మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి చేయాలా? యూలిప్స్ లోనా ?

ఈ రెండింటికి ఉన్న వ్య‌త్యాసాల‌ను తెలుసుకోవ‌డం ద్వారా ఏది అనుకూలంగా ఉంటుంద‌నేది నిర్ణ‌యించుకోవ‌చ్చు​​​​​​....

Published : 19 Dec 2020 11:27 IST

ఈ రెండింటికి ఉన్న వ్య‌త్యాసాల‌ను తెలుసుకోవ‌డం ద్వారా ఏది అనుకూలంగా ఉంటుంద‌నేది నిర్ణ‌యించుకోవ‌చ్చు​​​​​​​.

యూనిట్ లింకెడ్ ఇన్సురెన్స్ పాల‌సీలు (యూలిప్):

జీవిత బీమాతో పాటు పెట్టుబడుల‌ను క‌లిపి ఉండే దాన్ని యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలు (యూలిప్స్‌) అంటారు. యూలిప్స్‌ కోసం చెల్లించే ప్రీమియంను కొంత మొత్తం బీమా కోసం, ఛార్జీలను మినహాయించుకొని మిగతా సొమ్మును మ్యూచువల్‌ ఫండ్ల యూనిట్ల పెట్టుబడులకు వినియోగిస్తారు.

మ్యూచువ‌ల్ ఫండ్:

మ‌దుప‌ర్ల నుంచి స‌మీక‌రించిన నిధుల‌ను వివిధ పెట్టుబ‌డి సాధ‌నాల్లో మ‌దుపు చేసి రాబ‌డి పొందే వాటిని మ్యూచువ‌ల్ ఫండ్లు అంటారు. ఇవి సంపూర్ణంగా పెట్టుబ‌డిని ఉద్దేశించిన‌వి. వీటికి బీమా అనుసంధానం ఉండ‌దు.

ఈ రెండింటికి ఉన్న వ్య‌త్యాసాల‌ను తెలుసుకోవ‌డం ద్వారా ఏది అనుకూలంగా ఉంటుంద‌నేది నిర్ణ‌యించుకోవ‌చ్చు.

రాబ‌డి:

యూలిప్ ప‌థ‌కాల్లో మ‌దుప‌ర్లు చెల్లించే ప్రీమియంలో కొంత భాగం బీమా ప్రీమియం చెల్లింపు అవుతుంది. కాబ‌ట్టి మ‌దుప‌రి చెల్లించే మొత్తం ప్రీమియంపెట్టుబడుల్లోకి వెళ్ల‌దు. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోఅయితే బీమా ఉండ‌దు కానీ పెట్టుబ‌డిల్లోకి వెళ్తుంది. దీంతో రాబ‌డి కూడా యూలిప్ కంటే ఎక్కువ‌గానే వ‌స్తుంది. ప‌న్ను 10 శాతం వేసినా స‌రే యూలిప్‌ల కంటే మ్యూచువ‌ల్ ఫండ్లు ఆక‌ర్ష‌ణీయంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఛార్జీలు:

యూలిప్ ప‌థ‌కాల్లో ప్రీమియం అలోకేష‌న్ ఛార్జీలు, మోర్టాలిటీ ఛార్జీలు, ఫండ్ నిర్వ‌హ‌ణ ఛార్జీలు, పాల‌సీ నిర్వ‌హ‌ణ ఛార్జీలు స‌రెండ‌ర్ ఛార్జీలు, ఫండ్ స్విచ్ఛింగ్ ఛార్జీలు ఉంటాయి. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఫండ్ నిర్వహ‌ణ ఛార్జీలు మాత్ర‌మే ఉంటాయి. అయితే వీటిలో ఉండే ఎక్జిట్ లోడ్ ఉంటుంది. నిర్ణీత కాలం కంటే ముందు ఉప‌సంహ‌రిస్తే ఈ ఛార్జీలు ఉంటాయి.

ప్రీమియం అలోకేష‌న్ ఛార్జీలు:

యూలిప్ లో పెట్టుబ‌డి చేస్తే సంస్థ‌లు ముంద‌స్తుగానే రుసుములు వ‌సూలు చేస్తారు. ఇది మొద‌టి సంవ‌త్స‌రం ఎక్కువ‌గా ఉండి, క్రమంగా ఈ ఛార్జీలు త‌గ్గుతుంటాయి. యూలిప్ ల‌పై వ‌ర్తించే రుసుములు మొద‌టి సంవ‌త్స‌రం 5 శాతం వ‌ర‌కూ ఉంటే, త‌రువాతి సంవ‌త్స‌రాల్లో 2-5శాతం ఉంటుంది.

పాల‌సీ నిర్వ‌హ‌ణ ఛార్జీలు:

బీమా పాల‌సీ నిర్వ‌హ‌ణ‌కు బీమా సంస్థ‌లు వ‌సూలు చేసే రుసుము. చాలా సంద‌ర్భాల్లో ఇవి స్థిర‌మైన ధ‌ర‌ల‌న క‌లిగి ఉంటాయి. నెల‌కు రూ. 20-100 వ‌ర‌కూ ఉంటాయి ఈ ఛార్జీలు ప్ర‌తీ సంవ‌త్స‌రం 5శాతం చొప్పున పెరుగుతుంటాయి. ఈ రుసుముల‌ను బీమా సంస్థ‌లు నెల‌నెలా తీసుకుంటాయి. ఈ ఛార్జీల భారం వ‌ల్ల దీర్ఘ‌కాలంలో రాబ‌డిపై ప్ర‌భావం ప‌డుతుంది.

మోర్టాలిటీ ఛార్జీలు:

జీవిత బీమా పాల‌సీల‌పై మోర్టాలిటీ ఛార్జీలు చెల్లించాలి. ఇవి పాల‌సీదారుల వ‌య‌సు పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఎక్కువ వ‌య‌సు ఉండే వారికి మోర్టాలిటీ ఛార్జీలు ఎక్కువ‌గా ఉంటాయి.

ఫండ్ నిర్వ‌హ‌ణ ఛార్జీలు:

యూలిప్ లు పెట్టుబ‌డి చేసే మొత్తానికి గానూ నిర్వ‌హ‌ణ ఛార్జీల‌ను వ‌సూలు చేస్తాయి. ఇవి మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఫండ్ నిర్వ‌హ‌ణ ఛార్జీల్లానే ఉంటాయి.

లిక్విడిటీ:

లిక్విడిటీ ప‌రంగా చూస్తే యూలిప్ ల కంటే మ్యూచువ‌ల్ ఫండ్లు ఎక్కువ లిక్విడిటీ ఉంటుంది. ఓపెన్ ఎండెడ్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఎప్పుడైనా యూనిట్ల‌ను విక్ర‌యించి నిధులు పొందే వీలుంటుంది. క్లోజ్ ఎండెడ్ ఫండ్ల‌కు కొంత కాల‌ప‌రిమితి ఉంటుంది. అయితేవీటిని ఎక్స్ఛేంజీ ద్వారా నేరుగా విక్ర‌యించ‌వ‌చ్చు. యూలిప్‌ల‌కు ప్ర‌స్తుతం ఐదేళ్ల లాక్ ఇన్ పీరియ‌డ్ ఉంది.

ప‌న్నువిధానం:

ఈక్విటీ సంబంధిత పెట్టుబ‌డుల్లో దీర్ఘ‌కాల మూల‌ధ‌న రాబ‌డి రూ.1 ల‌క్ష‌కు మించితే ప‌న్ను 10 శాతం ఉంటుంది. యూలిప్ ప‌థ‌కాల్లో సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. ప‌న్ను మిన‌హాయింపు కోస‌మే అయితే దీని కంటే కూడా ఈఎల్ఎస్ఎస్ లో పెట్టుబ‌డి చేయ‌డం మంచిది. ఈఎల్ఎస్ఎస్ ప‌థ‌కాలు యూలిప్ ల కంటే మేల‌ని చెప్పాలి. వీటికి 3 ఏళ్ల లాక్ ఇన్ కాల‌ప‌రిమితి ఉంది. వీటిలో బీమా ఉండ‌దు కాబట్టి ఛార్జీలు త‌క్కువ‌గా ఉంటాయి. పెట్టుబ‌డిలో అధిక భాగం మ‌దుపుగా మారి మంచి రాబ‌డి వ‌చ్చేందుకు వీలుంటుంది.

యూలిప్‌ల్లో మ‌దుపు, బీమా రెండింటికీ క‌లిపి పెట్టుబ‌డి పెట్టే బ‌దులు త‌మ‌కు అవ‌స‌ర‌మైన బీమా హామీ మొత్తానికి ట‌ర్మ్ పాల‌సీని తీసుకుని మిగిలిన మొత్తాన్ని త‌మ ఆర్థిక ల‌క్ష్యాల‌ను అనుగుణంగా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి చేయ‌డం ద్వారా మంచి రాబ‌డిని పొంద‌వ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని