Atal Pension Yojana: అటల్‌ పెన్షన్‌ యోజనలోకి ఏడాదిలో కోటి మంది

Atal Pension Yojana New subscribers: సామాజిక భద్రతా పథకమైన ఏపీవైలో ఏడాదిలోనే కోటి మంది కొత్తగా చేరారు. ఇప్పటి వరకు నాలుగున్నర కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఈ పథకంలో ఉన్నారు.

Updated : 11 Mar 2023 13:17 IST

దిల్లీ: ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక భద్రతను కోరుకునే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మలి వయసులో పింఛను అందించేందుకు ఉద్దేశించిన ప్రభుత్వ పథకాలైన జాతీయ పింఛను పథకం (NPS), అటల్‌ పెన్షన్‌ యోజన (APY) వంటి వాటిల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన ఏడాదిలో ఈ పథకాల్లో చేరే కొత్త చందాదారుల సంఖ్య ఏకంగా 23 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. మార్చి 4 నాటికి ఈ స్కీముల్లో చేరిన వారి సంఖ్య 6.24 కోట్లకు చేరిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. ఒక్క అటల్‌ పెన్షన్‌ యోజనలోనే కోటి మంది కొత్తగా చేరారని పేర్కొంది.

Also Read: ఆన్‌లైన్‌లోనూ అట‌ల్ పెన్షన్‌ యోజ‌న ఖాతా తెరుచుకునే వీలు

‘‘నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌లో (NPS) 2022 మార్చి 5 నాటికి 508.47 లక్షల మంది (5.08 కోట్లు) చందాదారులు ఉండగా.. ఆ సంఖ్య 2023 మార్చి 4 నాటికి 624.81 లక్షలకు (6.24 కోట్లు) చేరింది. గతేడాదితో పోలిస్తే 22.88 శాతం పెరిగింది’’ అని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గతేడాది మార్చి 31 నాటికి ఎన్‌పీఎస్‌ చందాదారుల సంఖ్య 5.20 కోట్లుగా ఉంది. మొత్తం 6.24 కోట్ల మంది ఎన్‌పీఎస్‌ చందాదారుల్లో 23.86 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాగా... 60.72 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. 16.63 లక్షల మంది కార్పొరేట్‌ చందాదారులు ఉన్నారు.

Also Read: ఎన్‌పీఎస్‌ Vs ఏపీవై.. ఏది ఎంచుకోవాలి?

అటల్‌ పెన్షన్‌ స్కీమ్‌లోనే మార్చి 4 నాటికి 4.53 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. గతేడాది కంటే ఈ సంఖ్య 28.4 శాతం పెరిగింది. అటల్‌ పెన్షన్‌ యోజనను 2015 జూన్‌ 1న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకంలో చేరిన వారికి 60 ఏళ్ల తర్వాత రూ.1000 నుంచి రూ.5000 వేల వరకు నెలవారీ పింఛను అందిస్తారు. అయితే, 2022 అక్టోబర్‌ 1 నుంచి పన్ను చెల్లింపుదారులను ఈ పథకం నుంచి మినహాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సహా ఇతర సంఘటిత రంగానికి చెందిన వారు ఎన్‌పీఎస్‌ సభ్యులుగా ఉంటే.. అసంఘటిత రంగానికి చెందిన వారు ఏపీవై కిందకు వస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని