ఏ పెట్టుబ‌డి ఎంత వ‌ర‌కు అనుకూలం? పార్ట్‌-2

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో దీర్ఘ‌కాలం పాటు మ‌దుపు చేయ‌డం వ‌ల్ల మంచి రాబ‌డిని పొంద‌వ‌చ్చు.....

Published : 21 Dec 2020 16:12 IST

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో దీర్ఘ‌కాలం పాటు మ‌దుపు చేయ‌డం వ‌ల్ల మంచి రాబ‌డిని పొంద‌వ‌చ్చు.​​​​​​​

మ్యూచువ‌ల్ ఫండ్లు, షేర్లు దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డిని అందించే పెట్టుబ‌డి ప‌థ‌కాలు. అయితే మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఈక్విటీ, డెట్ రెండు వ‌ర్గాలు ఉంటాయి. డెట్ ఫండ్లు స్థిరాదాయ పెట్టుబ‌డి ప‌థ‌కాల్లో పెట్టుబ‌డి పెడ‌తాయి. ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లు షేర్లలో పెట్టుబ‌డి పెడ‌తాయి. వీటిపై వ‌చ్చే రాబ‌డి మార్కెట్ అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లు , షేర్లు రెండూ ఒకే కేట‌గిరీకి చెందిన‌వి. అయితే మ్యూచువ‌ల్ ఫండ్ల కంటే షేర్ల‌లో న‌ష్ట‌భ‌యం ఎక్కువ‌గా ఉంటుంది.

షేర్లు:
అనుకూల‌త‌లు: 10 సంవ‌త్స‌రాలు అంత‌కంటే ఎక్కువ‌కాలంలో మంచి సంప‌ద‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు.
సిప్ ద్వారా చిన్న మొత్తాల‌లో పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు.

ప్ర‌తికూల‌త‌లు:
వృద్ధి చెందే షేర్ల‌ను ఎంపిక‌చేసుకునేంద‌కు కొంత అవ‌గాహ‌న ఉండాలి. లోతైన విశ్లేషణ అవ‌స‌రం.
షేర్ల‌లో పెట్టుబ‌డి వృద్ధి చెంద‌క‌పోతే మూల‌ధ‌నాన్ని దీర్ఘ‌కాలంపాటు కొన‌సాగించాల్సి ఉంటుంది.

మ్యూచువ‌ల్ ఫండ్లు:
మ్యూచువ‌ల్ ఫండ్లు స్టాక్ మార్కెట్‌, ప్ర‌భుత్వ బాండ్లు, కార్పొరేట్ బాండ్ల‌లో ప‌రోక్షంగా పెట్టుబ‌డులు పెడ‌తాయి. ఏఎమ్‌సీ(అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ)ల ద్వారా ఫండ్ల‌ను నిర్వ‌హించ‌డానికి స్పాస‌ర్లు ట్ర‌స్ట్‌ను ఏర్పాటు చేసుకుని ట్ర‌స్టీల‌ను నియ‌మిస్తారు. ఈ ఏఎమ్‌సీల‌ను ఫండ్ మేనేజ‌ర్లు నిర్వ‌హిస్తారు. మ‌దుప‌ర్లు, పెట్టుబ‌డి పెట్టే ప్ర‌తి ప‌థ‌కంలోనూ, ఎంచుకున్న విధానం ద్వారా సంప‌ద‌ను సృష్టించేందుకు ఏఎమ్‌సీలు కృషి చేస్తాయి.

రెగ్యూలేట‌ర్‌:
మార్కెట్ నియంత్ర‌ణ వ్య‌వ‌స్థ సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) మ్యూచువ‌ల్ ఫండ్ హౌస్‌ల‌ను ప‌ర్య‌వేక్షించ‌డంతో పాటు, త‌గిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను సూచిస్తుంది. స‌మయానికి త‌గిన‌ట్లుగా నియ‌మ నిబంధ‌న‌లను అమ‌లు చేస్తుంది. ఇది పెట్టుబ‌డిదారుల ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షిస్తుంది.

ఉదాహ‌ర‌ణ‌కి
1.ఏఎమ్‌సీలు ఒకే షేరులో నిర్ధేశించిన ప‌రిమితుల మేర‌కు పెట్టుబ‌డి పెడ‌తాయి.
2.మరింత పారదర్శకతను కోసం, మ్యూచువ‌ల్ ఫండ్ పథకాల సంఖ్యను సరళీకృతం చేసేందుకు ఏఎమ్‌సీలు తమ పథకాలను జూన్, 2018 తేదీ నుంచి వర్గీకరించాయి. 

ఈ కింది విధంగా కూడా ఏఎమ్‌సీలు చేయ‌వ‌చ్చు.
i. మార్పులు అవ‌స‌రంలేక‌పోతే, ప్ర‌స్తుతం అమ‌ల‌వుతున్న ప‌థ‌కాల‌లోనూ కొన‌సాగించ‌వ‌చ్చు.
ii. ఇత‌ర ప‌థ‌కంలో క‌లిసిపోయి ప‌థ‌కం పేరు మార్చుకోవ‌చ్చు.
Iii. రెండు ప‌థ‌కాల‌ను విలీనం చేసి మ‌రొక కొత్త పేరు ఎంచుకోవ‌చ్చు.
3.టీఈఆర్‌(మొత్తం వ్య‌య నిష్ప‌త్తి) త‌గ్గింపు: ఏఎమ్‌సీలు, వాటి వ్య‌య నిష్ప‌త్తిని 25బేసిస్ పాయింట్లు(0.25 శాతం) త‌గ్గించుకోవాల‌ని సెబీ సూచించింది. రెగ్యుల‌ర్ ప్లాన్లు, డైరెక్ట్ ప్లాన్ల వ్య‌య నిష్ప‌త్తిలో ఉన్న వ్య‌త్యాస‌మే డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు చెల్లించే క‌మీష‌న్‌.
4.డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ముందుగా ఇచ్చే క‌మీష‌న్‌ను ర‌ద్దు చేయాలి.
5.ఎన్ఎస్‌సీ, బీఎస్‌సీ వెబ్‌సైట్ల‌లో ప్రైస్ రిట‌ర్న్ ఇండెక్స్‌(PRI) ను సూచిస్తుంది. అయితే అన్ని ఫండ్ల‌ను టోట‌ల్ రిట‌ర్న్ ఇండెక్స్‌(TRI)గా ప‌రిగ‌ణించాలి.

ఈక్వీటీ ఫండ్లు, డెట్ ఫండ్లు, హైబ్రీడ్ ఫండ్ల‌లో వివిధ స‌బ్‌-కేట‌గిరిలు ఉంటాయి. ఈక్వీటీ ఫండ్లు అధిక భాగాన్ని ఈక్వీటీలో పెట్టుబ‌డి పెడ‌తాయి. డెట్ ఫండ్లు మొత్తంగా ప్ర‌భుత్వ బాండ్లు,/ కార్పొరేట్ బాండ్ల‌లో పెట్టుబ‌డి పెడ‌తాయి. హైబ్రీడ్ ఫండ్లు ఈక్వీటీ, డెట్ ఫండ్ల క‌ల‌యిక‌తో పెట్టుబ‌డి పెడ‌తాయి. సెబీ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఈక్వీటీ ఫండ్లు- లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్ ఫండ్ల‌లో వివిధ నిష్ప‌త్తుల‌లో మ‌దుపు చేస్తుంటాయి.

ఫండ్ హౌస్‌లు ప్ర‌తీ ప‌థ‌కానికి ఈ కింది మూడు ప‌త్రాల‌ను జారీ చేయాల్సి ఉంటుంది.

  1. కీ ఇన్ఫ‌ర్మేష‌న్ మెమోరాండ‌మ్ (కేఐఎమ్‌)
  2. స్కీమ్ ఇన్ఫ‌ర్మేష‌న్ డాక్యుమెంట్‌(ఎస్ఐఎమ్‌)
  3. స్టేట్‌మెంట్ ఆఫ్ అడిష‌న‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్‌

మ‌దుప‌రులు స్కీమ్‌లో మ‌దుపు చేసే ముందు పై మూడు ప‌త్రాల‌ను క్షుణంగా చ‌ద‌వి అర్థం చేసుకోవాలి. పై మూడు ప‌త్రాల‌లో పేర్కొన్న విధంగా మ‌దుపు చేసేందుకు అనుస‌రించే థీమ్ ఆధారంగా మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కం ఒక నిర్థిష్ట సూచిక‌ను బెంచ్‌మార్క్‌గా అనుస‌రిస్తూ ‘ఆల్ఫా’ (బెంచ్‌మార్క్ పైన రాబడి) ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది.

ప‌న్ను:
ఈక్వీటీలు: స‌మ‌యానికి త‌గిన‌ట్లు ప్ర‌భుత్వం ప‌న్ను విధానాల‌లో మార్పులు చేస్తుంది. ఇటీవ‌ల మార్పు చేసిన నియ‌మాల ప్ర‌కారం రూ. 1 ల‌క్ష పైన మూల‌ధ‌న రాబ‌డిపై 10 శాతం ప‌న్ను వ‌ర్తిస్తుంది. స్వ‌ల్ప కాలిక మూల‌ధ‌న రాబ‌డిపై 15 శాతం ప‌న్ను వ‌ర్తిస్తుంది. ఈక్వీటీ ప‌థ‌కాల నుంచి వ‌చ్చిన డివిడెండ్ ఆదాయంపై 10 శాతం(ఏఎమ్‌సీలు చెల్లిస్తాయి) ప‌న్ను వ‌ర్తిస్తుంది.

డెట్ ప‌థ‌కాలు:
36 నెల‌ల కంటే ఎక్కువ కాలం ఉన్న దీర్ఘ‌కాల పెట్టుబ‌డి రాబ‌డి (ఎల్‌టీసీజీ) ప‌థ‌కాల‌పై ఇండ‌క్సేష‌న్‌తో 20 శాతం ప‌న్ను వ‌ర్తిస్తుంది. 36 నెల‌ల కంటే త‌క్కువ కాలం ఉన్నస్వ‌ల్ప‌కాలిక పెట్టుబ‌డి రాబ‌డి(ఎస్‌టీసీజీ)ని ఆదాయానికి చేర్చి ప‌న్ను విధిస్తారు.

సెక్ష‌న్ 80సీ కింద ఈఎల్ఎస్ఎస్‌( ఈక్వీటీ లింకెడ్ సేవింగ్స్ స్కీమ్స్‌)కి మాత్ర‌మే ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. 3 సంవ‌త్స‌రాల లాక్‌-ఇన్‌-పిరియ‌డ్ ఉంటుంది.

రెగ్యూల‌ర్ ప్లాన్లు/ డైరెక్ట్ ప్లాన్లు:
రెగ్యూల‌ర్ ప్లాన్ల‌లో డిస్ట్రిబ్యూట‌ర్ క‌మీష‌న్ కింద అద‌న‌పు మొత్తాన్ని ఛార్జ్ చేస్తారు. మ‌దుప‌రులు డైరెక్ట్ ప్లాన్ల‌లో పెట్టుబ‌డి పెడితే డిస్ట్రిబ్యూట‌ర్ క‌మీష‌న్ ఉండ‌దు. అందువ‌ల్ల రెగ్యూల‌ర్ కంటే 1 నుంచి 1.5 శాతం ఖ‌ర్చు త‌గ్గుతుంది. దీర్ఘ‌కాలంలో వచ్చే రాబ‌డిపై దీని ప్ర‌భావం ఉంటుంది.

ఉదాహ‌ర‌ణ‌కి:
మీరు సిప్ విధానంలో నెల‌వారీగా రూ.1,000 చొప్పున 10 సంవ‌త్స‌రాలు ముదుపు చేస్తే రెగ్యుల‌ర్ ప్లాన్ వ‌చ్చే సీఏజీఆర్ వార్షిక రాబ‌డి 12 శాతం. 10 సంత్స‌రాలు పూర్త‌య్యే నాటికి మీరు రూ. 2.22 ల‌క్ష‌ల‌ను స‌మ‌కూర్చుకోవ‌చ్చు. ఇదే మొత్తాన్ని, ఇదే కాల‌ప‌రిమితికి డైరెక్ట్ ప్లాన్ లో మ‌దుపు చేయ‌డం ద్వారా వ‌చ్చే సీఏజీఆర్ వార్షిక రాబ‌డి 13.5 శాతం. అంటే కాల‌ప‌రిమితి పూర్త‌య్యే నాటికి రూ. 2.4 ల‌క్ష‌ల‌ను స‌మ‌కూర్చుకోవ‌చ్చు.

చివ‌రిగా:
షేర్ల‌లో మ‌దుపు చేయడం న‌ష్ట‌భ‌యంతో కూడుకుని ఉంటుంది. కాబ‌ట్టి మ్యూచువ‌ల్ ఫండ్లు ద్వారా పెట్టుబ‌డి చేయ‌డం మంచిద‌ని నిపుణులు సూచిస్తారు. మొద‌టి సారి SIP(సిస్ట‌మేటిక్ ఇన్‌వెస్ట్‌మెంట్ ప్లాన్) ద్వారా మ‌దుపు చేసే వారు ఇండెక్స్ ఫండ్ల‌తో ప్రారంభించ‌డం మంచిది. ఇండెక్స్ ఫండ్లు ఇండెక్స్ నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, సెన్సెక్స్ మొద‌లైన వాటి ఆదారంగా రాబ‌డినిస్తాయి. దీనితో ఫండ్ల ప‌నితీరుపై మ‌దుప‌ర్లకు అవ‌గాహ‌న‌ వ‌స్తుంది. ప్ర‌తీ సంవ‌త్స‌రం సిప్‌ను పెంచుకుంటూ ఉండాలి. మీకు వీటి గురించి అవ‌గాహ‌న ఏర్ప‌డిన అనంత‌రం, లార్జ్ క్యాప్ ఫండ్ల‌లో సిప్ ప్రారంభించ‌వ‌చ్చు. లార్జ్ క్యాప్ ఫండ్లు నిల‌క‌డ‌గా ఉంటాయి. దీర్ఘ‌కాలంలో(10 సంవ‌త్స‌రాలు అంత‌కంటే ఎక్కువ కాలం)లో మంచి రాబ‌డినిస్తాయి. మార్కెట్లో తిరోగ‌మ‌నంలో ఉన్న‌ప్ప‌టికీ సిప్‌ను కొన‌సాగించాలి. మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్లు స్వ‌ల్ప‌కాలంలో ఒడిదుడుక‌ల‌కు లోన‌వుతూఉంటాయి. ఒక్కోసారి పెట్టుబ‌డిని కూడా న‌ష్ట‌పోవాల్సి రావ‌చ్చు. అయితే దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డినిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని