JioMart Express: 90 నిమిషాల్లో సరకులు ఇంటికి.. జియోమార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌తో క్విక్‌ కామర్స్‌లోకి రిలయన్స్‌

ఆన్‌లైన్‌లో ఆర్డరు తీసుకొని త్వరితగతిన ఇంటికి సరకులను చేర్చే క్విక్‌-కామర్స్‌ రంగంలోకి రిలయన్స్‌ రిటైల్‌ ప్రవేశించింది....

Published : 04 Jun 2022 18:00 IST

ముంబయి: ఆన్‌లైన్‌లో ఆర్డరు తీసుకొని త్వరితగతిన ఇంటికి సరకులను చేర్చే క్విక్‌-కామర్స్‌ (Q-Commerce) రంగంలోకి రిలయన్స్‌ రిటైల్‌ (Relaince Retail) ప్రవేశించింది. జియోమార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (JioMart Express) ద్వారా నవీ ముంబయిలో ఈ సేవల్ని ఇటీవలే ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా జియోమార్ట్‌ సేవలు అందుతున్న 200 నగరాలకు ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్ని కూడా విస్తరించనున్నట్లు సమాచారం.

దీంతో క్యూ-కామర్స్‌ (Q-Commerce)లో టాటా ఆధ్వర్యంలోని బిగ్‌-బాస్కెట్‌, జొమాటో మద్దతు ఉన్న బ్లింకిట్‌, స్విగ్గీకి చెందిన ఇన్‌స్టా మార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌ అనుబంధంగా ఉన్న జెప్టో.. వంటి సంస్థలో జియోమార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (JioMart Express) పోటీపడనుంది. అయితే, బ్లింకిట్‌, జెప్టో తరహాలో 10 నిమిషాల్లో కాకుండా.. 90 నిమిషాల్లో సరకులను ఇంటికి చేరుస్తామని రిలయన్స్‌ రిటైల్‌ హామీ ఇస్తోంది. ఆర్డరు విలువ రూ.199 దాటితే ఉచితంగానే వస్తువులను డెలివరీ చేస్తున్నట్లు సమాచారం. 

ప్రస్తుతానికి రిలయన్స్‌ రిటైల్‌ (Relaince Retail) స్టోర్లలోని నిత్యావసరాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, హోంకేర్‌ ఉత్పత్తులను మాత్రమే జియోమార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (JioMart Express)లో భాగంగా ప్రస్తుతానికి డెలివరీ చేస్తున్నారు. త్వరలో స్మార్ట్‌ఫోన్లు, ఔషధాల వంటి వాటిని కూడా అందజేసేందుకు యోచిస్తున్నామని కంపెనీ ఉన్నతాధికారులు తెలిపారు. కొన్ని నెలల క్రితం రిలయన్స్‌ మరో ప్రముఖ క్యూ-కామర్స్‌ (Q-Commerce) సంస్థ డుంజోలో 26 శాతం వాటాలను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో డుంజో ద్వారానే ఎక్స్‌ప్రెస్‌ సేవలు అందించనున్నట్లు తెలుస్తోంది. 

సంప్రదాయ ఇ-కామర్స్‌ (E-Commerce) సంస్థల ద్వారా ఆర్డర్‌ చేసే వస్తువుల డెలివరీకి కనీసం ఒకరోజైనా పడుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగానే ఇప్పుడు దేశంలో క్విక్‌-కామర్స్‌కి ఆదరణ పెరుగుతోంది. ఇంట్లో నిత్యం వాడే వంట సరకులు, ఆహార పదార్థాలు, స్టేషనరీ వస్తువులను నిమిషాల వ్యవధిలో ఇంటికి చేర్చాలన్నదే వీటి లక్ష్యం. ఇప్పటికే ఈ రంగంలో పలు సంస్థలు సేవలు అందిస్తున్నాయి. ఓ ప్రముఖ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం భారత్‌లో 0.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్న క్యూ-కామర్స్‌ పరిశ్రమ విలువ 2025 నాటికి 5 బిలియన్‌ డాలర్లకు వృద్ధి చెందే అవకాశం ఉందని అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని