The Park Shares Listing: ‘ది పార్క్‌’ షేర్ల లిస్టింగ్‌.. ఒక్కో లాట్‌పై రూ.2,976 లాభం

The Park Shares Listing: ఇష్యూ ధర రూ.155తో పోలిస్తే బీఎస్‌ఈలో ‘ది పార్క్‌’ షేరు 20.65 శాతం లాభంతో రూ.187 దగ్గర అరంగేట్రం చేసింది.

Published : 12 Feb 2024 11:49 IST

దిల్లీ: ‘ది పార్క్‌’ పేరిట హోటళ్లు నిర్వహిస్తున్న ఏపీజే సురేంద్ర పార్క్‌ హోటల్స్‌ (Park Hotels IPO Listing) లిమిటెడ్‌ షేర్లు ఈరోజు తొలిసారి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయ్యాయి. ఇష్యూ ధర రూ.155తో పోలిస్తే బీఎస్‌ఈలో ఈ షేరు 20.65 శాతం లాభంతో రూ.187 దగ్గర అరంగేట్రం చేసింది. ఎన్‌ఎస్‌ఈలో 20 శాతం పుంజుకొని రూ.186 వద్ద ట్రేడింగ్‌ మొదలు పెట్టింది.

ఫిబ్రవరి 5-7 మధ్య జరిగిన ఈ కంపెనీ ఐపీఓలో కనీసం రూ.14,880తో 96 షేర్లను (ఒక లాట్‌) కొనుగోలు చేయాలని నిర్దేశించారు. ఈ లెక్కన లిస్టింగ్‌లో మదుపర్లు ఒక్కో లాట్‌పై రూ.2,976 లాభం పొందారు. ఐపీఓలో 59.66 రెట్ల షేర్లకు సబ్‌స్క్రిప్షన్‌ నమోదైంది. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన లభించింది. మొత్తం రూ.920 కోట్ల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చింది. ధరల శ్రేణిని రూ.147-155గా నిర్ణయించింది. రూ.600 కోట్ల విలువ చేసే కొత్త షేర్లతో పాటు రూ.320 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద అందుబాటులో ఉంచింది.

ఈ సంస్థ ది పార్క్‌, ది పార్క్‌ కలెక్షన్‌, జోన్‌ బై ది పార్క్‌, జోన్‌ కనెక్ట్‌ బై ది పార్క్‌, స్టాప్‌ బై జోన్‌ పేరుతో హోటళ్లను నిర్వహిస్తోంది. ఫ్లరీస్‌ పేరుతో రిటైల్‌ ఫుడ్‌, బెవరేజీల పరిశ్రమలోకీ అడుగుపెట్టింది. 2023 సెప్టెంబర్‌ 30 నాటికి 81 రెస్టారంట్లు, నైట్‌ క్లబ్‌లు, బార్లు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని