వాహన బీమా ప్రీమియంను తగ్గించుకోండిలా...

మీరు ప్రయాణించే కిలోమీటర్ల ఆధారంగా కారు బీమా ప్రీమియంను చెల్లించవచ్చు. కారు వినియోగదారులకు శుభవార్త. ఇకపై మీరు కారు బీమా కోసం పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.

Updated : 01 Jan 2021 20:18 IST

మీరు ప్రయాణించే కిలోమీటర్ల ఆధారంగా కారు బీమా ప్రీమియంను చెల్లించవచ్చు. కారు వినియోగదారులకు శుభవార్త. ఇకపై మీరు కారు బీమా కోసం పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రయాణించిన కిలోమీటర్ల ఆధారంగా కారు బీమా ప్రీమియం చెల్లించడానికి ఒక ఆప్షన్ అందుబాటలోకి వచ్చింది.

భారతీ యాక్సా జనరల్ ఇన్సూరెన్స్ : ఐఆర్డీఏఐ శాండ్‌బాక్స్ ప్రాజెక్ట్ కింద ప్రైవేట్ కార్ల యజమానుల కోసం ‘యూసేజ్ - బేస్డ్ మోటార్ ఇన్సూరెన్సు’ పాలసీలను విక్రయించడానికి భారతీ యాక్సా జనరల్ ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ వెబ్ అగ్రిగేటర్ పాలసీబజార్.కామ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. యూసేజ్ - బేస్డ్ మోటార్ ఇన్సూరెన్స్ ను ‘పే యాజ్ యూ డ్రైవ్’ అని కూడా పిలుస్తారు, కారు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించిందో దాని ఆధారంగా పాలసీదారులకు కారు ప్రీమియం చెల్లించడానికి అనుమతిస్తుంది. వినియోగదారుల మధ్య కారు వినియోగం చాలా వైవిధ్యంగా ఉన్నందున, తక్కువ డ్రైవ్ చేసేవారికి ప్రయోజనం చేకూరుస్తుంది.

ఈ ప్రోడక్ట్ కింద, పాలసీదారుడు ఒక సంవత్సరం పాటు వాహన వినియోగాన్ని ముందే ప్రకటించాలి. దీని ప్రకారం, బీమా ప్రీమియం ముందుగా ప్రకటించిన కిలో మీటర్ల ప్రకారం లెక్కిస్తారు. వినియోగదారులు వారి వినియోగ అవసరానికి అనుగుణంగా 2500 కిమీ., 5000 కిమీ., 7500 కిమీ అనే మూడు స్లాబ్‌లను ఎంచుకోవచ్చు.

పాలసీబజార్.కామ్ నుంచి భారతీ యాక్సా జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా ‘పే యాజ్ యూ డ్రైవ్’ పాలసీని పాలసీ హోల్డర్ మూడు సింపుల్ స్టెప్స్ లో కొనుగోలు చేయవచ్చు.

♦ వినియోగ విధానం ప్రకారం అందుబాటులో ఉన్న మూడు స్లాబ్‌ల నుంచి పాలసీదారుడు ప్లాన్ ను ఎంచుకోవాలి.

♦ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ కి అనుగుణంగా మీటర్ రీడింగ్, కేవైసీ వివరాలు, కస్టమర్ సమ్మతి పత్రాన్ని అందించాలి.

♦ ముందుగా ప్రకటించిన స్లాబ్ ప్రకారం, ప్రీమియం ప్రయోజనాన్ని పోస్ట్ ఫ్యాక్టరింగ్ చేసిన తరువాత ఓన్ డామేజ్ (ఓడీ) ప్రీమియంను లెక్కిస్తారు. జారీ చేసిన పాలసీకి ప్రామాణిక మోటారు ఓన్ డామేజ్ కవర్ కింద ఒక సంవత్సరం కాలపరిమితి ఉంటుంది.

♦ డిక్లేర్డ్ యూజ్ స్లాబ్ ప్రకారం, అదనపు ప్రీమియం ప్రయోజనాలను పొందడమే కాకుండా, పాలసీదారుడు పాలసీ కాలపరిమితి మధ్యలో అధిక స్లాబ్‌కు వెళ్లడానికి లేదా ప్రామాణిక మోటారు ఓన్ డామేజ్ కవర్‌కు మారే అవకాశం కూడా ఉంది.

♦ ఒకవేళ పాలసీదారుడు కిలోమీటర్ల ఉల్లంఘన విషయంలో పాలసీని పునరుద్ధరించకపోయినా, పాలసీ లైబిలిటీ కవరేజ్ పాలసీ మొత్తం కాలవ్యవధికి చెల్లుతుంది. అంతేకాకుండా, పాలసీ కాలపరిమితిలో తలెత్తే ఏదైనా థర్డ్ పార్టీ క్లెయిమ్ ప్రస్తుతమున్న లైబిలిటీ క్లెయిమ్ ప్రాక్టీస్ ప్రకారం పరిగణించబడుతుంది.

♦ బహుళ వాహనాలను కలిగి ఉండి, ప్రతి వాహనాన్ని ఎక్కువగా ఉపయోగించని వినియోగదారులకు పే యాజ్ యూ డ్రైవ్ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే వారు పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రజా రవాణా ద్వారా ప్రతిరోజూ ప్రయాణించే వారికి లేదా తరచుగా నగర పరిమితికి మించి ప్రయాణించేవారికి, అలాగే వారి వ్యక్తిగత వాహనాన్ని అరుదుగా ఉపయోగించే వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

ఎడెల్విస్ జనరల్ ఇన్సూరెన్స్ : ఇటీవల ఎడెల్విస్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ, ఎడెల్విస్ స్విచ్ పేరుతో యాప్ ఆధారిత ఆటో ఇన్సూరెన్స్ పాలసీని ప్రకటించింది. ఈ ప్రత్యేకమైన బీమా పథకం వాహన యజమానులకు వారు కోరుకున్నప్పుడల్లా పాలసీని ‘ఆన్’ మరియు ‘ఆఫ్’ చేయడానికి అనుమతిస్తుంది.

♦ డ్రైవర్ వయస్సు, అనుభవం ఆధారంగా బీమా మొత్తాన్ని లెక్కిస్తారని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు ఏ రోజు డ్రైవింగ్ చేస్తున్నారో అనే దానిపై ఆధారపడి వారి పాలసీ కవర్‌ను ‘ఆన్’ మరియు ‘ఆఫ్’ చేయడానికి మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించవచ్చు.

♦ ఒకవేళ మీరు వాహనం నడపకపోయినా, పాలసీ స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ, మీ వాహనం అగ్ని ప్రమాదానికి లేదా దొంగతనానికి గురైనా ఏడాది పొడవునా కవరేజ్ లభిస్తుందని ఎడెల్విస్ జనరల్ ఇన్సూరెన్స్ తెలిపింది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒకవేళ మీ వాహనం ప్రమాదానికి గురైనప్పుడు బీమా పాలసీ స్విచ్ ‘ఆన్’ లో ఉన్నప్పుడు మాత్రమే పాలసీ కవరేజ్ లభిస్తుంది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని