్లు హామీనిస్తుంది. పై ఉదాహ‌ర‌ణ‌లోని వ్య‌క్తికి రూ.11 ల‌క్ష‌ల హామీని అందిస్తారు. ప్రీమియం చెల్లింపుల స‌మ‌యంలో పాల‌సీ దారుడు మ‌ర‌ణిస్తే హామీ మొత్తాన్ని లేదా అంత‌వ‌ర‌కు చెల్లించిన మొత్తం ప్రీమియంపై 105 శాతాం అధికంగా ఉన్న మొత్తాన్ని చెల్లిస్తారు.

నెల‌వారీ చెల్లింపుల‌కు బ‌దులుగా ఒకే మొత్తంగా కూడా పొంద‌వ‌చ్చు. ఆదాయాన్ని చెల్లించే స‌మ‌యంలో పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే, నెల‌వారీ చెల్లింపులు లేదా ఏక మొత్తం చెల్లింపులు నామినీకి చెల్లిస్తారు.

పైన తెలిపిన ఉదాహ‌ర‌ణ‌లోని 35 సంవ‌త్స‌రాల వ్య‌క్తి, వార్షిక ప్రీమియం రూ.1 ల‌క్ష రూపాయిల‌తో 12 సంవ‌త్స‌రాల ప్రీమియం చెల్లింపుల విధానంతో పాల‌సీ కొనుగోలు చేస్తే, అత‌ను త‌రువాతి 24 సంవ‌త్స‌రాల‌కు వార్షికంగా రూ.1.13 ల‌క్ష‌లు క‌చ్చిత‌మైన ఆదాయాన్ని పొందుతాడు.

పెన్ష‌న్ ప‌థకాల‌లో చెల్లించే యాన్యూటీలపై ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప‌థ‌కం, నెల‌వారీ క్ర‌మ‌మైన‌ ఆదాయాన్నిఅందించ‌మే కాకుండా వాటిపై ప‌న్ను వ‌ర్తించ‌దు. పాల‌సీ కాల‌వ్య‌వ‌ధి కూడా ఎక్కువ‌గా ఉండ‌టంతో దీన్ని మంచి పెన్ష‌న్ పథ‌కంగా చూడొచ్చు.

కానీ పెట్టుబ‌డి పై 5 శాతం రాబ‌డినిచ్చే దీర్ఘ‌కాల బీమా ప‌థ‌కాల కంటే, ట‌ర్మ్ ఇన్సురెన్స్‌ను తీసుకుని, బ్యాలెన్స్‌డ్ ఫండ్ల‌లో పెట్టుబ‌డితే క‌నీసం 30 శాతం అధికంగా నెల‌వారి ఆదాయాన్ని పొంద‌వ‌చ్చిని ఆర్ధిక స‌ల‌హ‌దారులు చెబుతుంటారు. ఈ పాల‌సీలో ఉండే క‌చ్చితమైన రాబ‌డి పొంద‌డం అనేది కొంత ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. అయితే మ‌దుప‌ర్లు గుర్తుంచుకోవాల్సిన విష‌యం ఏటంటే దీనిపై వ‌చ్చే రాబ‌డి శాతం చాలా త‌క్కువ కాబ‌ట్టి ఒక వేళ పాల‌సీ తీసుకోవాల‌నుకున్నా ఎక్కువ మొత్తంలో డ‌బ్బును ఇందులో పెట్టుబ‌డి పెట్ట‌క‌పోవ‌డం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని